మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 12, 2020 , 02:57:33

మీ చేతులు జర భద్రం!

మీ చేతులు జర భద్రం!

  • lశానిటైజర్‌ అతిగా వాడితే అనర్థమే
  • lచర్మ సంబంధ వ్యాధుల ముప్పు
  • lపిల్లలు, గర్భిణులు జాగ్రత్త
  • lసబ్బులు, హ్యాండ్‌వాష్‌లు బెటర్‌ 

జేబులో శానిటైజర్‌ ఉంది కదా అని తరచుగా వాడుతున్నారా? భయంతో పదే పదే రుద్దుకుంటున్నారా? అయితే మీ చేతులు జాగ్రత్త! కరోనా నుంచి కాపాడుకోవడం ముఖ్యమే అయినా, అతిగా చేతులను శానిటైజ్‌ చేస్తే అనర్థాలు తలెత్తే ప్రమాదమున్నది. విచ్చలవిడిగా వాడడం వల్ల చర్మ సంబంధ వ్యాధులు వచ్చే ముప్పు ఉన్నది. సబ్బు అందుబాటులో లేనప్పుడు మాత్రమే శానిటైజర్‌ వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. హ్యాండ్‌వాష్‌లు కూడా వాడొచ్చని చెబుతున్నారు.

- కరీంనగర్‌ హెల్త్‌/ హుజూరాబాద్‌టౌన్‌

శానిటైజర్‌ను మొన్నటి వరకు ఎక్కువగా హాస్పిటళ్లలోనే వాడేవారు. రోగులకు చికిత్స చేసిన సందర్భాల్లో వైద్యులు ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ శానిటైజ్‌ చేసుకుంటున్నారు. ఏదైనా అవసరం మేరకు వాడితే బాగానే ఉంటుంది. వైరస్‌ అనుమానంతో అతిగా వాడితే లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. అనుమానిత వస్తువులు తాకినప్పుడు, ఇతరులు ఇచ్చిన వాటిని తీసుకున్నప్పుడు వాడాలి. కానీ, జేబులో ఉన్నది కదా అని తీరిక దొరికినప్పుడల్లా శానిటైజర్‌ తీసి చేతులకు రాసుకుంటే చర్మసంబంధ వ్యాధులు, అలర్జీలు వచ్చే ప్రమాదమున్నది. నాసిరకం శానిటైజర్లతో ఇంకా ఎక్కువ ముప్పే ఉంటుంది. అందుకే నాణ్యమైన వాటిని ఎంచుకోవాలి. శానిటైజర్‌ను వాహనాల్లో నిల్వ ఉంచుకోవద్దు. ఈ ద్రావణానికి తక్కువ వేడిలో కూడా మండే స్వభావం ఉంటుంది. దీని వల్ల మంటలు చెలరేగే ప్రమాదముంటుంది. 

వినియోగం ఇలా..

శానిటైజర్లు వినియోగించే విధానంపై అంతర్జాతీయ పరిశోధన సంస్థ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రి వెన్షన్‌ సెంటర్‌ పలు సూచనలు చేసింది. ఈ ద్రావణాన్ని చేతుల్లో వేసుకుని 20నుంచి 30 సెకన్ల పాటు వేళ్ల సందులను వదలకుండా పూర్తిగా రుద్దుకోవాలి. ఆ తర్వాత ఒక నిమిషం వరకు ఆరబెట్టుకోవాలి. జిగురు, నురుగు మాదిరి కంటే లిక్విడ్‌ రూపంలో ఉండే శానిటైజర్లే మంచివి. వీటిలో 60 నుంచి 90 శాతం ఆల్కహాల్‌ ఉండాలి. అంతకంటే తగ్గినా, ఎక్కువగా ఉన్నా కొత్త సమస్యలు వస్తాయి. నాసిరకం వాటితో ఇంకా ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే శానిటైజర్‌ కంటే సబ్బు మేలని వైద్యులు చెబుతున్నారు. హ్యాండ్‌వాష్‌ కూడా వాడొచ్చని, అవి రెండూ లేనప్పుడు మాత్రమే నాణ్యమైన శానిటైజర్‌ వాడాలని సూచిస్తున్నారు.  

చిన్నారులు, గర్భిణులు జాగ్రత్త..

శానిటైజర్లు చేతులకు రాసుకున్న సందర్భాల్లో గృహిణులు, చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో 90 శాతం వరకు ఆల్కహాల్‌ ఉంటుంది. ఈ ద్రావణానికి తక్కువ వేడిలో కూడా మండే స్వభావం ఉంటుంది. కాబట్టి శానిటైజర్‌ ద్రావణాన్ని చేతికి రాసుకున్న వెంటనే వంటగదిలోకి వెళ్లి గ్యాస్‌స్టౌవ్‌లను వెలిగించవద్దు. ఇలాంటి సందర్భాల్లో సబ్బు నీళ్లతో చేతులను శుభ్రం చేసుకోవాలి. అలాగే వీటిని రాసుకున్న వెంటనే ఆహారపదార్థాలను తీసుకోవద్దు. ఎందుకంటే ఇందులోని ఆల్కహాల్‌ కడుపులోకి వెళ్లి వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదముంటుంది. అలాగే పదేళ్లలోపు పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఐదేళ్లలోపు వారికి చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. 

సబ్బునీళ్లే సురక్షితం..

మార్కెట్‌లో వివిధ రకాల శానిటైజర్లు దొరుకుతున్నాయి. ఆల్కహాల్‌ జెల్‌, లిక్విడ్‌, హోం బేసిక్‌ స్ప్రే ఫోమ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 60 నుంచి 90 శాతం ఐసో ప్రొఫైల్‌ ఆల్కహాల్‌ ఎక్కువగా ఉన్న శానిటైజర్లనే వాడాలి. 15 నుంచి 30 సెకన్లు రుద్దుకోవాలి. ముఖ్యంగా కొవిడ్‌ కాంట్రాక్టు ఉన్న వ్యక్తులు మాత్రమే శానిటైజర్లనే వాడాలి. తక్కువ శాతం హైసో ప్రొఫైల్‌ ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్లు వాడడం వల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. వీటన్నింటికంటే ముందుగా సబ్బునీళ్లే సురక్షితం. నీళ్లు, సబ్బు దొరకని చోట శానిటైజర్లు వాడాలి. మంచి వాసన వచ్చే శానిటైజర్లని వాడితే ఎక్కువగా అలర్జీలు వచ్చే ప్రమాదమున్నది. 

- లావణ్య, ప్రభుత్వ దవాఖాన డెర్మటాలజిస్ట్‌ (కరీంనగర్‌)

అతిగా వాడద్దు..

అదే పనిగా శానిటైజర్‌ను వాడద్దు. ఇంట్లో ఉన్నప్పుడు వినియోగించద్దు. తరచూ వాడడం వల్ల చర్మం పొడిబారుతుంది. పొలుసులుగా మారి ఊడిపోతుంది. సాధ్యమైనంత వరకు సబ్బు నీళ్లతో 20 సెకండ్ల పాటు మోచేతుల వరకు శుభ్రంగా కడుక్కోవాలి. సబ్బు అందుబాటులో లేనప్పుడు, రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు, బయట ఏదైనా వస్తువులను తాకినప్పడు శానిటైజర్‌ వాడాలి. అతిగా వినియోగించవద్దు.

- సురేశ్‌ నాయక్‌, 

స్కిన్‌ స్పెషలిస్ట్‌ (సిరిసిల్ల)logo