ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం ప్రజలు నరకయాతన పడ్డారు. వారానికోతీరు షెడ్యూలు అమలు చేసేవాళ్లు. ఆ ప్రకారం కూడా కరెంట్ ఇవ్వకపోయేది. దీంతో జనరేటర్ల ఖర్చుతో పరిశ్రమల నిర్వాహకులు తీవ్రమైన నష్టాలను చవిచూసేవాళ్లు. కానీ, స్వరాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన కరెంటు అందుతుండడంతో జనరేటర్ల మోత తప్పింది. పవర్ హాలిడేలకు స్వస్తి పలకడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి పెరిగింది. అటు కూలీలకు గిట్టుబాటు దక్కుతుండగా, యజమానులు ఆశించిన లాభాలు పొందుతూ రాష్ట్ర ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారు.
కరీంనగర్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలు అన్ని రంగాలను వేధించేవి. ఆ రోజులు గుర్తుకురావద్దని అనుకోని వారుండరు. ముఖ్యంగా వ్యవసాయంతో పాటు పరిశ్రమ రంగం తీవ్రంగా నష్టపోయింది. పరిశ్రమలకు ఒకప్పుడు ప్రతి రోజూ ఉదయం రెండు, సాయంత్రం రెండు గంటల కోతలు అధికారికంగా విధించేవారు. కానీ, విద్యుత్ కేటాయింపులు తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉన్న కారణంగా నిత్యం గ్రిడ్‌లో సమస్యలు తలెత్తేవి.
ఫలితంగా సరఫరాలో నిత్యం అంతరాయం ఏర్పడేది. దీనికి తోడు పవర్ హాలీడేలు ప్రకటించేవారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు రెండు, మూడు రోజులు పరిశ్రమలు నడిచేవి కాదు. రాత్రి వేళ పీక్ అవర్ పేరుతో పరిశ్రమలు నిర్వహించరాదని ఆంక్షలు విధించేవారు. దీంతో అనేక పరిశ్రమలు కుదేలయ్యాయి. ఉత్పత్తి లక్ష్యాలను సాధించక పోవడం, లేబర్ ఖర్చులు మీద పడడం వంటి కారణాలతో పరిశ్రమల నిర్వాహకులు నష్టాలు చవిచూడాల్సి వచ్చేది. అనేక పరిశ్రమల్లో భారీ జనరేటర్లు ఏర్పాటు చేసుకునేవారు. దీని ఖర్చు తడిసి మోపెడయ్యేది. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలు నడపలేక చాలా మంది మూసేసుకున్నారు. వీటిపై ఆధారపడిన కార్మికులు రోడ్డున పడాల్సి వచ్చేది..
తెలంగాణ వచ్చిన ఆరు నెలల నుంచే..
తెలంగాణ ఏర్పడిన ఆరు నెలలకే సీఎం కేసీఆర్ నేతృత్వంలో పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేశారు. దీంతో పరిశ్రమల నిర్వాహకులు ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం పడిన కష్టాలన్నింటినీ మర్చిపోయారు. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవసాయం, విద్యుత్ రంగాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. పరిశ్రమలకు అనతి కాలంలోనే నాణ్యమైన కరెంటును సరఫరా చేయడంతో మూతపడ్డ అనేక పరిశ్రమలు తెరుచుకున్నాయి. అంతే కాకుండా, కొత్త పరిశ్రమలు కూడా వెలుస్తున్నాయి. చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికులు ముందుకు వస్తున్నారు. జిల్లాలో కరీంనగర్ టౌన్-1 ఈఆర్వో పరిధిలో 434, టౌన్-2 ఈఆర్వో పరిధిలో 338, కరీంనగర్ రూరల్ పరిధిలో 675 కలిపి కరీంనగర్ డివిజన్లో 1,447 పరిశ్రమలు ఉన్నాయి. అలాగే, గుండి ఈఆర్వో పరిధిలో 702, అల్గునూర్ ఈఆర్వో పరిధిలో 692 కలిపి కరీంనగర్ రూరల్ డివిజన్లో 1,394 పరిశ్రమలు ఉన్నాయి.
ఇక హుజూరాబాద్ ఈఆర్వో పరిధిలో 547, జమ్మికుంట ఈఆర్వో పరిధిలో 346 కలిపి హుజూరాబాద్ డివిజన్లో 893 పరిశ్రమలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 3,734, రెండు భారీ తరహా పరిశ్రమలు ఉన్నాయి. మరో 1,724 కుటీర పరిశ్రమలు జిల్లాలో నడుస్తున్నాయి. వీటిలో జిల్లాలో అతి పెద్ద రంగాలైన రైస్ మిల్లులు, గ్రానైట్ పరిశ్రమల్లో ఇప్పుడు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఏ పరిశ్రమకూ కరెంట్ కోతలు లేవు. ఎక్కడా భారీ జనరేటర్ల మోతలు లేవు. పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న కారణంగా ఉత్పత్తి లక్ష్యాలు ఎప్పటికప్పుడు నెరవేరుతున్నాయి. పరిశ్రమల నిర్వాహకులు లాభాలు పొందుతున్నారు. వేలాది మందికి ఉపాధి లభిస్తోంది.
ఆనాటి కష్టాలు గుర్తుకు రావద్దు..
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌లో ఎండీ లతీఫ్ ప్లాస్టిక్ రీ ప్రాసెసింగ్ యూనిట్‌ను నడుపుకుంటున్నాడు. చిన్న తరహా పరిశ్రమ అయిన ఈ యూనిట్ ద్వారా పది మందికి ఉపాధి చూపుతూ తాను హాయిగా బతుకుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్న లతీఫ్.. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం పడిన కష్టాలు గుర్తు చేసుకుని వామ్మో.. అవి గుర్తుకు రావద్దని అంటున్నాడు. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు ఉండేదో.. ఎప్పుడు పోయేదో తెల్వకపోయేది. లతీఫ్ లాంటి చిన్న పరిశ్రమకు పెద్ద జనరేటర్ అవసరం ఉండేది. ఇది వాడితే ఖర్చు మోపెడయ్యేది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి.. రెండు రోజులని కాదు.
పరిశ్రమల నిర్వాహకులు నిత్యం నరకం అనుభవించేవాళ్లు. అప్పట్లో ఉదయం రెండు, సాయంత్రం రెండు గంటలు కోతలు విధిస్తున్నట్లు ప్రకటించేవాళ్లు. కానీ, రోజంతా కోతలే ఉండేవి. వేసవిలో అయితే పవర్ హాలీడేలు, పీక్ అవర్స్ అని రెట్టింపు కోతలు పెట్టే వాళ్లు. దీంతో పరిశ్రమలు సరిగా నడవక లేబర్ ఖర్చులు మీద పడేవి. కూలీ గిట్టుబాటుకాక లేబర్ పనిలోకి వచ్చేది కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడిన పరిశ్రమల నిర్వాహకులు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల నాణ్యమైన విద్యుత్‌తో లతీఫ్ లాంటి చిన్న, మధ్య తరహా పరిశ్రమ నిర్వాహకులు ఆశించిన ఉత్పత్తులు సాధిస్తూ లాభాలు గడిస్తున్నారు.
– లతీఫ్, పద్మనగర్‌లో ప్లాస్టిక్ రీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వాహకుడు
కరెంట్ సప్లయ్ బాగుంది
దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పరిశ్రమలకు కరెంట్ సరఫరా చేస్తున్నరు. నేను చైన్ లింక్ పరిశ్రమను స్థాపించి ఐదేళ్లు అవుతోంది. అంతకు ముందు కరెంట్ ఎట్లుండేదో నాకు అనుభవం లేదు. కానీ, నేను పరిశ్రమ పెట్టినప్పటి నుంచి మాత్రం కరెంట్‌కు ఢోకా లేదు. మేం ఎక్కువగా ఫౌల్ట్రీ రంగానికి ఫిన్సింగ్ జాలీలు తయారు చేస్తాం. కస్టమర్ ఆర్డర్ తీసుకుని అనుకున్న సమయానికి అందించగలుగుతున్నాం. కరెంట్ ఈ విధంగా సప్లయ్ లేకపోతే ఇది సాధ్యమయ్యే పనికాదు. పరిశ్రమలో పనిచేసుకుంటున్న లేబర్ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. వాళ్లకు రోజు చేతి నిండా పనిదొరుకుతోంది. మా లేబర్ ఒక్కొక్కరు నెలకు రూ.20 వేలు సంపాదించుకుంటరు. కరెంట్ సప్లయ్ చాలా బాగుంది కనుకే ఇది సాధ్యమైతంది.
– నల్ల సంతోష్, చిన్న తరహా పరిశ్రమ
నిర్వాహకుడు, పద్మనగర్