కరీంనగర్ తెలంగాణచౌక్, సెప్టెంబర్ 29: భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత వాతావరణం అందించడానికి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చామని, దశలవారీగా డీజిల్ బస్సులు తొలగిస్తామని, పత్రి పల్లెకూ బస్సులు నడిపిస్తామని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కరీంనగర్ రీజియన్‌కు కేటాయించిన 35 సూపర్ లగ్జరీ ఎలక్ట్రికల్ బస్సులను స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో సంస్థ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్, మానకొండూర్, చొప్పదండి, జగిత్యాల ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్‌కుమార్, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్‌దేశాయి, మేయర్ సునీల్‌రావు, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. డీజిల్ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు కాలుష్య రహితం కోసం 2,500 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయగా, వెయ్యి బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. రానున్న రోజుల్లో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగిస్తామన్నారు.
త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి టీజీ ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. దసరాలోగా ఉద్యోగులకు బాండ్ల రూపంలో ఉన్న బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 92 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకోగా, సంస్థకు రూ.3,200 కోట్ల ఆదాయం చేకూరిందన్నారు. గ్రామ సమాఖ్య సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయిస్తామని తెలిపారు.
ప్రయాణికులతోనే సంస్థకు మనుగడ
ప్రయాణికుల మన్ననలతోనే ఆర్టీసీ మనుగడ కొనసాగుతున్నదని సంస్థ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చి 300 రోజులు అవుతుందని, ఇప్పటివరకు కరీంనగర్ రీజియన్‌లో 2 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో 500 ఎలక్ట్రిక్ బస్సులు నడస్తున్నాయని, మరో 500 బస్సులను కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌కు కేటాయించామన్నారు.
త్వరలోనే నిజామాబాద్, వరంగల్ రీజియన్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపారు. బస్టాండ్లలో ప్రయాణికులకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముణిశేఖర్, రీజియన్ మేనేజర్ సుచరిత, డిప్యూటీ ఆర్ఎంలు భూపతి రెడ్డి, సత్యనారాయణ, డీఎంలు మల్లయ్య, విజయమాధురి పాల్గొన్నారు.