జగిత్యాల, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని రైతులకు పంట సాయంగా రైతుబంధు పేరిట ఎకరానికి రూ.5 వేల సాయాన్ని ప్రకటించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రైతు సంక్షేమం, పెట్టుబడి సాయం కోసం అమలు చేసిన రైతుబంధుపై ఐక్య రాజ్య సమితి సైతం ప్రశంసలు కురిపించింది. ఈ నేపథ్యంలో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ప్రధాని మోదీ సర్కార్ సైతం దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐదెకరాలలోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఏటా పంట సాయంగా రూ.6వేలు అందిస్తామని, అది కూడా మూడు విడుతల్లో అందజేస్తామని ప్రకటించింది. 2018 డిసెంబర్ నుంచి అమల్లోకి తెచ్చింది. కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద జగిత్యాల జిల్లాలో 2018 డిసెంబర్లో తొలి క్వార్టర్లో 1,44,545 మంది రైతులకు రూ.28.91 కోట్ల పంట సాయాన్ని అందించారు. ప్రతి ఏడాది ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో మూడు దఫాలుగా ఈ పంట సాయాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా జమచేస్తూ వస్తున్నారు. అయితే 19 క్వార్టర్లకు సంబంధించిన ప్రభుత్వం అందించిన పంట సాయాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతోంది. 2018 డిసెంబర్లో 1,44,545 మందికి పంట సాయంగా ఇచ్చిన ప్రభుత్వం 2019 ఏప్రిల్‌లో ఆ సంఖ్యను తగ్గించి వేసింది. కేవలం 1,43,166 మందికి మాత్రమే సాయం అందజేసింది. తర్వాత క్రమంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతూనే వచ్చింది. చివరకు గతేడాది డిసెంబర్ మాసంలో 19వ క్వార్టర్లో కేవలం 71,140 మంది రైతులకు మాత్రమే పంటసాయం అందజేశారు. ఆ ఆరేండ్ల వ్యవధిలో 73,405 మంది రైతులను ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పరిధి నుంచి తొలగించివేశారు. మొదటి క్వార్టర్లో రూ.28.91 కోట్ల పంటసాయం ఇచ్చిన కేంద్ర సర్కార్, 19వ క్వార్టర్ నాటికి కేవలం రూ.14.23 కోట్లు మాత్రమే సాయంగా ఇవ్వడం గమనార్హం.
.. శ్రీనివాస్‌ది కొడిమ్యాల మండలం సూరంపేట. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇతడు డిగ్రీ పూర్తి చేసినా, ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయంలోకి దిగాడు. రైతు, వ్యవసాయం ప్రాముఖ్యత అర్థం చేసుకున్న అతడికి వృత్తిపై అభిమానం పెరిగిపోయింది. 2018 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రారంభించి, ఐదెకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఏడాదిలో మూడు దఫాల్లో రూ.6 వేల పంట సాయం అందజేస్తున్నది. అయితే, సహజంగానే జాతీయభావాలు ఉన్న శ్రీనివాస్ బీజేపీకి గట్టి మద్దతుదారుడిగా మారిపోయాడు. 2019లో జరిగిన ఎన్నికల కోసం తన గ్రామంలో ఆ పార్టీ కోసం గట్టిగా పనిచేశాడు. రైతులందరినీ పోగేసి కిసాన్ సమ్మాన్ పథకాన్ని వివరించాడు. ఎన్నికలు ముగిసిపోయాయి. ఈ క్రమంలోనే 2019 జూన్‌లో శ్రీనివాస్‌కు వివాహం జరగగా, అతడి తండ్రి ఆయనకున్న నాలుగెకరాల్లో నుంచి రెండెకరాలు కొడుక్కు పట్టా చేశాడు. అనంతరం శ్రీనివాస్ మండల వ్యవసాయాధికారిని కలిసి తన పేరును రెండెకరాల భూమి ఉందని, కిసాన్ సమ్మాన్ పథకం మంజూరు చేయాలని దరఖాస్తు సమర్పించాడు. 2019 ఫిబ్రవరి 1వ తేదీ కంటే ముందు పట్టాదారులుగా ఉన్న వారికి మాత్రమే పథకం వర్తిస్తుందని, తర్వాత పట్టా అయిన వారికి రాదని, ప్రభుత్వం నిబంధనలు మార్చితే చెబుతానని ఏవో చెప్పడంతో కొంత నిరాశ చెందాడు. అయితే, ఇది జరిగి ఆరేండ్లు గడుస్తున్నా నిబంధనల్లో మార్పు రాకపోవడంతో శ్రీనివాస్ ఇప్పటి వరకు లబ్ధిదారుడిగా ఎంపిక కాలేదు. పెండ్లి అయిన కొత్తలో దరఖాస్తు చేసుకోగా, ఇప్పుడు ఇద్దరు పిల్లల తండ్రి అయినా పథకం రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం 2019 ఖరీఫ్ నుంచే వస్తుండడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. పథకాలు ప్రవేశపెడితే అర్హులైన వారికి లబ్ధి చేకూర్చాలి కాని, ఏండ్ల కొద్ది నిబంధనల పేరిట అర్హులకు నష్టం జరిగేలా ఉండవద్దని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.
జగిత్యాల జిల్లాలో పీఎం కిసాన్ సమ్మాన్ సాయం విషయంలో పెద్ద సంఖ్యలో రైతులు నిరాశకు లోనవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకానికి అర్హత సాధించి లబ్ధిని పొందడానికి సవాలక్ష కొర్రీలను ప్రభుత్వం పెట్టడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2018లో రైతుబంధు పథకం కింద 1,76,929 మంది రైతులకు రూ.310.97 కోట్ల సాయాన్ని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చేస్తే, అదే సంవత్సరం పీఎం కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 1,44,545 మంది రైతులకు మాత్రమే పథకాన్ని వర్తింపజేసింది. 32,384 మంది రైతులను వివిధ కారణాలు చూపుతూ పథకానికి ఎంపిక చేయలేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వం పథకంలో లబ్ధిదారులుగా ఎంపిక కావడానికి 2019 ఫిబ్రవరి 1వ తేదీని కటాఫ్ డేట్‌గా ప్రకటించింది. ఆ తేదీ కంటే ముందు పట్టాదారుడిగా ఉన్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ ప్రకటన తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ పథకంలోని లబ్ధిదారుల సంఖ్యను అనేక కారణాలను చూపుతూ తగ్గించి వేస్తూనే వస్తోంది. రైతులు ఆధార్‌కార్డును బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోకపోతే ప్రధానమంత్రి సమ్మాన్ నిధి ఇవ్వడం లేదు. ఆదాయ పన్నును చెల్లించే వారికి, ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే రైతులకు పథకాన్ని వర్తింపజేయడం లేదు. అలాగే కొత్తగా పట్టదారు పాసు పుస్తకాలు పొందే రైతులకు పథకాన్ని వర్తింపజేయడం లేదు. రేషన్‌కార్డులో ఒక్కరికి మాత్రమే కిసాన్ సమ్మాన్ నిధిని ఇస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు లేదా భార్య, భర్తలకు వేర్వేరుగా భూమి ఉన్నా వారిని పరిగణలోకి తీసుకోవడం లేదు.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి పెట్టిన కటాఫ్ తేదీని వెంటనే ఎత్తివేయాలి. ఈ నిబంధనల వల్ల చాలా ఇబ్బందవుతున్నది. ఈ నిబంధన ఎత్తివేస్తే నాలాంటి చాలామంది రైతులకు పీఎం కిసాన్ పథకం అందే అవకాశం ఉన్నది. 2019కి కేంద్ర ప్రభుత్వం కటాఫ్ పెడితే అప్పటి నుంచి నేటి వరకు చాలామంది రైతులు వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు, విక్రయించారు. వారిని పరిగణలోకి తీసుకోకపోవడం సరికాదు. ఐదేండ్లు అవుతున్నా ఇంత వరకు నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం కింద ఒక పైసా అందలేదు.
మోదీ పైసల్ ఒక్కసారి కూడా నాకు రాలేదు. పీఎం కిసాన్ సమ్మాన్ అని చెప్పుడు, వినుడే గానీ, నాకు మాత్రం వస్తలేవు. నాకు మూడెకరాల భూమి ఉన్నది. 2018 కంటే ముందు కొంచెం పట్టా భూమి ఉండేది. అప్పుడు దరఖాస్తు చేసుకున్నా పైసల్ రాలేదు. ఎందుకు రాలేదు సార్.. అని అడిగితే తెలువదన్నరు. తదుపరి 2019లో ఇంకొంచెం భూమి కొనుగోలు చేసినా. ఈ రెండు పత్రాలు సార్ల వద్దకు తీసుకుపోయి అందజేసినా లాభం లేదు. వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి, పాత పాసుబుక్, కొత్తగా కొనుగోలు చేసిన పాస్బుక్కుల వివరాలను ఆన్లైన్లో చేయించినా ఫలితం లేదు. తిరిగి తిరిగి యాష్టకచ్చింది. తిరుగుడు బంద్ చేసినా. రైతు బంధు మాత్రం ఎప్పుడు ఇబ్బంది కాలేదు. కరెక్ట్ టైమ్‌కు పడింది. పథకం ప్రవేశపెట్టడంతో పాటు, దాన్ని సక్కగా అమలు చేయాలి. లేకుంటే వదిలేయాలి. ఇట్లా మా రైతులను గోసపెట్టద్దు.
పీఎం కిసాన్ సమ్మాన్ సాయానికి సంబంధించిన అర్హత నిబంధనల్లో ఫిబ్రవరి 1, 2019 కటాఫ్ డేట్‌పై తీవ్రమైన నిరసన వ్యక్తమవుతున్నది. 2025 సంవత్సరం నడుస్తున్న తరుణంలో ఇంకా 2019 ఫిబ్రవరి 1వ తేదీని అర్హత తేదీగా గుర్తించడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరేండ్ల కాలంలో అనేక మంది పట్టాదారులు పెరిగారని, వారికి పథకం వర్తించపోవడం బాధాకరమంటున్నారు. ఈ ఏడాది యాసంగి సీజన్లో అర్హులైన రైతు బంధు లబ్ధిదారులు 2,39,818 మంది కాగా, ఈ సంఖ్యతో పోల్చితే పీఎం కిసాన్ సమ్మాన్ పథకంలో లబ్ధిదారుల సంఖ్య మూడో వంతు కూడా లేకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1.75 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు రావడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కటాఫ్ డేట్‌ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.