వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం అస్తవ్యస్తంగా మారింది. అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అరిగోస పడాల్సి వస్తున్నది. ఓవైపు సర్కారు జాప్యం, మరోవైపు అకాల వర్షాలతో నిండా మునగాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. అష్టకష్టాలు పడి కొనుగోలు కేంద్రాలకు వడ్లను తెస్తే.. అక్కడ కొనేవాళ్లు లేక పడిగాపులు పడాల్సి వస్తున్నది. ధాన్యం ఆరబోసిన వెంటనే కొనకుండా కొర్రీలు పెట్టడం, ఈలోగా మరోసారి వర్షం వచ్చి తడవడం, మళ్లీ తేమ శాతం పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. నిజానికి కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించకపోవడం, ఆరంభించిన సెంటర్లలో కొనుగోళ్లు చేపట్టకపోవడం వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటి వరకు అక్కడే ఉన్నది. వర్షం పడినప్పుడు నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకోలేక, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఏమనలేక రైతులు సతమతమవుతున్నారు. అన్నదాతలు ఇంతలా ఇబ్బంది పడుతున్నా కనీసం పట్టించుకునే వారు కరువయ్యారు. అధికార పార్టీ నాయకులు, మంత్రులు హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతుండగా.. అధికారయంత్రాగంలో ప్రణాళికాలోపం స్పష్టంగా కనిపిస్తున్నది. మరోవైపు రైస్‌మిల్లర్లు ధాన్యం దింపుకోవడానికి ససేమిరా అంటుడడంతో సమస్య రోజురోజుకూ జటిలమవుతున్నది.
కరీంనగర్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్నదాతల బతుకు మళ్లీ ఆగమవుతున్నది. సర్కారు అలసత్వం.. శాపంలా మారుతున్నది. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అరిగోస పడాల్సి వస్తున్నది. వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలు చేసేందుకు అక్టోబర్ ఒకటి నుంచే కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పినా.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ రోజుకు కూడా నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. ఆరంభించిన కేంద్రాల్లో కొనుగోళ్లు చేపట్టడం లేదు. ఈ సీజన్లో అన్నదాతలు పంటలు పండించడానికి ఆరంభం నుంచీ అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. సకాలంలో యూరియా అందక.. ఒక్క బస్తా కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆ బాలారిష్టాల నుంచి గట్టెక్కి పండించిన వడ్లను అమ్ముకుందామంటే మళ్లీ కష్టాలు పడాల్సి వస్తున్నది. నిజానికి వానకాలం సీజన్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అడుగడుగునా ప్రణాళికాలోపం కనిపించింది. కోతలు ఆరంభమైన వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, అలా కాకుండా వచ్చిన వడ్లను కేంద్రాల వద్ద కొనేదిక్కులేకుండా పోయింది. నిజానికి అధికారులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగానే నిర్వాహకులు కొనేందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. అలాగే కొన్న ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపించాలో ముందుగానే అలాట్మెంట్ చేయాలి. కానీ, ఈ సారి అలా జరగలేదు. దాంతో కొన్న ధాన్యం తమకు భారం అవుతుందన్న ఉద్దేశంతో మెజార్టీ కేంద్రాలు ధాన్యం కొనలేదు.
మొన్నటి వరకు మొంథా తుపాన్ ప్రభావం చూపగా, రెండు మూడు రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. అకస్మాత్తుగా పడుతున్న వర్షాలు జీవితాలనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కేంద్రం వద్ద నాలుగైదు రోజుల పాటు ఆరబోసి, తేమ శాతం రాగానే అమ్ముదాం అనుకునే సమయానికి వానలు పడడం, వడ్లు తడువడంతో పరిస్థితి మొదటికి వస్తున్నది. అలాగే భారీగా పడుతున్న వర్షాలకు చాలాచోట్ల ఇప్పటికే వేలాది క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయింది. చెమటోడ్చి పండించిన వడ్లు కండ్ల ముందే నీళ్ల పాలవుతుంటే కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప రైతులు ఏమీచేయలేని దుస్థితి ఏర్పడుతున్నది. పోనీ ఉన్న ధాన్యమైనా కొంటారా..? అంటే అదీ లేదు. లేనిపోని సాకులు చెబుతూ దాటవేయడం తప్ప కొన్నది లేదు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్.. హుస్నాబాద్‌లో పర్యటించిన సమయంలో తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. కానీ, ఎక్కడా చిన్నగింజ కూడా కొనలేదు. కొనుగోళ్లలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం వల్ల చాలా ప్రాంతాల్లో రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు తెగనమ్ముకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు 2,389 చొప్పున చెల్లించాలి. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా కేంద్రాల్లో విక్రయిస్తే.. సన్నధాన్యంకు క్వింటాల్‌కు 500 చొప్పున అదనంగా బోనస్ ఇవ్వాలి. అంటే దాదాపుగా ఏ గ్రేడ్ ధాన్యం ఒక క్వింటాల్‌కు బోనస్‌తో కలిపి రైతుకు 2,889 రావాలి. కానీ, సర్కారు కొనుగోళ్లలో జాప్యం కారణంగా వ్యాపారులు క్వింటాల్‌కు 1700 నుంచి 1800 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. లక్షలాది మంది రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నా ఏ ఒక్క మంత్రి కూడా సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం లేదు. కనీసం అధికారులు, మిల్లర్లతో సమీక్షలు పెట్టడం లేదు. ప్రభుత్వం నుంచి చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం లేదు. ఫలితంగా రైతులు దినదినగండంగా కాలం వెల్లదీస్తున్నారు. నిజానికి ఇప్పటికే దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి ఉండగా, మూడు నాలుగురోజుల్లో మరో4 లక్షల మెట్రిక్ టన్నులధాన్యం కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నారు. అప్పుడు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగిత్యాల జిల్లాలో ఈ సీజన్లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసిన అధికారులు, మొత్తం 408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో కొన్ని కేంద్రాలు కేవలం రెండు రోజుల క్రితం మాత్రమే ప్రారంభం కాగా, ఇప్పటి వరకు రైతుల నుంచి పెద్దగా కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. కాగా, ఇప్పటికే 50వేల నుంచి 60వేల మెట్రిక్ టన్నల ధాన్యం వివిధ కొనుగోలు కేంద్రాల వద్ద ఉండగా, వర్షం నుంచి కాపాడేందుకు అన్నదాతలు నానా తిప్పలు పడుతున్నారు. వచ్చిన ధాన్యం వచ్చినట్టు కొనుగోలు చేయకుండా చూపుతున్న నిర్లక్ష్యంపై రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు సెంటర్దారులను అడిగితే.. తేమ శాతం రావడం లేదు కాబట్టే కొనడం లేదంటూ చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో 3.02 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసిన అధికారులు.. మొత్తం 325 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయిచారు. ఇప్పటి వరకు 161 కేంద్రాలను మాత్రమే ప్రారంభించి, దీని ద్వారా 14 వేల మెట్రిక్ టన్నల ధాన్యం కొన్నట్టు చెబుతున్నారు. నిజానికి జిల్లాలోని దాదాపు అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చి ఉన్నది. పాతవి కొనుగోలు కాకపోవడంతో కొత్త ధాన్యం కేంద్రాలకు తీసుకరావడానికి స్థలం లేకుండా పోతున్నది. తేమశాతం 17 ఉంటేనే ధాన్యం దింపుకుంటామని మిల్లర్లు చెబుతున్నారు. అంతేకాకుండా గత సీజన్ ధాన్యంలో దాదాపు 50 శాతం ఇంకా ఎఫ్‌సీఐకి పెట్టాల్సి ఉందని, అలాగే గతనెలాఖరుతో ఎఫ్‌సీఐ గడువు ముగిసిందని, మళ్లీ అనుమతులు తెప్పించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని, తద్వారా కొత్త ధాన్యం దించుకోలేమని మిల్లర్లు చెబుతున్నారు. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లో సవాలక్ష నిబంధనలు పెడుతూ కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఈ సీజన్లో మొత్తం 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో 3.30 లక్షలు సన్నాలు కాగా, 70వేల మెట్రిక్ టన్నుల దొడ్డురకం ఉంటుందని ప్రణాళిక రూపొందించారు. ఆ మేరకు 333 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి, ఇప్పటివరకు 256 మాత్రమే ఓపెన్ చేశారు. తీరా చూస్తే 200 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు. కాగా, ఆయా కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికే 2,300 మెట్రిక్ టన్నలకుపైగా ధాన్యం వచ్చినా.. వెనువెంటనే కొనేవారు లేక రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. దీనికి తోడు వర్షాలు పడుతుండడంతో ధాన్యం తడిసి పోతున్నదని, మళ్లీ తేమ శాతం వస్తేనే కొంటామని అధికారులు కొర్రీలు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ముందుగానే ధాన్యం కొని ఉంటే.. తమకీ దైన్య పరిస్థితి ఉండేది కాదని వాపోతున్నారు.
రాజన్న సిరిసిల్లలో పరిస్థితి దారుణంగా ఉన్నది. ఈ సీజన్లో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధాకారులు అంచనా వేశారు. ఆ మేరకు 238 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు 236 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. వీటి ద్వారా 2.30లక్షల క్వింటాళ్ల ధాన్యం కొన్నట్టు చెబుతున్నా.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని దింపుకోవడానికి మిల్లర్లు ముందుకు రావడం లేదు. గత సీజన్లో సీఎంఆర్‌కు సంబంధించి.. పెట్టిన కండీషన్ల నేపథ్యంలో మిల్లుల్లో ధాన్యం నిల్వలు భారీగా ఉన్నాయని, ఇటువంటి సమయంలో కొత్త ధాన్యం ఎలా దింపుకుంటామని మిల్లర్లు ససేమిరా అంటున్నారు. దీంతో రైతులు విసిగి వేసారి రోడ్డెక్కుతున్నారు. ఇటీవల వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. అయినా కొనుగోళ్లలో స్పీడ్ మాత్రం పెరగలేదు. ఇప్పటికే 50వేల క్వింటాళ్లకుపైగా ధాన్యం వివిధ కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నది. వీటిని కొనే నాథుడు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.