బోయినపల్లి, మే 21: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కొదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది కేంద్రం అమలు చేస్తున్న ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ ఆస్యూరెన్స్ స్టాండర్స్)కు ఎంపిక కోసం రాత్రింబవళ్లు శ్రమించారు. జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణలో ఆరునెలలుగా మెరుగైన సేవలందించడంలో నిమగ్నమయ్యారు. జాతీయ నాణ్యాతాప్రమాణాలకు అనుగుణంగా రోగుల సేవలో తరించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మార్గదర్శకత్వాలను పాటిస్తూ ముందుకుసాగారు. దవాఖానలో మౌలిక వసతులు కల్పించారు. పచ్చదనం పెంపుపై దృష్టిపెట్టారు. నిరంతరాయంగా విద్యుత్, తాగునీటి సరాఫరా, శుభ్రతకు ప్రాధాన్యమిచ్చారు. గర్భిణులు, చిన్నారులు, ప్రతిరోజూ వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యమందించారు. గ్రామాలవారీగా గర్భిణుల గుర్తింపు, కాన్పు జరిగే వరకు నెలనెలా వైద్య పరీక్షలు ఇలా ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు సేవలందిస్తున్నారు.
రెండు నెలల క్రితం కేంద్ర బృందం రాక..
వైద్య సౌకర్యాలు, ఇక్కడి వసతులను పరిశీలించేందుకు రెండు నెలల క్రితం కేంద్ర నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) బృందం కొదురుపాక పీహెచ్సీని సందర్శించింది. ఆయా విభాగాల్లో అందుతున్న సేవలపై ఆరా తీసింది. ఓపీ, ఇన్పేషెంట్, ప్రసవాలు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ, దవాఖాన, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపు తీరును పరిశీలించింది. అందుతున్న సేవలకు సంబంధించి సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించింది. ఇందుకు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖకు సిఫారసు చేయగా, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి 88.85 ప్రమాణాలతో ఎన్క్వాస్ సర్టిఫికెట్ను ప్రదానం చేసింది. ఈ ధ్రువీకరణ పత్రానికి మూడేండ్ల వ్యాలిడిటీ ఉంటుంది. కేంద్రం ఏడాదికి రూ. 3లక్షల చొప్పున అదనపు నిధులు అందజేయనున్నది. కొదురుపాక పీహెచ్సీకి ఎన్క్వాస్ గుర్తింపు దక్కడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు వెద్యసిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత మెరుగైన సేవలందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అభిలషించారు.
గుర్తింపు దక్కడం సంతోషం..
ప్రభుత్వ దవాఖానల అభివృద్ధిపై కేసీఆర్ సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇందుకు విరివిగా నిధులు మంజూరు చేస్తున్నది. ఈ నిధులతోనే కొదురుపాక పీహెచ్సీని అభివృద్ధి చేసుకున్నం. ఇక్కడి సిబ్బంది సైతం నిరంతరం శ్రమించారు. రోగులు, గర్భిణులకు మెరుగైన సేవలందించారు. ఈ నేపథ్యంలోనే పీహెచ్సీకీ ఎన్క్వాస్ సర్టిఫికెట్ దక్కింది. జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషం. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి.
-జోగినపల్లి రవీందర్రావు, కొదురుపాక (బోయినపల్లి)
బాధ్యత పెరిగింది..
కొదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎన్క్వాస్ గుర్తింపు దక్కడం సంతోషంగా ఉన్నది. ఈ ఖ్యాతితో మాపై మరింత బాధ్యత పెరిగింది. వైద్య సిబ్బంది కృషి ఫలించింది. మంత్రి కేటీఆర్ చొరవ, కలెక్టర్ అనురాగ్ జయంతి, డీఎంహెచ్వో సుమన్మోహన్రావు, ఇతర ఉన్నతాధికారుల సహకారంతో సర్టిఫికెట్ లభించింది. మున్ముందు సైతం ఇదే తరహాలో సేవలందిస్తాం.
-రేణు ప్రియాంక వైద్యాధికారి, కొదురుపాక (బోయినపల్లి)