అక్షరాలా.. లక్షా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల డబ్బు ఏడు మందికి ఇంకా పంట రుణమాఫీ కాలేదు! ఇదీ కూడా రెండు లక్షలలోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్యే! రెండు లక్షలపైన లోన్ తీసుకున్న అన్నదాతల సంఖ్య దాదాపు 40వేలకుపైనే ఉంటుందని అంచనా! నిజానికి రెండు లక్షలపై వారి మాట పక్కన పెడితే, ఆలోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు. ప్రతి రైతుకూ రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి,మంత్రులు ఊదరగొడుతున్నా ఎప్పటిలోగా పూర్తి చేస్తారో క్లారిటీ ఇవ్వడం లేదు. అంతేకాదు, రుణమాఫీకి సాంకేతిక కారణాలు అడ్డంకిగా నిలిచాయని, అందుకే క్రాప్‌లోన్ ఫ్యామిలీగ్రూపింగ్ పూర్తి చేసి.. ఆ వెంటనే మాఫీ చేస్తామని చెప్పిన మాటలు కూడా ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు.దీంతో రైతుల్లో అయోమయం నెలకొన్నది. కొత్త రుణాలకు వెళ్లలేక,రుణమాఫీ అవుతుందో కాదో తెలియక ఆందోళన వ్యక్తమవుతున్నది.
మరోవైపు ప్రభుత్వం తేల్చిన లెక్క ప్రకారం మాఫీకాని రైతుల సంఖ్య 1.39 లక్షల పైచిలుకు కనిపిస్తున్నా.. వాస్తవానికి అది రెండున్నర లక్షల వరకు ఉంటుందని తెలుస్తున్నది.
కరీంనగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికారిక లెక్కల ప్రకారం చూస్తే.. ఉమ్మడి జిల్లాలో 3,78,678 మంది రైతులు రెండు లక్షలలోపు రుణాలు తీసుకున్నట్టుగా గుర్తించారు. వీరంతా రుణమాఫీకి అర్హులని ముందుగా ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. అయితే అందులో ఈరోజు వరకు చూస్తే మూడు దఫాలుగా 2,39,231 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. అంటే ఇప్పటివరకు 58శాతం రైతులకే మాఫీ జరిగినట్టుగా అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా 42 శాతం మందికి రుణమాఫీ కావాల్సి ఉన్నది. ఇక రెండు లక్షలపైన రుణం తీసుకున్న వారి విషయంలో సర్కారు ఊసే ఎత్తడం లేదు. నిజానికి వాస్తవ లెక్కలను లోతుగా పరిశీలిస్తే.. ఉమ్మడి జిల్లాలో నాలుగున్నర లక్షల మంది వరకు రైతులు రుణాలు తీసుకున్నట్టు సమాచారం. అయినా ఎంపిక సమయంలోనే ప్రభుత్వం పలు రకాల కొర్రీలు పెట్టడంతో ఆ సంఖ్య 3.78 లక్షలకు తగ్గింది. వీరికి కూడా సంపూర్ణంగా రుణమాఫీ కాకపోవడం సర్కారు వైఫల్యానికి అద్దం పడుతున్నది.
గద్దెనెక్కక ముందు ఢాంబికాలు పలికిన కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం రుణమాఫీ విషయాన్ని మరిచినట్టు కనిపిస్తున్నది. ఆగస్టులోపే అర్హులైన ప్రతిరైతుకూ రుణమాఫీ వర్తింప జేస్తామని ఎన్నికల ముందు పదేపదే చెప్పినా.. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు మాట మారుస్తూ వస్తున్నది. మూడు విడుతల్లో మాఫీ చేసినట్టు చూపినా.. ఆ లెక్కలను ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే కేవలం రుణమాఫీ అది కూడా రెండు లక్షలలోపు ఉన్న 58 శాతం మంది రైతులకు మాత్రమే జరిగింది. మిగిలిన రైతులు పోరుబాట పట్టగా.. ముందుగా సర్కారు బుకాయించే ప్రయత్నం చేసినా రైతుల ఆగ్రహాన్ని పసిగట్టి చివరకు దిగొచ్చింది. ముందుగా రేషన్‌కార్డు సంబంధమైన సమస్యలను పరిష్కరించేందుకు క్రాప్‌లోన్ ఫ్యామిలీ గ్రూపింగ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు అధికారులు ఉమ్మడి జిల్లాలో సుమారు 80వేల పైచిలుకు రైతు కుటుంబాల గ్రూపింగ్ పూర్తి చేసి, ఆ వివరాలను ప్రభుత్వానికి అప్లోడ్ చేశారు. అందుకు సంబంధించిన ప్రక్రియను ఆగస్టు 26 నుంచే మొదలు పెట్టగా.. పలు జిల్లాల్లో పక్షం రోజులు, మరొకొన్ని జిల్లాలో 20 రోజుల్లో పూర్తి చేశారు. గ్రూపింగ్ పూర్తయిన రైతుల వివరాలు అప్లోడ్ అయిన వెంటనే రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రభుత్వం ముందుగా చెప్పింది. కానీ, గ్రూపింగ్ ప్రక్రియ పూర్తయి దాదాపు రెండున్నర నెలలు దాటుతున్నా నేటికీ అతీగతీ లేదు. అంతేకాదు, ఎప్పుడు మాఫీ చేస్తారో స్పష్టత ఇవ్వడం లేదు. ఇటీవల వేములవాడకు వచ్చిన ముఖ్యమంత్రి మాఫీ విషయంలో ఒక్క ముచ్చటా చెప్పలేదు. కానీ, ఇదే వేదికపై ఉన్న ఒకరిద్దరు మంత్రులు మాత్రం అర్హత ఉన్న వారికి మాఫీ చేస్తామంటూ చెప్పారే తప్ప నిర్దిష్ట సమయం చెప్పలేదు. దీంతో ఇప్పట్లో మాఫీ అవుతుందా..? లేదా..? అన్న ఆందోళన అన్నదాతల్లో నెలకొన్నది.
గ్రూపింగ్ పూర్తయిన రైతు కుటుంబాలకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారన్న విషయంపై ప్రభుత్వం నేటికీ స్పష్టత నివ్వకపోగా, మిగిలిన అనేక కారణాలతో రుణమాఫీకాని రైతులకు సంబంధించి ఎప్పుడు సర్వే చేస్తారన్న దానిపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉన్నది. రుణమాఫీ కాకపోవడానికి 31 సాంకేతిక కారణాలున్నాయని స్వయంగా రాష్ట్ర వ్యవసాయశాఖ గుర్తించి, ఆ వివరాలను గతంలోనే ప్రభుత్వానికి పంపిన విషయం తెలిసిందే. ఆ లెక్కన 31 అంశాలపై క్లారిటీ ఇస్తూ.. ఆ కారణాలతో రుణమాఫీ కాని రైతుల వివరాలను ప్రభుత్వం సేకరించాల్సి ఉన్నప్పటికీ కేవలం రేషన్‌కార్డు సమస్యలను మాత్రమే గ్రూపింగ్ చేసింది. మిగిలిన 30 కారణాలతో రుణమాఫీ కాని వివరాలను నేటికి సేకరించడం లేదు. నిజానికి ఈ దిశగా ఇంకా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆధార్‌లో అచ్చు తప్పులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు లేక ఇబ్బందులు, ఆధార్, పట్టాదారు పాసుపుస్తకానికి అలాగే బ్యాంకులో ఉన్న ఖతా నంబర్, ఆధార్ నంబర్ మధ్య తేడా, ఇన్వ్యాలిడ్ ఆధార్ నంబర్, నో డేటా ఫౌండ్, ఆధార్, రుణఖాతాల్లో వేర్వేరుగా ఉంటే ఆధార్ అప్లోడ్ చేయడం, ఆధార్ ఫ్యామిలీ గ్రూపింగ్, పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడం, ఆధార్‌తో బ్యాంకు లింకేజీ లేకపోవడం వంటి సాంకేతిక సమస్యలను సాకుగా చూపి ప్రభుత్వం రుణమాఫీ వర్తింప జేయకుండా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వ్యవసాయశాఖ నివేదిక ఇచ్చినా, రేషన్‌కార్డు సంబంధిత సమస్యలపై గ్రూపింగ్ పూర్తి చేసిన సర్కారు.. మిగిలిన సమస్యలతో రుణమాఫీ పొందని వారికి సంబంధించి ఎప్పటి నుంచి వివరాలు సేకరిస్తుందన్న దానిపై స్పష్టత ఇవ్వడం లేదు.
రెండు లక్షలపై రుణాలు తీసుకున్న వారికి రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీకి కట్టుబడి ఉన్నామని ఇప్పుడు కూడా చెబుతున్నది. అయితే రూ.రెండు లక్షల పై పంట రుణాలు తీసుకున్న రైతులు ముందుగా ఆ పై మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించాలని ఓ తిరకాసు పెట్టింది. నిజానికి ప్రభుత్వ మాటను నమ్మి చాలా చోట్ల రైతులు పై అమౌంట్‌ను చెల్లించారు. కానీ, వారిలో ఒక్కరికి కూడా రుణమాఫీ చేయలేదు. దీంతో మిగిలిన రైతులు రెండు లక్షలపై మొత్తాన్ని చెల్లించడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్టు ఆపై మొత్తం చెల్లిస్తే రుణమాఫీ జరుగుతుందో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చెల్లిస్తే రుణమాఫీ ఎప్పటిలోగా వర్తింపజేస్తారో చెప్పాలన్న దానికి ఏ అధికారి వద్ద సమాధానం లేదు. దీంతో సదరు రైతులు కూడా వేచి చూస్తున్నారు. దీని వల్ల వడ్డీలు తడసి మోపెడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.