Putta Madhukar | మంథని, ఆగస్టు 30: ఎద్దు ఏడ్చిన ఏవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడ్డది లేదని.. రైతును కన్నీళ్లు పెట్టించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడ ఎక్కువ కాలం ఉండదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మంథనిలోని పాత పెట్రోల్ పంపు రస్తాలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం గోదాంను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ రైతులతో కలిసి శనివారం సందర్శించారు. కేంద్రం నిర్వాహకుడితో మాట్లాడి యూరియా కోరతపై వివరాలు తెలుసుకున్నారు.
అయితే సదరు వ్యాపారి బాబురావు గోదాంలో 110 బస్తాలు ఉన్నాయని, ఇప్పటికే 40మంది రైతులకు టోకెన్లు తీసుకున్నారని వివరించారు. ఈ క్రమంలో మిగిలిన వాటి గురించి అడుగగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అగ్రోస్ రైతు సేవా కేంద్రం నిర్వాహకుడిపై పుట్ట మధూకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యాపారి, వ్యవసాయ అధికారులు, పోలీసుల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రస్తాలోని ట్రాఫిక్ సిగ్నల్స్ కింద ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఆనంతరం పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. మంత్రిగా ఉన్న మంథని ఎమ్మెల్యే శుక్రవారం మంథనికి వస్తున్నాడంటే యూరియా బస్తాలు వస్తాయని అనుకున్నామన్నారు.
కానీ ఆయన వేల మంది పోలీస్ పహారాలో వచ్చి రైతులను కలువకుండా వారి గోస వినకుండా మీటింగ్‌లు పెట్టుకుని వెళ్లిపోయాడన్నారు. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా, మంత్రిగా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా రైతులను పట్టించుకోకపోవడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా రైతుల కోసం పోరాడుతున్నామన్నారు. రాజ్యాంగాన్ని అనుసరించి తాము సామరస్యంగా రైతు సేవా కేంద్రం నిర్వాహకుడితో మాట్లాడితే పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడన్నారు. 110బస్తాలను 40మంది రైతులకు రెండు చొప్పున ఇస్తామని చెప్తుండగా వ్యవసాయ అధికారి మాత్రం రైతులకు 70బస్తాలు ఇస్తామని చెప్తున్నారన్నారు. మిగిలిన 40బస్తాల మాటేమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదన్నారు. మిగిలిన బస్తాలను రాత్రికి రాత్రి కాంగ్రెస్ నాయకులకు ఇస్తే వాళ్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారన్నారు.
మంథని ఎమ్మెల్యే నాయకత్వంలోనే యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతుందని, కల్వచర్లలో అక్రమంగా తరలిస్తున్న 100 బస్తాలను పట్టుకున్నారన్నారు. 40 బస్తాలపై సమాధానం చెప్పని వ్యవసాయ అధికారిపై చీటింగ్ కేసు పెట్టాలని, సదరు వ్యాపారిపై కేసు పెట్టి విచారణ చేసి అసలు దోషులను బయటకు తీయాలని పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. రైతు సేవా కేంద్రంలో జరిగిన వ్యవహారానికి మంథని ఎస్ఐ ప్రత్యక్ష సాక్షి అని ఆయన ముందే నిర్థారణ అయిందన్నారు. పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ రైతుల పట్ల అత్యుత్సాహం చూపడం సరికాదన్నారు. పోలీసులు రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేయాలే తప్ప కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకవద్దని ఆయన హితవు పలికారు.
మంత్రి ప్రాతినిధ్యం వహించే మంథని నియోజకవర్గ కేంద్రంలో రైతులు ఇలా యూరియా కోసం ఇబ్బందులు పడటం నిజంగా సిగ్గు చేటని ఇప్పటికైనా 420 హామీల కమిటీ చైర్మన్, మంత్రి, ఎమ్మెల్యే దీనిపై స్పందించి రైతులకు యూరియా కోరత లేకుండా చేయాలన్నారు. రైతుల కోసం ఎంతటి పోరాటం చేయడానికైనా తాము సిద్ధమేనని..ఎన్ని కేసులైనా భరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, కనవేన శ్రీనివాస్‌యాదవ్, పెగడ శ్రీనివాస్, ఆరెపల్లి కుమార్, కాయితీ సమ్మయ్య, గొబ్బూరి వంశీ, కొండా రవీందర్, పుట్ట రాములు, శంకెసి రవీందర్, నూనె కుమార్, పోలు కనకయ్యలతో పాటు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.