e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home కరీంనగర్ నేత కార్మికుల సంక్షేమమే ధ్యేయం

నేత కార్మికుల సంక్షేమమే ధ్యేయం

కార్మికులు నైపుణ్యంతో పని చేస్తున్నారు
వారి కష్టానికి తగిన కూలీ వచ్చేలా కృషి చేస్తాం
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌
అధికారులు, వస్త్ర ఉత్పత్తి సంఘాల యజమానులతో సమావేశం

సిరిసిల్ల/కలెక్టరేట్‌, జూలై 30 : నేత కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, కార్మికులు నైపుణ్యంతో పని చేస్తున్నారని, వారి కష్టానికి తగిన కూలీ వచ్చేలా కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో జౌళీ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యార్‌, జాయింట్‌ డైరెక్టర్‌ తస్లీమా, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, అదనపు కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌, జౌళీ శాఖ అధికారులు, వస్త్ర ఉత్పత్తి సంఘాల యజమానులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని నేతన్నలు నైపుణ్యంతో పని చేస్తున్నారని, తద్వారా బతుకమ్మ చీరల ఉత్పత్తి సకాలంలో, నాణ్యతతో పూర్తవుతున్నాయని చెప్పారు. సిరిసిల్ల నేత కార్మికులు ఇప్పటి వరకు రూ.2 వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఆర్డర్లు పూర్తి చేశారని తెలిపారు. గత సంవత్సరం కరోనా వల్ల వస్త్ర పరిశ్రమ కాస్త దెబ్బతిన్నదని, డిజైన్లు ఎక్కువగా ఉన్నందున ఎక్కువ మరమగ్గాలు నడుపడం కార్మికులకు కష్టమవుతుందని, తద్వారా వారికి వేతనం తగ్గే అవకాశం ఉందని యజమానులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే, గతంలో ఉత్పత్తి చేసిన వస్ర్తానికి జౌళీ శాఖ అధికారులు నాణ్యత సరిగా లేదని పెనాల్టీ వేశారని, దానిని రద్దు చేయాలని విన్నవించారు.

దాబీ, జకార్డులు ఈ సంవత్సరం మాత్రమే పరిచయం చేశామని, ఎక్కువ పని ఒత్తిడి కావడంతోనే ఎక్కువ మరమగ్గాలు నడపడానికి కార్మికులు సుముఖత చూపట్లేదని, వారికి మీటరు వస్ర్తానికి రూ.1.50 పెంచాలని, యార్న్‌ సబ్సిడీ పెంచితే కాస్త ఇబ్బంది తగ్గుతుందని చెప్పారు. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి 3 కోట్ల 50 లక్షల మీటర్ల వస్త్రం తయారైందని వెల్లడించారు. ఇక్కడ ఉత్పత్తి అయిన వస్త్ర నాణ్యతను చెక్‌ చేయడంలో ఆలస్యం చేయకుండా ప్రైవేట్‌ కంపెనీలకు పంపించి ప్రక్రియను త్వరగా పూర్తయ్యేలా చూడాలని టెస్కో జనరల్‌ మేనేజర్‌ యాదగిరి మంత్రికి సూచించారు. గతంలో ఉత్పత్తి చేసిన వస్ర్తానికి పెనాల్టీ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చర్చించి, యజమానులకు తెలిపి అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు.

- Advertisement -

యార్న్‌ డిపో ఏర్పాటుకు చర్యలు
సిరిసిల్లలో తయారయ్యే వస్ర్తానికి కావాల్సిన యార్న్‌ డిపోను ఏర్పాటు చేసేలా స్పిన్నింగ్‌ మిల్లుల యజమానులతో చర్చలు జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. తద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ప్రతినిధులు వారి మరమగ్గాల పనితీరును మంత్రికి ల్యాప్‌టాప్‌ ద్వారా వివరించి, ఆ మగ్గాల మీద తయారు చేసిన వస్ర్తాన్ని అందజేశారు. ఈ మగ్గాలను సిరిసిల్లకు పరిచ యం చేసేలా కాటన్‌ వస్త్ర పరిశ్రమ యజమానులు శ్రద్ధ చూపాలని మంత్రి సూచించారు. టెక్స్‌టైల్‌ పార్కులో మరమగ్గాలకు సంబంధించి సమస్యలు ఉంటే త్వరితగతిన పరిష్కరించుకోవాలన్నారు. కార్మికుల కోసం నిర్మించిన క్యాంటీన్‌ను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అలాగే, టెక్స్‌టైల్‌ పార్కు లో కార్మికుల కోసం ఆరోగ్య చికిత్స కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. సోలార్‌ సిస్టమ్‌ ద్వారా విద్యుత్‌ ఏర్పాటు చేసేలా చూస్తామని, ఎన్ని మెగావాట్ల విద్యుత్‌ అవసరం అవుతుందనే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలి
ముస్తాబాద్‌ మండలంలో డబుల్‌ బెడ్రూం ఇండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ముస్తాబాద్‌ మండలం అభివృద్ధిపై అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తూ ఇండ్ల నిర్మాణ పనులు చేయాలని సర్పంచ్‌లకు సూచించారు. పూర్తయిన వాటికి లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలో అనువైన స్థలం గుర్తించి ఒక పరిశ్రమను స్థాపించేలా చూస్తామని హామీ ఇచ్చారు. మండలంలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలిగామని, ఎగు వ మానేరు కాల్వల ద్వారా అన్ని గ్రామాలకు నీళ్లు వస్తాయని తెలిపారు. ముస్తాబాద్‌ నుంచి దుబ్బాకకు డబుల్‌ రోడ్డు నిర్మిస్తామన్నారు. ముస్తాబాద్‌ నుంచి రాళ్లపేట రోడ్డు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలో అవసరమైన వంతెనలను నిర్మిస్తామని, గ్రామా ల్లో ప్రగతిలో ఉన్న పనులను పూర్తి చేయడానికి సర్పంచ్‌, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. అన్ని గ్రామాల్లో రోడ్ల వెంబడి నాటిన మొక్కలు బాగున్నాయన్నారు.

డంప్‌ యార్డులు, సేంద్రియ ఎరువు తయారీకి కంపోస్ట్‌ షెడ్‌లు, వైకుంఠథామాలు నిర్మించడం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కితాబునిచ్చారు. దేశంలోని ఇతర రాష్ర్టాల్లోని గ్రామాల్లో ఇలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల విభాగాలను మంత్రి అభినందించారు. గ్రామాలకు – మండలానికి అనుసంధానకర్తగా ఎంపీటీసీ, మండలానికి – జిల్లాకు అనుసంధానకర్తగా జడ్పీటీసీ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల కోణంలో ఆలోచించాలన్నారు. సమీక్షా సమావేశాల్లో డిప్యూటీ డైరెక్టర్‌ అశోక్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, టెస్కో జనరల్‌ మేనేజర్‌ యాదగిరి, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవో రవీందర్‌, డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి, పాలిస్టర్‌, కాటన్‌ అసోసియేషన్‌ యజమానులు, ముస్తాబాద్‌ మండల జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీపీ జనగామ శరత్‌రావు, ఎంపీడీవో శ్రీమతి రమాదేవి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

సీసీ కెమెరాలు ప్రారంభం
సిరిసిల్ల టౌన్‌, జూలై 30: జిల్లా కేంద్రంలోని 19వ వార్డులో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను శుక్రవారం మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. పెద్దూరులోని అపెరల్‌ పార్కులో గోకుల్‌దాస్‌ ఇమేజెస్‌ సంస్థ ఏర్పాటుచేయనున్న గార్మెంట్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సిరిసిల్లకు చేరుకున్నారు. 19వ వార్డులో స్థానిక కౌన్సిలర్‌ అన్నారం శ్రీనివాస్‌ నివాసంలో మంత్రి కేటీఆర్‌ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను లాంఛనంగా ప్రారంభించారు. సీసీ కెమెరాలు భద్రతతో పాటు నేరాలు జరగకుండా దోహదపడుతాయన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు కౌన్సిలర్‌, పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూ రు రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana