గంగాధర, నవంబర్ 22 : బూరుగుపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ముగ్గురు విద్యార్థులు కడుపునొప్పి వస్తోందని చెప్పి వాంతులు చేసుకున్నారు. తర్వాత మరికొంత మంది విద్యార్థులు కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు.
దీంతో ఉపాధ్యాయులు స్థానిక ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు పాఠశాలకు వచ్చి చికిత్స అందజేశారు. పాఠశాలకు వచ్చిన కొత్త బియ్యం బాగా లేవని, సరిగా ఉడకపోవడం వల్లే విద్యార్థులు ఇబ్బంది పడినట్లు ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ తెలిపారు. కాగా, విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని ఉపాధ్యాయులు తెలుపకపోవడం.. సాయంత్రం తెలిసిన తర్వాత పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు కడుపునొప్పితో వాంతులు చేసుకుంటే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. గురువారం కూడా భోజనం బాగా లేదని పిల్లలు చెబితే ఇంటి నుంచి టిఫిన్ తీసుకువెళ్లాలని పిల్లలకు చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
కాగా, శనివారం నుంచి పిల్లలు ఇంటి నుంచే టిఫిన్ తెచ్చుకుంటారని, ఇలాంటి భోజనం పెట్టి తమ పిల్లలను ఇబ్బందులు పెట్టవద్దని ఉపాధ్యాయులకు సూచించారు. కొత్త బియ్యంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని పై అధికారులు దృష్టికి తీసుకువెళ్లామని అధికారుల సహకారంతో సమస్యను పరిష్కరిస్తామని ఎంఈవో ప్రభాకర్‌రావు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ర్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. విద్యార్థుల ఇబ్బందులను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు.