Peddapally | పెద్దపల్లి, జనవరి20: మహా కుంభమేళా మేడారం సమ్మక్క సారమ్మ జాతరకు పెద్దపల్లి నుంచి 175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్, పెద్దపల్లి పాయింట్ ఇన్చార్జి కల్పన తెలిపారు. మంగళవారం పెద్దపల్లి బస్టాండ్ ఆవరణలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లేందుకు చేస్తున్న ఏర్పాట్లను సిరిసిల్ల, కోరుట్ల డిపో మేనేజర్లు ప్రకాశ్‌రావు, మనోహర్‌తో కలిసి ఆమె పరిశీలించారు. టికెట్ కౌంటర్, బస్సులు ఆగు స్థలం, ఇన్, అవుట్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మేడారం మహా కుంభమేళా జాతరకు పెద్దపల్లి బస్టాండ్ నుంచి మూడు డిపోలు జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల డిపోలకు చెందిన 175 ఆర్టీసీ బస్సులను ఈనెల 25 నుంచి వచ్చే నెల 1వ వరకు నడుపనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తాత్కాలిక మరుగు దొడ్లు, మంచి నీటి సౌకర్యం, మెడికల్ క్యాంపు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులో సురక్షితంగా తీసుకువెళ్లి.. మళ్లీ తిరుగు ప్రయాణం సురక్షితంగా గమ్య స్థానానికి చేరుస్తామని తెలిపారు.
మహిళలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మహాలక్ష్మి స్కీమ్ (జీరో టికెట్) వర్తిస్తుందని స్పష్టం చేశారు. పెద్దపల్లి నుంచి ములుగు జిల్లా మేడారం వరకు హాఫ్ టికెట్ రూ. 240, ఫుల్ టికెట్ రూ. 420 ఉంటుందన్నారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులలో వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి బస్‌స్టేషన్ మేనేజర్ కేఆర్ రెడ్డి, జగిత్యాల్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్, జగిత్యాల డిపో క్లర్క్ రామన్న, సిబ్బంది పాల్గొన్నారు.