ఉమ్మడి కరీంనగర్ జిల్లా హస్తం పార్టీ అధినాయకుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది. బయట పడకుండానే.. ఆదిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు.. నాయకులకు, సాధారణ కార్యకర్తలకు శాపంగా మారుతున్నాయన్న విమర్శలు ఆ పార్టీలో వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇరువురు మంత్రుల మధ్య పొంతన పొసగక.. జిల్లా శ్రేణులు భారీగా నష్టపోతున్నారన్న చర్చ సాగుతోంది. దీనికి నిలువెత్తు నిదర్శనం.. ఊరించి ఉసూరుమనిపించిన కవ్వంపల్లి సత్యనారాయణ మంత్రి పదవే అన్న చర్చ ప్రస్తుతం పార్టీలో సాగుతుంది. డీసీసీ అధ్యక్షుడిగా పార్టీని నడిపించిన ఆయనకే న్యాయం జరగకపోతే.. ఇక మా సాధారణ నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతుండడంతో.. పార్టీ శ్రేణులు పూర్తిగా నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
కరీంనగర్, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుందా..? పైకి కనిపించకుండానే.. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాపై ఆదిపత్యాన్ని చాటుకునేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నాయా? ఫలితంగా.. ఎమ్మెల్యే నుంచి సాధారణ నాయకుడి వరకు.. న్యాయం జరగకుండా పోతుందా? ఈ విధానాలు హస్తం పార్టీపై ప్రతికూల ఫలితాలు చూపుతున్నాయా? ఫలితంగా నామినేటెడ్ పదవుల్లోనూ ఆలస్యం జరుగుతుందా..? ఈ వ్యవహారం వల్ల అభివృద్ధి పనులు పడకలేస్తున్నాయా? అంటే.. హస్తం పార్టీ వర్గాలు అవుననే చెబుతున్నాయి.
కరీంనగర్ జిల్లాను గుప్పిట్లో పెట్టుకొని పైచేయి సాధించేందుకు.. ఇద్దరు మంత్రులు బయట పడకుండా చాపకింద నీరులా నడుపుతున్న వ్యవహారాలు పార్టీ శ్రేణులకు రోజురోజుకూ ఇబ్బందిగా మారుతున్నాయన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఉద్దేశంతో చాలాకాలంగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న.. చాలా మంది నాయకులు తమకు సముచిత ప్రాధాన్యం దక్కుతుందని ఆశించారు. కానీ, ఒకరిద్దరికి మినహా.. నేటికీ ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో అందులో జిల్లా కేంద్రంలోని నాయకులకు న్యాయం జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
అంతేకాదు.. నామినేటడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన విషయంలోనూ ఒకరు ప్రతిపాదిస్తే.. మరో మంత్రి వాటిని అడ్డుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇచ్చిన సుడా చైర్మన్, గ్రంథాలయ చైర్మన్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వంటి వాటి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య ఉన్న పొరపచ్చాలు బాహాటంగానే బయట పడిన విషయం తెలిసిందే. చివరకు అధినాయకత్వం జోక్యం చేసుకొని.. వాటిని సర్దుబాటు చేసినా.. నేటికీ ఆ పొరపచ్చాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఒక మంత్రి వద్దకు వెళితే.. మరో మంత్రికి ఆగ్రహం వస్తున్న ఉద్దేశంలో చాలా మంది శ్రేణులు అయోమయంలో కొట్టామిట్టాడుతున్నారు. ప్రధానంగా నాయకుల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం కార్యకర్తలపై ప్రభావం చూపడమే కాదు.. చివరకు మానకొండూర్ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లిపైనా పడిందన్న చర్చ ప్రస్తుతం పార్టీలో సాగుతోంది. డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికలకు ముందే బాధ్యతలు తీసుకున్న కవ్వంపల్లి.. నాటి నుంచి నేటి వరకు.. ఆయనే కొనసాగుతున్నా మంత్రి పదవుల విషయంలో సముచిత న్యాయం జరగలేదన్న చర్చ ప్రస్తుతం ఆ పార్టీలో సాగుతోంది.
తనకి మంత్రి పదవి ఇస్తున్నట్లుగా.. అన్నీ ఛానళ్లలో స్క్రోలింగ్‌లు వచ్చాయి. పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో సంబురాలు జరుపుకున్నారు. చివరకు… కవ్వంపల్లికి కాకుండా.. ఉమ్మడి జిల్లా ధర్మపురికి చెందిన ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఇచ్చారన్న ప్రచారం సాగుతోంది. అంటే.. పదవి ఇస్తామని ఊరించి.. ఉసూరుమనిపించారన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతుండగా.. ప్రస్తుతం కవ్వంపల్లి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం పార్టీపైనా పడుతుందన్న చర్చ నడుస్తోంది. అయితే, కవ్వంపల్లికి మంత్రి పదవి రాకపోవడానికి ప్రధాన కారణం.. మంత్రుల మధ్య నెలకొన్న ఆదిపత్య పోరే అన్న చర్చ ప్రస్తుతం ఆ పార్టీలో హాట్‌హాట్‌గా సాగుతోంది.
ఇదొక్కటే కాదు.. కరీంనగర్ జిల్లా నుంచి చాలా మందికి ఇప్పటికే నామిటేడ్ పదవులు రావాల్సి ఉన్నా.. ప్రతిపాదనలు పంపడంలోనే ఆలస్యం జరుగుతుందన్న చర్చ సాగుతోంది. కొన్ని ప్రతిపాదనలు పంపినా.. వాటిని ఫాలో చేయడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రస్తుతం కరీంనగర్ జిల్లా వాసులు తమ సమస్యలు ఉంటే.. ఏ మంత్రి వద్దకు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరికి వారే.. నేను కరీంనగర్ జిల్లా మంత్రిని కాదంటూ చెపుతూనే.. ఇదే జిల్లాపై తమదైన ముద్రను వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు వర్గ పోరును పెంచడంతోపాటు.. శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయన్న చర్చ ప్రస్తుతం ఆ పార్టీలోనే జోరుగా సాగుతున్నది.
అభివృద్ధికి విఘాతం
గతంలో ఉన్న ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలు మార్లు ఉమ్మడి జిల్లా మీటింగ్ పెట్టారు. అయినా.. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నేటికీ పూర్తిస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పడలేదంటే.. అభివృద్ధికి ఎటువంటి విఘాతం కలుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా.. కరీంనగర్ జిల్లా కేంద్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా నేటికీ పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించలేదన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రధానంగా స్మార్ట్‌సిటీ కింద రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. తద్వారా వాటి ద్వారా చేపట్టిన పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గతంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో నిత్యం ఇచ్చిన తాగునీరు.. ఇప్పుడు రోజు విడిచి రోజు ఇస్తున్నారు. దీనిపై ఏనాడూ సమీక్ష లేదు. పట్టణ, పల్లె ప్రగతి కింద నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటు పడిపోతుంది. గతంలో చేసిన పనుల బిల్లులు రాక కాంట్రాక్టర్లు అవస్థలు పడుతున్నారు. రాజీవ్ యువ వికాసం కింద ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వారి పరిస్థితి ఏమిటో ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. రేషన్ కార్డులు కొత్తవి ఇస్తున్నా.. కొంత మందికి మూడు నెలల పాటురేషన్ ఆగిపోయింది. మరికొంత మందికి రావడం లేదని ప్రజావాణికి ఫిర్యాదులొస్తున్నాయి.
సీఎం అశ్యూరెన్స్ కింద కార్పొరేషన్‌కు దాదాపు రూ.130 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉంది. వాటిని పట్టించుకునే వారు లేరు. ఈ ప్రభావం అభివృద్ధి పనులపై స్పష్టంగా కనిపిస్తోంది. స్మార్ట్ సిటీ కింద చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చివరకు.. మున్సిపాలిటీల్లో స్ట్రీట్ లైట్లు కాలిపోతే.. కొత్తవి పెట్టలేని పరిస్థితి నెలకొన్నది. కాలం ముంచుకొస్తున్న తరుణంలో.. ఇంకా డిమాండ్‌కు తగిన యూరియా రాలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా విభిన్న సమస్యలున్నా.. వీటిపై సమీక్ష పెట్టకపోవడానికి ప్రధాన కారణం మంత్రుల మధ్య ఉన్న ప్రచ్ఛన్న యుద్ధమే కారణమన్న చర్చ ప్రస్తుతం ఆ పార్టీలో నడుస్తోంది. అలాగే.. చుట్టుపక్కల మున్సిపాలిటీలు, గ్రామాలు కొర్పొరేషన్లో విలీనం కావడంతో.. కొత్త డివిజన్ల ప్రక్రియ చేపట్టారు.
వీటిపై వందల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నిజానికి ఇలాంటి అంశంపై మంత్రులు ప్రత్యేక చొరవ చూపి దిశానిర్దేశం చేయాల్సి ఉండగా.. తమకెందులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, అయితే.. కొంత మందికి మాత్రమే సహకరిస్తున్నారని, తద్వారా.. ఇరువర్గాలకు చెందకుండా పార్టీని నమ్ముకొని ముందుకు సాగుతూ.. డివిజన్లపై ఆశలు పెట్టుకున్న నాయకులకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు ప్రస్తుతం ఆ పార్టీ నుంచే వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటికీ కారణం.. మంత్రుల మధ్య ఆదిపత్య పోరే అన్న అభిప్రాయాలు ప్రస్తుతం హస్తం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారాయి.