Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 24: కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలోనూ ఆ దంపతులు మానవత్వం మరిచిపోలేదు. తమ కన్నీళ్లను దిగమింగుకొని అచేతన స్థితితో ఉన్న మరో నిరుపేద కుటుంబం కన్నీళ్లు తుడిచారు గోదావరిఖని కాకతీయ నగర్ కు చెందిన సిరిపురం శ్రీనివాస్ మమత దంపతులు. వీరి కుమారుడు సిరిపురం వంశీ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చేతికంది వచ్చిన చెట్టంత కొడుకు పోయాడన్న బాధలో ఉన్న ల దంపతులు తమ కష్టం మరొకరికి రావొద్దని కోరుకున్నారు.
నగరంలోని గంగానగర్ కు చెందిన మమతగిరి సతీష్ రోడ్డు ప్రమాదానికి గురై అచేతన స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో ఆ కుటుంబం రోజు గడవని దుస్థితిలో ఉందన్న విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న శ్రీనివాస్ మమత దంపతులు శుక్రవారం సతీశ్ కుటుంబంకు నెల రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు అందించి మానవత్వాన్ని బతికించారు. పలువురు కళాకారులు మాట్లాడుతూ చెట్టంత ఎదిగిన కొడుకు కళ్లెదుటే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తీరని దుఃఖంలో ఉన్న శ్రీనివాస్ దంపతులు కష్టాల్లో ఉన్న మరో కుటుంబంకు సాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.
వీరిని స్ఫూర్తిగా తీసుకొని దాతలు ముందుకు వచ్చి నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబంకు తోచిన సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సతీశ్ తల్లి శోభమ్మ, భార్య ఉమతోపాటు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వాణి, కళాకారులు మేజిక్ రాజా, కాసిపాక రాజమౌళి, బోడకుంట వెంకట్రాజం. వెంకటలక్ష్మి, మాదరి వాసు, బీరుక లక్ష్మణ్, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.