police station | ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 5 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మానుక లక్ష్మణ్ యారియా ఇస్తున్నారని గోదాము వద్దకు రాగా ఒకే యూరియా బస్తా ఇస్తామనడం, రైతులు ఎక్కువ మంది ఉండటం ఇక యూరియా సరిపోదేమో అనుకుని సీఎం రేవంత్ రెడ్డిపై తిట్ల దండకాన్ని అందుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ నాయకులు సదరు రైతుపై బీఆర్ఎస్ కార్యకర్తగా ముద్ర వేసి గురువారం పోలీస్ స్టేషన్లో ఫిదు చేశారు. దీంతో మానుక లక్ష్మణ్‌పై కేసు ఎస్ఐ రాల్రెడ్డి కేసు నమోదు చేశారు.
దీంతో శుక్రవారం ఉదయం తన ఇంటికి ఇద్దరు పోలీసులు రాగా అప్పటికే రైతులకు సమాచారం తెలిసి లక్ష్మణ్‌కు మద్దతుగా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నారు. విషయం తెలిసి పోలీసులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఈ సందర్భంగా రైతు లక్ష్మణ్ మాట్లాడుతూ తనకు రెండెకరాలు ఉండగా మరో మూడెకరాలు ఒక్కో ఎకరానికి రూ.15వేలు చొప్పున కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నానని తెలిపారు. రెండెకరాల క్రితం నాటేస్తే ఇప్పటి వరకు 10 బస్తాలు వేయాల్సి ఉండగా మూడు సార్లు తిరిగితే మూడు బస్తాలు వచ్చాయని, అవి సరిపోక పోవడంతో పొలం ఎర్రబారిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా వేయాల్సిన సమయంలో వేయక పోవడంతో పొలం ఎర్ర బారిందని ఇప్పటికే కౌలుకు తీసుకున్న మూడెకరాలు చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోయిందని, ఇంకా రెండెకరాల పరిస్థితి కూడా ఏమైతుందోనని ఆవేదనతో వీడియోలో మాట్లాడినట్లు చెప్పారు.
తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, తన పక్కనున్న పొలాలు గెలేసే పరిస్థితి ఉండగా తన పొలం ఇంకా మెరుగుపడడం లేదని వాపోయారు. ఇప్పటికే పొలానికి రూ.1.25లక్షలు ఖర్చు పెట్టానని, పెట్టుబడి అంతా నీళ్లల్లో పోసినట్లు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కలంగా నీరున్నా యూరియా లేక కండ్ల ముందు కరాబైతుంటే చూడలేక పోతున్నానని వాపోయారు. అందుకు సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహంతో మాట్లాడానని, గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది రాలేదని అన్నాడు. అదే సమయంలో ఐకేపీ గోదాంకు యూరియా బస్తా వచ్చిందని తెలిసి గోదాం వద్దకు వెళ్లా నని అక్కడ పెద్ద సంఖ్యలో రైతులు ఉండటంతో ఆవేశంతో యూరియా దొరకదనే ఉద్దేశంతో మాట్లాడానని అన్నారు.
రైతులు కూడా తనకు ఈ రోజు జరిగిందే ప్రశ్నించిన రైతుకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తాను రైతులందరికోసం మాట్లాడానని, తన ఒక్కడి కోసమే యూరియా అడగలేదని, తన లాగే ఎంతో మంది వరిపొలాలు ఎరబారినవని గుర్తు చేశారు. రైతు లక్ష్మణ్‌పై కేసు అయిన సమచారం తెలుసుకుని సుమారు 50 మంది రైతులు లక్ష్మణ్‌పై బీఆర్ఎస్ కార్యకర్త ముద్ర వేయడాన్ని ఖండించారు. ఆయనకు మద్దతుగా వారు పోలీస్ స్టేషన్ వరకు తరలివెళ్లారు.