శనివారం 08 ఆగస్టు 2020
Karimnagar - Aug 02, 2020 , 02:32:15

సురక్షాబంధన్‌!

సురక్షాబంధన్‌!

  • కరోనా నేపథ్యంలో అప్రమత్తతే రక్ష lప్రయాణాల్లో జాగ్రత్త
  • దూర ప్రాంతాలకు వెళ్లకపోవడమే మేలు
  • మాస్కులు, శానిటైజర్లు మస్ట్‌ lభౌతికదూరం తప్పనిసరి
  • చిన్న నిర్లక్ష్యం చేసినా ముప్పే

‘నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష..’ అని ఒకరి క్షేమాన్ని మరొకరు కాంక్షిస్తూ సోదరీసోదరులు జరుపుకునే పండుగ రక్షాబంధన్‌. అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి, రక్తసంబంధాన్ని మనసారా ఆస్వాదించే వేడుక. కానీ, ఈ యేడు మాయదారి కరోనా ఆందోళన కలిగిస్తున్నది. వైరస్‌ ఎక్కడ, ఎప్పుడు ఎలా అంటుకుంటుందోనన్న భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్నది. ఎక్కడో దూరప్రాంతాల్లో ఉండే తోబుట్టువులు పుట్టింటికి రాకుండా అడ్డుపడుతున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో స్వీయ నియంత్రణే మనకు శ్రీరామ ‘రక్ష’లా నిలువనున్నది. అప్రమత్తంగా ఉంటేనే మహమ్మారి ముప్పు తప్పి, ‘రక్షా’బంధన్‌ సంతోషంగా సాగనున్నది. లేదంటే ప్రమాదం పొంచి ఉన్నది. తస్మాత్‌ జాగ్రత్త!

అన్నయ్యా.. నేను రాలేకపోతున్నా..

ప్రియమైన అన్నయ్యకు.. నీ చెల్లెలు రాయునది ఏమనగా.. ముందుగా నీకు రాఖీ పున్నం శుభాకాంక్షలు. అన్నయ్యా నిజం చెప్పనా.. నా కండ్ల నిండా నీళ్లు గిర్రున తిరుగుతున్నాయి. నాకు తెలియకుండానే జలజలా జారుతున్నాయి. ఈ పండుగకు రాలేకపోతున్నాననే బాధతో దు:ఖం ఆగుతలేదు. నిన్ను, తమ్మున్ని కలువలేకపోతున్నాననే ఆవేదనతో నా గుండె బరువైంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ అనుకోలె. నాలుగైదు రోజులుగా నా మనసంతా మీ మీదే ఉన్నది. పరిస్థితులు బాగుంటే ఈ పాటికే ఇంటికి వచ్చేదాన్ని. నీకు రాఖీ కట్టి.. అమ్మ, నాన్న, వదిన, పిల్లలతో మీ మధ్య ఆనందంగా గడిపేదాన్ని. మీరు చూపిన ప్రేమానురాగాలను మూటకట్టుకొని తిరిగి వచ్చేదాన్ని. అవి గుర్తు చేసుకుంటూ నా పిల్లలతో సంతోషంగా గడిపేదాన్ని. కానీ, ఈ సారి కరోనాతో ఆ అదృష్టం లేకుండా పోయింది. వైరస్‌ భయానికి గడపదాటని పరిస్థితి వచ్చింది. వద్దామనుకుంటే నాకు ధైర్యం చాలడం లేదు. నాకు ఏమైనా పరవాలేదు, కానీ, నా ద్వారా మీకు ఏమీ కావద్దు. అన్నయ్యా నీకు తెలుసు కదా.. నేను నీ ఇంటికి రాగానే, మీ చెల్లె వచ్చిందని అంటూ ఇరుగు పొరుగు వారు వస్తారు. మంచీచెడ్డ అరుసుకుంటారు. వారందరినీ ఆప్యాయతతో పలుకరించడం మనకు అలవాటు. వచ్చిన వారిలో ఎవరికైనా వైరస్‌ ఉంటే.. వారి ద్వారా మనకు అంటితే.. అది నేను తట్టుకోలేను. నేనొచ్చి మహమ్మారి బారిన పడేశాననే బాధ నన్ను నిత్యం వేధిస్తది. అందుకే అన్నయ్యా.. నేను రాలేకపోతున్నా. ఈ సారి రాఖీని కొరియర్‌లో పంపిస్తున్నా. ఆ పార్సిల్‌ విప్పే ముందు జాగ్రత్త! ముందుగా శానిటైజ్‌ చేయి. ఆ తర్వాతే ఓపెన్‌ చేసి రాఖీ తీసుకో. నేను రానందుకు క్షమించు. కానీ, మీ చెల్లె రాఖీ కట్టిందని భావించు. నీ దీవెనలు అందించు. అన్నయ్యా రాఖీ చూడగానే నీ మనసు ఉప్పొంగుతుందని నాకు తెలుసు. ఎందుకంటే మనిద్దరం అనుబంధానికి ప్రతీకలం. అమ్మ, నాన్నలో సగమై నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు. నీ చిరునవ్వుతో అనురాగాలను పంచావు. అన్నయ్యా నీకో మాట చెప్పనా.. ప్రతిసారి నీకు రాఖీ కడుతున్నప్పుడు నువ్వు చూపే ప్రేమానురాగాలు నా గుండెను తడుతాయి. ఉద్వేగభరితమైన ఆ క్షణంలో మన బాల్య స్మృతులన్నీ గుర్తుకొస్తాయి. ఒక్కటా రెండా ఎన్నని చెప్పను. నీ చేతుల్లో పెరిగా. నీవెనుకే తిరిగా. ప్రతి జ్ఞాపకం నా కండ్ల ముందే మెదులుతున్నది. నేనేడిస్తే ఊరడించింది, మారాం చేస్తే నన్ను నవ్వించింది, అమ్మలా అన్నం తినిపించింది, చేయి పట్టుకొని బడికి తీసుకెళ్లింది, పెరిగినకొద్దీ నీ కంటిపాప లెక్క రక్షణ ఇచ్చి నా భవిష్యత్తుకు అండగా నిలిచింది.. అన్నీ నువ్వే కదా అన్నయ్యా. నా పళ్లై అత్తారింటికి వెళ్తున్న సమయంలో ఎక్కెక్కి పడి ఏడుస్తున్న నన్ను ఓదార్చినప్పుడు.. పళ్లైన కొత్తలో నన్ను చూసేందుకు వచ్చి వెళ్తున్నప్పుడు నీ కండ్లల్లో కనిపించకుండా దాచి ఉంచిన కన్నీళ్లు.. ఇలా ఎన్నెన్నో యాదికి వస్తున్నాయి. అయినా అన్నయ్యా.. కరోనా శాశ్వతం కాదు, ఎన్నాళ్లయినా.. ఎన్నేళ్లయినా చెదిరిపోనిది మన అన్నాచెల్లెళ్ల అనుబంధం. వచ్చే పండుగకైనా స్వయంగా రాఖీ కట్టే అదృష్టాన్ని కల్పించాలని ఆ దేవున్ని కోరుకుంటున్నా.  

మొదటిసారి పోతలేను.. మస్తు బాధ అనిపిస్తున్నది..

మాది ఎల్లారెడ్డిపేట. మా తల్లిగారి ఊరు నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌. నాకు పెండ్లయి పద్నాగేళ్లయింది. నాకు ఇద్దరు అన్నలున్నరు. ఏటా పండక్కు మా తల్లిగారి ఇంటికి పోయి అన్నలకు రాఖీ కట్టేదాన్ని. రెండురోజులు అక్కడే ఉండేదాన్ని. ఈ సారి కరోనా వైరస్‌ చేయవట్టి భయమైతున్నది. ఇంట్ల ముగ్గురు చిన్నపిల్లలున్నరు. మా అత్తామామలు ఇద్దరు వృద్ధులు. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నరు. అంతదూరం బస్సెక్కిపోతే ఎక్కడ ఏం ఉందో ఎట్ల తెలుస్తది. అందుకే ఇప్పుడు పోతలేను. నా పెళ్లయిన కాన్నుంచి ఇదే మొదటిసారి. మస్తు బాధ అనిపిస్తున్నది. మా అన్నలకు ఫోన్‌ చేసి చెప్పిన. వాళ్లు కూడా వద్దన్నరు. పరిస్థితులు మంచిగైనంక పోత.


logo