గురువారం 04 జూన్ 2020
Karimnagar - Jan 29, 2020 , 04:34:53

యువతలో మార్పుతోనే ప్రమాదాల నివారణ

యువతలో మార్పుతోనే ప్రమాదాల నివారణ
  • నియమ, నిబంధనలు పాటించాలి
  • రైల్వే, రోడ్డు రవాణా సేఫ్టీ అదనపు డీజీ సందీప్‌ శాండిల్య
  • అధిక వేగంతోనే గాల్లో కలుస్తున్న ప్రాణాలు

తిమ్మాపూర్‌ రూరల్‌: యువతలో మార్పు వచ్చినప్పుడే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని రైల్వే, రోడ్డు రవాణా భద్రత అదనపు డీజీ సందీప్‌ శాండిల్య పేర్కొన్నారు. వాహనం నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాలు జరుగవన్నారు. మంగళవారం 31వ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్‌ సేఫ్టీ అవగాహన కార్యక్రమానికి రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా, పలువురు అధికారులతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ యువతలో మార్పు వచ్చినప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ప్రతి ఒక్కరూ నియమ, నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రతి క్రికెటర్‌ బ్యాటింగ్‌ సమయంలో 150 గ్రాముల బరువుండే బంతి నుంచి రక్షించుకోవడానికి హెల్మెట్‌ను వాడుతున్నాడనీ, అదే యువత రెండు క్వింటాళ్ల బరువు ఉన్న వాహనాన్ని నడిపే సమయంలో హెల్మెట్‌ వాడడం లేదనీ, ప్రమాదాలు జరిగితే తలకు దెబ్బ తగిలి ప్రాణాలే పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బైక్‌పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ తప్పక ధరించాలని హితవుపలికారు. రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం మొత్తం కష్టాల్లో పడుతుందనీ, అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. పిల్లలకు వాహనాలను కొనిచ్చేముందు వారి డ్రైవింగ్‌ సామర్థ్యం, నియమాలు చెబుతూ హెల్మెట్‌ తప్పకుండా అందించాలన్నారు. 


ముందు జాగ్రత్తే మేలు

రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా మాట్లాడుతూ ఓవర్‌ స్పీడ్‌ కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలు అనేవి చెప్పి రావనీ, వాహనదారులు ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనేక మంది తమ సెల్‌ఫోన్‌పైన ఉన్న జాగ్రత్త తలమీద చూపడం లేదనీ, సెల్‌ఫోన్‌కు సేవ్‌ గార్డ్‌ తొడిగించినట్లే బైక్‌పై వెళ్లే ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 15-30 ఏండ్లలోపు యువకులే ఎక్కువ మంది ప్రమాదాల్లో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బాల్యం నుంచే పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనీ, భవిష్యత్తులో వారు మంచి పౌరులుగా ఎదిగేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే రోడ్డుపై ప్రమాదాల్లో గాయపడిన వారికి మన వంతుగా తక్షణ సహాయం అందించాలన్నారు.


రోడ్డు భద్రతపై విస్తృత ప్రచారం

కలెక్టర్‌ కే శశాంక మాట్లాడుతూ.. క్షణకాలం నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఎన్నో ఏండ్లుగా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నా ప్రజల్లో సరైన అవగాహన కలగడం లేదనీ, ఈసారి అలా కాకుండా రోడ్డు భద్రత నియమావళిపై విస్తృత ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. వాహనదారులు అందరూ తమపై తమ కుటంబం ఆధారపడి ఉందని మరువద్దన్నారు. రోడ్డుపైకి వచ్చినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరే వరకూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. 


సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌తో ప్రమాదాలు 

కరీంనగర్‌ సీపీ కమలాసన్‌ రెడ్డి మాట్లాడుతూ సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ ద్వారా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ.. వాహనాలు నడపవద్దని సూచించారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడపడం ప్రమాదకరమన్నారు. డ్రంక్‌, డ్రైవ్‌ తనిఖీలో పట్టుబడిన వాహనదారుల లైసెన్సులు రద్దు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాలతోపాటు మరణాలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. ఏ సమస్య ఉన్నా డయల్‌100కు కాల్‌ చేయాలనీ, తక్షణమే సహాయక చర్యలు చేపడుతామని విద్యార్థినులకు హామీ ఇచ్చారు.


ట్రాఫిక్‌ అవగాహన పార్కుతో సత్ఫలితాలు

ఎంవీఐ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాపారావు మాట్లాడుతూ.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్తులో ప్రమాదాలను అరికట్టేందుకు రేపటి యువతకు ఇప్పటి నుంచే ట్రాఫిక్‌ పాఠాలు నేర్పుతున్నామని చెప్పారు. ఈ మేరకు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పిల్లల ట్రాఫిక్‌ అవగాహన పార్కు సత్ఫలితాలు ఇస్తుందన్నారు.  అనంతరం ట్రాఫిక్‌ నియమాలు, రోడ్డు భద్రతపై డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌ అధికారులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే డ్రైవింగ్‌ ట్రాక్‌పై మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ప్రావీణ్య, ఆర్టీసీ మేనేజర్‌ జీవన్‌ప్రసాద్‌, లయన్స్‌ క్లబ్‌ డాక్టర్‌ బుర్ర మధుసూదన్‌రెడ్డి, ఎన్జీవో ఓజా, జిల్లా క్రీడాధికారి అశోక్‌ నాయక్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, రవాణా శాఖ సిబ్బంది, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


logo