Food poison | ధర్మారం, నవంబర్ 7 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని 36 గొర్రెలు మరణించాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో 4 గొర్రెల మందలు ఉన్నాయి. పెంపకందారులు గొర్రెలను మేత కోసం కోసిన వరి పొలాల్లోకి తోలుకెల్లారు. రెండు రోజులుగా గ్రామ శివారులో గొర్రెలు మేస్తున్నాయి. ఆ ప్రాంతంలో విషాహారం తిని అస్వస్థకు గురై గురువారం 18 గొర్రెలు మరణించాయి. మరుసటి రోజు శుక్రవారం కూడా మరో 18 గొర్రెలు అస్వస్థతో మరణించాయి.
మొట్టే తిరుపతి-8, ఈర్ల మల్లయ్య-6, అచ్చె రాజయ్య-5, అపాల శ్రీనివాస్-5, చంద్రయ్య-4, కచ్చు పోచయ్య-3, చిమ్మాల్లా రవి-3, ఈర్ల భూమయ్య-2 చొప్పున మూగజీవాలు మరణించాయి. వీటి విలువ సుమారు రూ.3 లక్షల60 వేలు ఉంటుందని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో గొర్రెలు మరణించడంతో పెంపకందారులు కన్నీరుమున్నీరయ్యారు. మరో 40 మూగజీవాలు అస్వస్థతో ఉన్నట్లు వారు తెలిపారు.
సమాచారం అందడంతో ధర్మారం వెటర్నరీ డాక్టర్ అజయ్ కుమార్ గ్రామానికి వెళ్లి అస్వస్థకు గురైన గొర్రెలకు చికిత్స అందించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి గ్రామానికి వెళ్లి నష్టపోయిన పెంపకందారులను పరామర్శించారు. మృతి చెందిన మూగజీవాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని గొర్రెల పెంపకం దారులు విజ్ఞప్తి చేశారు.