ఉమ్మడి జిల్లాలో కొత్తగా 40 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం కాగా, అందుకు సంబంధించిన కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రిజిస్ట్ట్రార్ వద్ద ఫైలు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ప్రతిపాదిత సంఘాలు క్షేత్రస్థాయిలో అమల్లోకి రానున్నాయి. ఇదిలా ఉండగా మరిన్ని ప్రాథమిక సంఘాలను పెంచాలంటూ రాజకీయ పరంగా అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తున్నది.
నిజానికి గతంలో ఏర్పాటు చేసిన సొసైటీల్లో చాలా వరకు మనుగడ లేక, ఆర్థిక లావా దేవీలు అంతంత మాత్రంగానే ఉండడంతో 73 సంఘాలను సమీప పీఏసీఎస్‌ల్లో విలీనం చేశారు. అయితే గతంలో పోలిస్తే కేడీసీసీబీ ఆర్థికంగా ముందుకెళ్తున్నది నిజమే అయినా.. మళ్లీ కొత్తగా ఏర్పాటు చేస్తే ఆయా సంఘాలు రాణిస్తాయా.. లేదా..? అన్న సందేహాలు వస్తున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని అధికారులు కొత్తగా 40 పీఏసీఎస్‌లను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్న తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, జనవరి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (కేడీసీసీబీ) 1921లో ఏర్పడింది. ప్రస్తు తం దీని పరిధిలో కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలతోపాటు కొంత భాగం.. జయశంకర్ భూపాల్పల్లి, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలున్నాయి. వీటి పరిధిలో 135 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్)లు నడుస్తున్నాయి. అందులో 132 సొసైటీలు కేడీసీసీబీ పరిధిలో ఉండగా.. మూడు సొసైటీలు మాత్రం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నాయి.
ఇవే కాకుండా బీ కేటగిరి పరిధిలో 250 నేత, చేనేత సంఘాలు, మరో 150 లేబర్, ఎంప్లాయిమెంట్, కళాకారుల సహకార సంఘాలున్నాయి. ఆరంభంలో బాగానే నడిచినా ఆ తర్వాత రాజకీయ జోక్యం వల్ల కేడీసీసీబీ నష్టాలబాటలో నడిచింది. 2005-06లో పూర్తి నష్టాల్లో కూరుకుపోయింది. సుమారు 59 కోట్ల నష్టాల్లో ఉండడంతో ఆనాడు మూసివేత దిశగా అడుగులుపడ్డాయి.
ఇక బ్యాంకు మనుగడ ప్రశ్నార్థకం అన్న అనుమానాలు వచ్చాయి. సహకార రంగంలో ఆనాడు ఉన్న లోపాలే కారణమన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమమయ్యాయి. 1921లో సభ్యులు తమ కోసం స్థాపించుకున్న సహకార కేంద్ర బ్యాంకులు ఆరంభంలో బాగానే నడిచినా.. రానురాను సహకార వ్యవస్థలో మితిమీరిన రాజకీయ జోక్యం.. సహకార మూలసూత్రాలను పక్కన పెట్టి సంఘ అధ్యక్షు లు, పాలకవర్గసభ్యులు తమ స్వార్థం కోసం నిర్వీర్యం చేయడం వంటి కారణాలు డిపాజిట్‌దారుల నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి. పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఎదురైంది.
దీంతో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సెక్షన్ 11(1) నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ బ్యాంకు మూసివేత స్థితికి చేరింది. కానీ, 2005 నుంచి మళ్లీ ఒక్కో మెట్టు అధిగమిస్తూ వచ్చింది. 2011-12 ఆర్థిక సంవత్సరం నాటికి నష్టాలను పూడ్చుకొని, 2015-16లో దేశంలోనే అత్యున్నత సహకార బ్యాంకుగా నాబార్డు లాంటి ప్రశంసలు అందుకున్నది. అక్కడి నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది. 2016లో అన్ని సంఘాలను కంప్యూటీకరణ చేసి ప్రైవేట్ బ్యాంకులకు ధీటుగా ఖాతాదారులకు మెరుగైన సేవలందించడంతోపాటు 2024-25 ఆర్థిక సంవత్సరానికి 7,500కోట్ల వ్యాపార లావాదేవీలకు చేరింది.
కరీంనగర్ జిల్లా : ప్రస్తుతం 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. కొత్తగా ఎనిమిది ప్రాంతాల్లో అంటే ఎలగందుల, చల్లూరు, ఇందుర్త్తి, గన్నేరువరం, గుండ్లపల్లి, బొమ్మకల్, రాములపల్లిలో ప్రతిపాదించారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా: ప్రస్తుతం 24 సంఘాలున్నాయి. కొత్తగా తొమ్మిది ప్రాంతాల్లో అంటే చెక్కపల్లి తంగళ్లపల్లి, బద్దెనపల్లి, నిమ్మపల్లి, వీర్నపల్లి, పె ద్దలింగాపూర్, కందికట్కూర్, రుద్రంగి, నర్సింగపూర్‌లో ప్రతిపాదించారు.
జగిత్యాల జిల్లా: 51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. కొత్తగా ఐదు ప్రాంతాల్లో మోరపల్లి, జాబితాపూర్, బుగ్గారం, మద్దునూరు, ధర్మారాజుపల్లె, సతారాం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
పెద్దపల్లి జిల్లా: ఇప్పటికే 20 సంఘాలుండగా కొత్తగా ఏడు ప్రాంతాల్లో కొలనూర్, రత్నాపూర్, గుంజపడుగు, వెంకటాపూర్, పుట్నూర్, అంతర్గాం, దొంగతుర్తిలో ప్రతిపాదించారు.
సిద్దిపేట, భూపాలపల్లి, హన్మకొండ : పూర్వ కరీంనగర్ జిల్లా విభజన జరిగినప్పుడు పలు మండలాలు ఆయా జిల్లాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయా మండలాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సైతం సదరు జిల్లాలకు వెళ్లాయి. అయితే ఆ సంఘాలన్నీ ప్రస్తుతం కేడీసీసీ బీ పరిధిలోనే నడుస్తున్నాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఆయా జిల్లాల నుంచి వచ్చిన విన్నపాలు, రాజకీయ నాయకుల సూచనల మేరకు.. కొత్తగా ప్రతిపాదనలు తయారు చేశారు.
సిద్దిపేట జిల్లాలో చూస్తే గతంలో పూర్వ జిల్లాకు చెందిన నాలుగు సహకార సంఘాలుండగా, ప్రస్తుతం కొత్త గా మూడు అంటే.. అక్కన్నపేట, రామవరం, వండ్లూరు బేగంపేటను ప్రతిపాదించారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నాలుగు ఉండగా.. కొత్తగా మరో నాలుగు అంటే ధన్వాడ, బోర్లగూడెం, కొయ్యూరు, పలిమెలను ప్రతిపాదించారు. అలాగే హన్మకొండ జిల్లాకు సంబంధించి పూర్వజిల్లాకు చెందిన రెండు సహకార సంఘాలు ఇప్పటికే ఉండగా, అక్కడ మూడు కొత్తగా శనిగరం, మర్రిపల్లిగూడెం, తిమ్మాపూర్‌ను ప్రతిపాదించారు.
ఉమ్మడి జిల్లాలో గతంలో 208 వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలుండేవి. అప్పట్లో చాలా సంఘాలు నష్టాలబాట పట్టాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉండడం, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోకపోవడం, లావాదేవీలపై పూర్తిస్థాయి పట్టు సాధించకపోవడం వంటి అనేక కారణాల్ల వల్ల నష్టాలను చవిచూశాయి. ఆ భారం మరింత పెరగకుండా ఉండాలంటే నష్టాల్లో ఉన్న సంఘాలను మూసివేయక తప్పదని అప్పట్లో విద్యనాథన్ కమిటీ పలు సిఫారసులు చేసింది. ఆ మేరకు ఆనాడు 73 సంఘాలను వాటి పరిధిలోని ఇతర సంఘాల్లో విలీనం చేశారు. దాంతో ఆనాడు సంఘాలు 208 నుంచి 135కు చేరాయి. ప్రస్తుతం కుదించిన సంఘాలే నడుస్తున్నాయి.
అయితే ఇటీవలి కాలంలో అన్ని ప్రాథమిక సహకార సంఘాలు మల్టీ బిజినెస్‌లు చేస్తుండడంతో లాభాలబాటలో పయనిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం చూస్తే కూడా ప్రతి గ్రామంలో ఏదో ఒక సహకార సంఘం ఉండాలన్న నిబంధన ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్తగా తెరపైకి 40 సంఘాల ప్రతిపాదనలను తయారు చేసినట్టు తెలుస్తున్నది. అయితే దీనిపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఇప్పటికీ కూడా కొన్ని సంఘాలు అక్కడికక్కడికే నడుస్తున్నాయి. కొత్త సంఘాలు ఏర్పడితే ఆయా సంఘాల పరిధిలో వ్యాపార విభజన జరిగే అవకాశమున్నది. ఆ ప్రభావం ఆయా సంఘాలపై పడుతుందన్న అభిప్రాయాలున్నాయి.
అంతేకాదు, సంఘాలు చిన్నవి కావడం వల్ల అక్కడ నిర్వహణతోపాటు వివిధ రకాల ఖర్చుల వల్ల వ్యయభారం కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఈ ప్రభావం తిరిగి కేడీసీసీబీపై కూడా చూపవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే రైతుల సౌలభ్యం దృష్ట్యా కొత్త సంఘాలను తెరపైకి తెస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సంఘాల మనుగడ ఎలా ఉంటుందన్నది మున్ముందు తేలనుండగా.. మరిన్ని ప్రాథమిక సహకార సంఘాలు పెంచాలని అధికారులపై పలువురు రాజకీయ నాయకులు ఒత్తిళ్లు తెస్తున్నట్టు తెలుస్తున్నది. పరిపాలన సౌలభ్యం అని చెప్పడం బాగానే ఉన్నా.. భారీగా పెరగడం వల్ల నిర్వహణ భారం పెరిగి, మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి.