కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 21 : ఆర్థికంగా బలహీనంగా ఉన్న దళితసామాజిక వర్గాన్ని ఆదుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దళితబంధు పథకం నిధుల పంపిణీలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నదని నియోజకవర్గ దళితబంధు లబ్దిదారులు ధ్వజమెత్తారు. తమ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన దళితబంధు పథకానికి సంబంధించి రెండో విడుత నిధులు విడుదల చేసేందుకు ఈ నెల 26న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 80 మందికి పైగా లబ్ధిదారులు తరలివచ్చి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, తమ ఖాతాల్లో జమయిన మొత్తంపై ఫ్రీజింగ్ విధించిన ప్రభుత్వం ఖమ్మం జిల్లా మదిర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని చింతకాని మండలంలో ఎలా పంపిణీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గానికో నీతి.. పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన హుజూరాబాద్ సెగ్మెంట్‌కో నీతా? అంటూ ప్రశ్నించారు. గత నెల 16న అక్కడ 15.62 కోట్లకు పైగా దళితబంధు నిధులు విడుదల చేసి, 847 మందికి చెక్కులు పంపిణీ చేశారని, కానీ, ఇక్కడ మాత్రం ప్రభుత్వం అందుకు భిన్నంగా నడుచుకోవడం వెనుక ఆంతర్యమేంటో చెప్పాలని నిలదీశారు. గత ప్రభుత్వం జమ చేసిన మొత్తాన్ని ఈ ప్రభుత్వం అడ్డుకోవడం దళితుల అభివృద్ధికి మోకాలడ్డడమేనని విమర్శించారు. ఫ్రీజింగ్ ఎత్తివేయకుండా తాత్సారం చేస్తుండడం చూస్తే దళితుల ఎదుగుదలపై ఉక్కుపాదం మోపుతుందనడానికి నిదర్శనమని స్పష్టం చేశారు. మొదటి విడుత జమైన నగదుతో దుకాణాల అద్దెతోపాటు హోల్‌సేల్ వ్యాపారులకు అడ్వాన్సులుగా ఇచ్చామని, రెండో విడుత రాక తమ పరిస్థితులు రెంటికీ చెడ్డ రేవడిలా మారాయని పలువురు మహిళా లబ్ధిదారులు కన్నీటి పర్యంతమయ్యారు. గత పదినెలలుగా తాము కలువని అధికారి లేడని, ఎక్కని గడప లేదని, అయినా తమపై కనీస కనికరం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఈనెల 26న నిర్వహించబోయే కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకోకుంటే హైదరాబాద్ వేదికగా ఆందోళనలు చేపడుతామని, సీఎం ఇంటి ఎదుటే చావుడప్పు కొడుతామంటూ అల్టిమేటం జారీ చేశారు. వినతిపత్రాలు అందజేసిన వారిలో కొలుగూరి నరేశ్, ఇనుగాల భిక్షపతి, కుమార్, అలువాల రాములు, సరిత, అరుణ, సౌజన్య, ఉదయ్‌కుమార్ ఉన్నారు.
దళితబంధు పథకంతో ఎంపికైన మాకు రెండుపూటలా పట్టెడన్నం దొరుకుతుందనే సంతోషంలో ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని ఆవిరి చేస్తున్నది. ఈ పథకం ద్వారా మా ఖాతాల్లో జమైన మొత్తాన్ని కూడా మేం విడిపించుకోకుండా అడ్డుతగులు తుండడం దుర్మార్గమైన చర్య. మా ఖాతాలపై ఫ్రీజింగ్ విధించడం చూస్తే దళితులు ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదగడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని స్పష్టమవుతున్నది. ప్రభుత్వ పాశవిక చర్యలను నిరసిస్తూ హుజూరాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపడుతం. నిరసన తెలుపుతం.
దళితుల అండదండలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ దళితులనే దగా చేసే ప్రయత్నం చేస్తుండడం బాధాకరం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాకు దళితబంధు పథకం ద్వారా ప్రయోజనం చేకూరితే, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని కాలరాస్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత చిల్లిగవ్వ లేకుండా విడుదల చేస్తామని చెప్పి, ఇప్పటికీ ఫ్రీజింగ్ ఎత్తేయకపోవడం దారుణం. కాంగ్రెస్ పార్టీకి దళితులే వెన్నెముక అని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తుంటే, రాష్ట్రంలో మాత్రం దళితులపై కాంగ్రెస్ ప్రభుత్వం దండయాత్ర చేస్తున్నది. ఇప్పటికైనా రెండో విడుత నిధులు విడుదల చేయడంపై ఈనెల 26న జరుగబోయే కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ఎదుటే ఆందోళనలు చేపడుతం.