కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన ఓ వివాహితతో తమకు వివాహేతర సంబంధం ఉందని బొంగోని కార్తీక్ గౌడ్ (22)ప్రచారం చేస్తున్నాడని, పద్ధతి మార్చుకోకపోతే ఆ వివాహితతో అతనికే సంబంధం ఉన్నదని అందరికీ చెప్తామని గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు కొండాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి(ప్రస్తుత ఉపసర్పంచ్) వేధింపులకు గురి చేశారు. కార్తీక్, అతని కుటుంబ సభ్యుల పరువు తీస్తామని గత పది రోజుల నుంచి రాత్రి సమయంలో వారి ఇండ్లళ్లకు పిలిపించుకొని బెదిరించారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్తీక్ గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగగా, వెంటనే కుటుంబ సభ్యులు జమ్మికుంటలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. సుమారు 18 గంటల పాటు మృత్యువుతో పోరాడి శుక్రవారం ఉదయం మరణించాడు. మృతుడి అన్న బొంగోని సతీశ్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్టిరెడ్డి కొండాల్‌రెడ్డి, అల్లపురెడ్డి దేవేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆసిఫ్ తెలిపారు.
చెల్లీ నేను చనిపోతున్న
“కనపర్తి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు చిట్టిరెడ్డి కొండాల్‌రెడ్డి, అల్లపురెడ్డి దేవెందర్‌రెడ్డి ఆగడాలకు తాళలేక చెల్లీ నేను చనిపోతున్నా” అంటూ కార్తీక్ తన చెల్లెలికీ ఫోన్లో వీడియో కాల్ చేసి మాట్లాడుతూ పురుగుల మందుతాగాడు. బీజేపీ నాయకుల వేధింపులు భరించలేక పోతున్నానని గ్రామ శివారుకు వెళ్లి తన చెల్లెలికి చివరి సారిగా వీడియో కాల్ చేసి చెప్పాడు.
దీంతో కుటుంబ సభ్యులు కార్తీక్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి వెంటనే జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే కార్తీక్ తనను బెదిరింపులకు గురి చేసి, పురుగులమందు తాగడానికి కారణమైన కొండాల్‌రెడ్డి, దేవెందర్‌రెడ్డి పేర్లు చెప్పగా, ఈ కాల్ రికార్డు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కుటుంబ సభ్యుల ఆందోళన
కార్తీక్ మృతికి కారణమైన బీజేపీ నాయకులు చిట్టిరెడ్డి కొండాల్‌రెడ్డి, అల్లపురెడ్డి దేవెందర్రెడ్డిని శిక్షించాలంటూ జమ్మికుంట ప్రధాన రహదారిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. గ్రామస్తులతో కలిసి సుమారు గంటన్నర పాటు ధర్నా చేపట్టారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న జమ్మికుంట, వీణవంక పోలీసులు అక్కడికి చేరుకొని కార్తీక్ మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
బీజేపీ నాయకుల ఆగడాలు మితిమీరుతున్నాయి. తమ వివాహేతర సంబంధాన్ని యువకుడు ఎక్కడ బయటపెడతాడోనని ఇంటికి పిలిపించుకొని బెదిరింపులకు దిగడంతో తట్టుకోలేక ఓ యువకుడు నిండు ప్రాణాలొదిలాడు. వారి విషయాన్ని బయటపెడితే తనకే వివాహితతో సంబంధం ఉన్నదని అందరికీ చెప్తామని కొద్ది రోజులుగా వాళ్ల ఇళ్లలోకి పిలిపించుకొని అర్ధరాత్రి వరకు వేధింపులకు గురి చేశారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు చివరికి పురుగుల మందు తాగాడు. సుమారు 18 గంటలు మృత్యువుతో పోరాడి బీజేపీ నాయకులు ఆడిన ఆటలో ఓడి చివరి శ్వాస విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
– వీణవంక, సెప్టెంబర్ 29