పంచాయతీ ఎన్నికలకు అధికారయంత్రాగం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వ, ఎన్నికల కమిషన్ నుంచి వస్తున్న ఆదేశాల మేరకు సిద్ధమవుతుండగా, ఇప్పటికే ఆయా జీపీల ఓటర్లకు అనుగుణంగా అవసరమైన ఎన్నికల సామగ్రి జిల్లాలకు చేరింది. అంతేకాదు, సర్పంచ్‌లుగా పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులు తాజాగా ఖరారయ్యాయి. అలాగే మొదటి సారి నోటాకు చోటు కల్పిస్తుండగా.. బ్యాలెట్ ఎక్కడికక్కడే ముద్రించేందుకు ఆదేశాలు వచ్చాయి. అయితే కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు అనుగుణంగా ఎన్నికలు జరుగుతాయా.. లేదా..? అన్నదానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతుండగా, సర్కారు మాత్రం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలు ఆగిపోవడంతో పన్నెండు నెలలుగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రాక పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో ఏదో విధంగా ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలుస్తున్నది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఒక ఎత్తు అయితే, ఆ ఎన్నికలు జరిగే దాకా ఉత్కంఠ ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ కలెక్టరేట్ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా రెడీ కాగా, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణలో వివిధ విభాగాలకు సంబంధించి నోడల్ అధికారులను నియమించారు. తాజాగా పోటీ చేసే అభ్యర్థులకు కేటాయించాల్సిన గుర్తులు కూడా విడుదల కాగా, ఎన్నికల సామగ్రి సైతం జిల్లాకు చేరింది. జిల్లాల వారీగా ఎక్కడికక్కడే బ్యాలెట్ పేపర్లు ముద్రించుకోవాలని ఆదేశాలు రాగా, బ్యాలెట్ ముద్రణకు అవసరమైన ప్రత్యేక పేపర్ కూడా వచ్చింది. దీనిని స్ట్రాంగ్ రూమ్‌లో, మిగతా సామగ్రిని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయంలో భద్రపరచడంతోపాటు ప్రింట్ చేసేందుకు ప్రెస్‌ల ఎంపిక కూడా పూర్తయింది. అయితే ముద్రణకు నిధులు విడుదల చేయకపోవడంతో ఆర్డర్లు ఇవ్వనట్టు తెలుస్తున్నది. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడం, ప్రత్యేకాధికారులకు పాలనపై పట్టులేకపోవడంతో గ్రామాలన్నీ అపరిశుభ్రతకు నెలవుగా మారాయనే విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. రోజురోజుకూ ఇవి తీవ్రమవుతుండడం, గ్రామాల్లో వ్యతిరేకత పెరుగుతుండడం వెరసి సాధ్యమైనంత తొందరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో యంత్రాంగం ఏర్పాట్లలో వేగం పెంచినట్టు తెలుస్తున్నది.
సర్పంచ్‌లకు 30.. వార్డు సభ్యులకు 20 గుర్తులు
పంచాయతీ ఎన్నికలు విడుతల వారీగా నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తుండగా, అందుకనుగుణంగానే అధికారులకు శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. స్టేజ్1, స్టేజ్ 2 స్థాయి అధికారులను కూడా నియమించి, వారికి క్లస్టర్ల బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో క్లస్టర్లో ఆరు గ్రామ పంచాయతీలను చేర్చి, ఆయా జీపీల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి క్లస్టర్ అధికారులు నామినేషన్లు స్వీకరించేలా, గుర్తుల కేటాయింపు చేపట్టేలా శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం వీరి ఆధ్వర్యంలోనే పూర్తి చేసేలా ఆదేశాలు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. క్లస్టర్ అధికారులుగా జిల్లా స్థాయి అధికారులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. వీరితో పాటు ప్రిసైడింగ్, అదనపు ప్రిసైడింగ్ అధికారులను కూడా గుర్తించి, అవసరమైన శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా పంచాయతీలకు సరిపడేలా బ్యాలెట్లు ముద్రించనుండగా, ఈసారి బ్యాలెట్లో అభ్యర్థుల గుర్తులతోపాటు ‘నోటా’ను కూడా ముద్రించనున్నారు. పింక్, వైట్ కలర్ పేపర్‌పై మాత్రమే బ్యాలెట్లు ముద్రించాలని ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులు ఎంపిక చేయగా, పింక్ కలర్ పేపర్‌పై సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు, వైట్ కలర్ పేపర్‌పై వార్డు సభ్యుల గుర్తులు ముద్రించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే వరకు ముద్రణ పూర్తయ్యేలా ప్రింటర్లను ఆదేశించినట్లు సమాచారం.
బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యేనా..?
కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా బీసీ డిక్లరేషన్ అమలు చేస్తుందా..? 23 శాతం నుంచి 42శాతానికి బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్న మాట నిలుపుకొంటుందా.. లేదా..? అన్నదానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లను కులగణన, బీసీ కమిషన్ నివేధిక ఆధారంగా 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. తద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నది. నిజానికి 2019 జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలోనే సుప్రీంకోర్టు ఏ పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని స్పష్టం చేసింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల ఆధారంగా అప్పటి పంచాయతీరాజ్ అధికారులు రాష్ట్రంలో రిజర్వేషన్లను ఖరారు చేశారు.
గత పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22.79 శాతం, ఎస్సీలకు 20.53 శాతం, ఎస్టీలకు 6.68 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించారు. ఆ ప్రకారమే ఎన్నికలు నిర్వహించారు. అయితే ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచి అమలు చేయాలని వచ్చిన ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత నవంబర్‌లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వే ద్వారా బీసీ జనాభా లెక్కలు తెలిసినా.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్లు అమలుచేసి తీరుతుందా.. లేదా..? అన్నది చూడాలి. ఎందుకంటే.. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు ఏ పరిస్థితుల్లోనూ 50 శాతం దాటరాదు. ఈ నేపథ్యంలో బీసీ డిక్లరేషన్ అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అయితే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోయినా.. ఎన్నికల నిర్వహణవైపు అధికారులను సమాయత్తం చేస్తున్నట్టు తాజాగా వచ్చిన ఆదేశాలను బట్టి తెలుస్తున్నది.