కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 7 : కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానానికి శుక్రవారం పలువురు అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన తమ అనుచరులతో కలిసి నగర వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. భాజాభజంత్రీలు, కళాకారుల ప్రదర్శనలతో కలెక్టరేట్‌కు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు. కాగా, పట్టభద్రుల స్థానానికి 28, ఉపాధ్యాయ స్థానానికి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు 58 నామినేషన్లు దాఖలు కాగా, పట్టభద్రుల స్థానానికి 49, ఉపాధ్యాయ స్థానానికి 9 వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి తెలిపారు.
నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశా. నన్ను ఆశీర్వదిస్తే పట్టభద్రుల గొంతుకనవుతా. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నోట్ల కట్టలు, సమాజ సేవకులకు మధ్య జరుగుతున్న పోటీలో విజేతలను నిర్ణయించేది పట్టభద్రులే. వ్యక్తుల నేపథ్యం మాత్రమే పరిశీలించాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉన్నది. ఈ సారి జరుగబోయే ఎన్నికలు భవిష్యత్తరాలకు మార్గదర్శకంగా మారేలా తీర్పునివ్వాలి. ఉమ్మడి నాలుగు జిల్లాల్లోని నిరుద్యోగులు, పట్టభద్రుల ఇబ్బందులను నేను ప్రత్యక్షంగా గమనించా. విద్యా, ఉద్యోగ వ్యవస్థలపై తనకు పూర్తి అవగాహన ఉన్నది.
పట్టభద్రుల శాసనమండలి స్థానం నుంచి పోటీ చేస్తున్నా. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశా. తప్పకుండా నేనే గెలుస్తా. పట్టభద్రుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ నెల 10న రెండో సెట్ నామినేషన్ దాఖలు చేస్తా. ఆ సందర్భంలో నరేంద్రుడి నవరత్నాల పేరిట నా ఏజెండా విడుదల చేస్తా. కొంతమంది చేస్తున్న ఆరోపణలు మండలి ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపవు.