సంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతాంగం అధిక లాభాలిచ్చే ఆయిల్‌పామ్ సాగువైపు మొగ్గు చూపుతున్నది. సర్కారు సైతం ఎకరాకు 16,800 సబ్సిడీ ఇస్తుండడంతో పంట వేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నది. గతేడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలో 390 మంది రైతులు 1274 ఎకరాల్లో సాగుచేయగా, ఈ యేడాది మరింతగా పెంచేందుకు సిరిసిల్ల జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నేటి నుంచి ఈ నెల 25 వరకు ఊరూరా అవగాహన సదస్సులు నిర్వహించనున్నది.
– రాజన్న సిరిసిల్ల, మే 15 (నమస్తే తెలంగాణ)
వరి, మక్క లాంటి పంటల సాగుతో రైతులకు ఆశించిన ఆదాయం రావడంలేదు. అలాగే నూ నెలు, పప్పులకు మన రాష్ట్రంలో తీవ్రమైన కొరత ఉన్నది. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుదీర్ఘకాలం ఆదాయాన్నిచ్చే ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెం చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రా ష్ట్రంలో పామాయిల్ తోటల సాగును ప్రోత్సహిస్తున్నది. ఐదేళ్ల తర్వాత నుంచి దిగుబడి వచ్చే ఈ తో టల సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ కూడా ఇస్తున్నది. రెండేళ్ల క్రితమే కేంద్ర బృందం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట, బోయినపల్లి, గంభీరావుపేట, చందుర్తి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పర్యటించింది. తోటల సాగుకు అనువుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి రాష్ట్రప్రభుత్వానికి నివేదించింది. నివేదికల ప్రకారం అధికారులు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, రాజమండ్రి తదితర జిల్లాల నుంచి పామాయిల్ మొక్కలను తెప్పించి జిల్లాలో నర్సరీని ఏర్పాటు చేశారు.
సాగువైపు రైతులు
ఆయిల్‌పామ్ తోటల సాగులో సిరిసిల్ల జిల్లాను అగ్రస్థానంలో నిలుపాలన్న లక్ష్యంతో ఉద్యాన వన శాఖ ముందుకు పోతున్నది. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సైతం తాను సైతం సాగు చేస్తానని ప్రకటించారు. ముస్తాబాద్ మండలం మోహినికుంటలో స్థలాన్ని కూడా ఎంపిక చేసుకున్నారు. అమాత్యుడు అందించిన స్ఫూర్తితో జిల్లా రైతులు సైతం ఈ పంట సాగుకు ముందుకొస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 390 మం ది రైతులు 1274 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు సాగు చేశారు. ఎకరాన మొక్కలకు 9650, అందులో అంతర పంటల సాగు కు 4200, నాలుగేళ్ల నిర్వహణ ఖర్చుల కో సం మొత్తం కలిపి 16,800 ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. ఇంకా చాలా మంది రైతులు తమ భూముల్లో సాగు చేసేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
నేటి నుంచి అవగాహన సదస్సులు
ఆయిల్‌పామ్ తోటల సాగుపై రైతులను చైతన్యం చేసేందుకు ఉద్యాన వన శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఈనెల 16నుంచి 25వరకు ఊరూరా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. తోటల సాగుపై అవగాహన కల్పించనున్నారు. ఈ సదస్సులకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొని ప్రోత్సహించనున్నారు.
16న గంభీరావుపేట మండలం నర్మాల, తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్, ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్, చందుర్తి మండలం మర్రిగడ్డ, కోనరావుపేట, వేముల వాడ అర్బన్ మండలం నాంపెల్లి
17న సముద్రాలింగాపూర్, ఇల్లంతకుంట మండలం పొత్తూరు. ముస్తాబాద్ మండలం పోతుగల్, సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలం తాడూరు, వీర్నపల్లి
18న గంభీరావుపేట మండలం దమ్మన్నపేట, ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, ముస్తాబాద్ మండలం బందనకల్, సిరిసిల్ల అర్బన్ మండలం బోనాల, బద్దెనపల్లి, వెంకటాపూర్, నిజామాబాద్, శాత్రాజుపల్లి
19న భీముని మల్లారెడ్డిపేట, పెద్దలింగాపూర్, ఆవునూరు, తంగళ్లపల్లి, గొల్లపల్లి, కొదురుపాక, మూడపల్లి, సుద్దాల, బొల్లారం
20న చందుర్తి మండలం లింగంపేట, ఇల్లంత కుంట మండలం దాచారం, ముస్తాబాద్ మండలం చీకోడు, నేరెళ్ల, గర్జనపల్లి, కోరెం, మల్యాల, నిమ్మపల్లి
22న గంభీరావుపేట, రేపాక, నామాపూర్, జిల్లెల్ల, ఎల్లారెడ్డిపేట
23న వల్లంపట్ల, మద్దికుంట, విలాసాగర్, బావుసాయిపేట్
24న ఇల్లంతకుంట, ముస్తాబాద్, బొప్పాపూర్,
చందుర్తి, రుద్రంగి
25న బోయినిపల్లి, మానాల లాభాదాయక పంట
ఆయిల్ పాం లాభాదాయక పంట. నలభై ఏండ్ల పాటు నిర్వహణ ఖర్చులు ఉండవు. అధిక దిగు బడి వస్తుంది. అంతర పంటలు వేసుకోవచ్చు. తోటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రో త్సాహాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో సాగు పెంచడమే లక్ష్యంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారు.
– జ్యోతి. జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్
20 ఎకరాల్లో సాగు చేసిన..
ఆయిల్ పాం పంటను 20 ఎకరాల్లో సాగు చేసిన. ఎకరానికి సుమారు 54 మొక్కలు నాటిన. అధికారులు ఏడాది వయస్సు గల మొక్కను అందిస్తున్నారు. ఇందులో అంతర పంటలుగా వరి, చెరుకు మినహా అన్నింటిని వేసుకోవచ్చు. నాలుగేండ్లకే దిగుబడి ప్రారంభమవుతుంది. నిర్వాహణ ఖర్చులు, శ్రమ తక్కువ. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే అవకాశముండదు.
కృష్ణదేవరావు, సింగిల్ విండో చైర్మన్ (రుద్రవరం)