సన్నరకం ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్లో ఇప్పటి వరకు ఒక్క రైతు ఖాతాలో నయాపైసా కూడా జమ చేయలేదు. గత వానకాలంలో విక్రయించిన సన్నాలకు మూడు నెలల తర్వాత జమ చేయగా, ఈ యాసంగిలో బోనస్ ఎప్పుడు వస్తదో తెలియడం లేదు. సకాలంలో బోనస్ వస్తుందని ఆశించిన రైతులకు మరోసారి నిరాశే మిగులుతున్నది. రాష్ట్ర ఖజానా నిరాశాజనకంగా ఉందని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్న నేపథ్యంలో బోనస్ వస్తుందా.. లేదా..? అని రైతులు మీమాంసలో పడ్డారు. వానకాలం మాదిరిగానే ఆలస్యమవుతుందా.. లేదంటే ఆర్థిక పరిస్థితి బాగో లేదని ఎత్తేస్తారా..? అని ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్, మే 15(నమస్తే తెలంగాణ) : పండించిన ప్రతి పంటకూ కేంద్రం ఇచ్చే కనీస మద్దతు ధరపై 500 బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆ తర్వాత అనేక హామీలు తప్పినట్లుగానే దీనిని కూడా విస్మరించింది. అన్ని రకాల పంట ఉత్పత్తులపై బోనస్ ఇస్తామని చెప్పి తీరా కేవలం సన్నరకం ధాన్యానికి మాత్రమే వర్తిస్తుందని చేతులెత్తేసింది. కనీసం సన్న రకాలకైనా సరిగ్గా ఇస్తున్నారా..? అంటే అదీ లేదు. దొడ్డురకం ధాన్యంతో కలిపి సన్నరకాలను కొనుగోలు చేస్తున్నారు.
కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర 2,320 రెండు రకాల ధాన్యానికి చెల్లిస్తున్నారు. అయితే, సన్నాలపై క్వింటాల్‌కు 500 బోసన్ వస్తుందనే ఆశతో రైతులు ఈ రకం వరి సాగు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సన్న రకాలు తెచ్చిన తర్వాత కొలతలు నిర్వహిస్తున్నారు. అనుకున్న ప్రకారంగా ఉంటేనే సన్నాలుగా నిర్ధారించి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కొనుగోళ్లు పూర్తయిన తర్వాత దొడ్డు రకానికి ఇచ్చినట్టుగానే కనీస మద్దతు ధర ప్రకారం క్వింటాల్‌కు 2,320 రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. బోనస్ మాత్రం చెల్లించడం లేదు.
గత వానకాలంలో కొనుగోలు చేసిన సన్నాలకు సంబంధించిన బోనస్ మూడు నెలల తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా కొందరికి అది కూడా అందలేదు. ఈ సీజన్లోనైనా కొనుగోళ్లు జరిగిన వెంటనే కనీస మద్దతు ధరతోపాటు సన్నాలకు బోనస్ కూడా చెల్లిస్తారని రైతులు ఆశించారు. కానీ, ప్రభుత్వ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. గత ఇరవై ఇరవైదు రోజులుగా సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుండగా, బోనస్ ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతున్నది.
కరీంనగర్ జిల్లాలో 11.50 కోట్ల బోనస్ పెండింగ్
కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 32 వేలకుపైగా రైతుల నుంచి 2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. అందుకుగాను 487 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా 367 కోట్ల వరకు చెల్లించినట్లు తెలుస్తున్నది. అందులో దొడ్డు రకం 1.88 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, సన్న రకం సుమారు 23 వేల మెట్రిక్ టన్నుల వరకు ఉంది. దీనికి 11.50 కోట్ల వరకు రైతులకు బోనస్ రావాల్సి ఉన్నది. కానీ, ఇప్పటి వరకు ఒక్క రైతు ఖాతాలో కూడా సన్నాలకు బోనస్ జమ చేసింది లేదు.
స్పష్టత కరువు
సన్నరకం ధాన్యానికి ఇచ్చే బోనస్ విషయంలో అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. పైగా సన్నాలు దించుకోబోమని గత వానకాలం సీజన్లో మిల్లర్లు పేచీకి దిగడంతో నానా తంటాలు పడి అధికారులు వారిని ఒప్పించారు. ఈసారి కూడా ఇదే పరిస్థితి ఉన్నా మిల్లర్లు మాత్రం పెద్దగా అనుకూలంగా లేరు. అయితే, బోనస్ విషయంలో రైతులు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదు.
అది ప్రభుత్వం చేతిలో ఉందని, నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని చెబుతున్నారు. రాష్ట్ర ఖజానా ఆశించిన రీతిలో లేదని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో సన్నాలకు బోనస్ ఇస్తారా.. లేదా? అనే అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ సేకరించే సన్నరకం ధాన్యంపై ఎప్పటికప్పుడు బోనస్‌పై నివేదికలు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
అయితే, బోనస్ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంలో మాత్రం వారిదగ్గర స్పష్టత లేకుండా పోయింది. గత సీజన్‌లాగే ఆలస్యంగా రావచ్చని మాత్రమే చెబుతుండగా, రైతులకు మాత్రం భరోసా ఇవ్వడం లేదు. రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం సన్నాలను విరివిగా పండించాలని చెబుతున్నా.. బోనస్ విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తున్నది.