కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 9 : నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదని జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామాని చెందిన 30 మంది మహిళలు ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల మేరకు ఇళ్లు పొందేందుకు అన్ని అర్హతలున్నా, తమకు అన్యాయం చేశారని, ఇండ్లునోళ్లకే మళ్లీ ఇచ్చారని మండిపడ్డారు. అధికారులు, కాంగ్రెస్సోళ్లు కుమ్మక్కై వాళ్ల మద్దతుదారులకే కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు మంజూరు చేయడం లేదో చెప్పే వరకు కదిలేది లేదని ప్రధానం ద్వారం ఎదుట భీష్మించుకుని కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమవి రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులని, తమకు గూడు లేక అద్దె ఇళ్లలో కాలం వెల్లదీస్తున్నామని వాపోయారు.
తమకు ఇందిరమ్మ ఇళ్లు వస్తాయన్న ఆశతో ఉంటే, ఇందిరమ్మ కమిటీలు తమ నోట్లో మట్టికొట్టాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కాంగ్రెస్ నాయకుల తొత్తులుగా మారారని, ముందుగా ఎంపిక చేసిన జాబితాలో తమ పేర్లు ఉన్నాయని, తాజాగా విడుదల చేసిన జాబితాలో మాత్రం చోటు దక్కలేదని కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు, కాంగ్రెస్ నేతలకు శాపనార్థాలు పెడుతూ కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట గంటకు పైగా బైఠాయించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరుగుతున్న ప్రజావాణికి తరలివెళ్లి కలెక్టర్ ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. ఈ ఆందోళనలో లక్ష్మి, ప్రియాంక, భారతి, దూడపాక వాణి, పద్మ, మంజుల, మమత, రైసున్నీసా, సుమలత పాల్గొన్నారు.