కరీంనగర్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గతంలో భూమి హక్కులకు సంబంధించి అనేక రికార్డులు ఉండేవి. ముఖ్యంగా రెవెన్యూ అధికారుల చేతుల్లో 11 రకాల రికార్డులు నిర్వహించేవారు. ప్రభుత్వ, ప్రైవేట్, రైతు ల భూములు ఇలా అన్ని రకాల భూముల వివరాలు వాళ్ల చేతుల్లోనే ఉండేవి. ఒక్కో రికార్డులో మళ్లీ పదుల సంఖ్యలో కాలమ్స్ ఉండేవి. అధికారులే రాతపద్ధతిలో ఆ లెక్కల్లో మార్పు లు, చేర్పులు చేసేవాళ్లు. ఇక్కడే విచ్చలవిడి అవినీతి జరిగేది. ముఖ్యంగా పహాణీలో అక్రమాలకు అంతులేకుండాపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణిలో ఉన్న రికార్డులో మార్పులు, చేర్పులు చేసే అధికారాన్ని కిందిస్థాయి అధికారులకు లేకుండా చేసింది. ఏదైనా సమస్య ఉంటే రైతు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత.. కలెక్టర్ మాత్రమే పరిశీలించి మార్పు చేసే అవకాశం కల్పించింది. గతంలో మాదిరిగా వీఆర్వోలు, ఆర్ఐలు, ఎమ్మార్వోలు, ఆర్డీవోలు ఇష్టం వచ్చినట్టు రికార్డులు మార్చే సంస్కృతికి చరమగీతం పాడింది. ఏకంగా వీఆర్వో వ్యసవ్థను రద్దు చేసింది. అయితే, ఇటీవల కాంగ్రెస్ నాయకులు ధరణిని రద్దు చేసి పాత పద్ధతినే తెస్తామని చెబుతుండడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాత పద్ధతి తెస్తే మళ్లీ రైతులు భిక్షమెత్తుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. పైరవీకారులు రాజ్యమేలుతారని, లంచావతారులు పుట్టుకొస్తారని, ఏ చిన్న పనికైనా అధికారులు తమ చుట్టూ ఏండ్ల తరబడి తిప్పుకుంటారని, రికార్డులు తారుమారు చేసి ఒకరికొకరికి మధ్య పంచాయితీలు పెట్టిస్తారని వాపోతున్నారు. కాంగ్రెస్ నాయకులు రైతులను ముంచాలని చూస్తున్నదని మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వారిని నమ్మేది లేదని, తప్పకుండా బుద్ధి చెప్తామని స్పష్టం చేస్తున్నారు.
ధరణి తీసేస్తే..మళ్లా కాళ్లరిగేలా తిరగాలి
కాంగ్రెస్ ధరణి తొలగిస్తామంటుంది. ధరణితోనే రైతులకు ఎంతో మేలు. ధరణి పోర్టల్ ద్వారా అరగంటలో భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 15 రోజుల్లోనే పాస్ బుక్ ఇంటికి వస్తుంది. ఒక రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పని లేదు. మన వేలిముద్ర వేస్తేనే పోర్టల్ ఓపెన్ అవుతుంది. మన భూమి ఎకడికీ పోదు. ల్యాండ్ కన్వర్జేషన్ కూడా పది నిమిషాల్లో అయిపోతుంది. గతంలోనైతే రైతులు కార్యాలయాలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి ఉండేది. కాంగ్రెస్ చెప్పినట్లు పటేల్, పట్వారీ వ్యవస్థ లాంటిది మల్ల వస్తే రైతులు కష్టాలు పడతరు. అధికారుల చేతివాటం ఎకువవుతుంది. రైతులకు చిన్న పహానీ నకలు కావాలన్నా, రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. రైతులు భూమాత పోర్టల్‌ను వ్యతిరేకిస్తున్నరు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలి.
– సందవేని ప్రశాంత్ యాదవ్, రైతు, (గన్నేరువరం)
భూముల లెకే ఉండది
ధరణి రాకముందు మా నాన్న పేరు మీద 10 గుంటలు రికార్డులకు ఎకించడానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. చాలామంది రైతులు ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడ్డరు. అట్లనే మనకు సంబంధించిన భూమి లంచాలు ఇచ్చి ఇతరులు మార్చుకునే అవకాశం లేకపోలేదు. పాతకాలం రికార్డుల ప్రకారం బలమున్నవాడిదే భూమి అన్నట్లు ఉండేది. ఒక అధికారికి తెలియకుండా కూడా రికార్డులు తారుమారు చేసే వ్యవస్థ ఉండేది. మోఖా మీద ఒక రైతు ఉంటడు.. అతడికి తెలియకుండానే మరో రైతు రికార్డుల్లో ఉండేటోడు. అప్పట్లో అలా ఉండేది వ్యవస్థ. కేసీఆర్ సార్ వచ్చి ధరణితో అద్భుతమైన రికార్డులను తయారు చేసిండు. ధరణి పోతే భూముల లెకే తప్పుతుంది. – గుజ్జుల ప్రణీత్‌రెడ్డి,రైతు, ఉపసర్పంచ్, రామకృష్ణ కాలనీ(తిమ్మాపూర్)
పట్వారీ వ్యవస్థతో మళ్లీ కష్టాలే..
నాకు 12 ఎకరాల భూమి ఉంది. ధరణితో నాకున్న భూమి ఆన్లైన్లో ఎక్కింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు. తెలంగాణ రాక ముందు ఉన్న పట్వారీ వ్యవస్థ వల్ల తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరిగీ తిరిగి కాళ్లకు చెప్పులు అరిగిపోతుండె. అప్పుడు మస్తు గోస పడ్డం. పహనీ కావాలని పట్వారీ దగ్గరికి వెళ్తే తింపుకొని తింపుకొని ఎంతో కొంత పైసలు ఇస్తేనే ఇచ్చెటోళ్లు. పట్వారీలు ఉన్నప్పుడు పంట నష్టం రాయాలన్నా, బ్యాంక్ లోన్‌కు భూ రికార్డులు కావాలన్నా ఖర్చు లేనిదే పనయ్యేది కాదు. భూమి కొని పట్టా చేసుకున్న తర్వాత దానిని రికార్డుల్లోకి ఎకించి మ్యుటేషన్ చేయించాలన్నా. పట్టా పాసుబుక్ కావాలన్నా తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరిగీ తిరిగి ఇబ్బంది పడేది. పట్వారీ వ్యవస్థతో రైతులంతా ఎన్నోపాట్లు పడ్డరు. కౌలుదారు, పట్టాదారు కాలమ్ పెట్టి భూములున్న రైతులను నట్టేట ముంచాలని చూస్తున్నరు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సార్ ధరణితో ఒక దగ్గరనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసి సాయంత్రం వరకు పాసుబుక్ ఇస్తున్నరు. ఇప్పుడు మా భూమిపై మాకు పూర్తి అధికారం వచ్చింది. ధరణి తెచ్చి మాకు రైతు బంధు ఇస్తున్నరు. కాంగ్రెసోళ్లు ధరణి లేదు.. ఏమీ లేదు అంటున్నరు. ధరణి లేకపోతే రైతులు ఆగమవుతరు. ధరణితో లాభాలే తప్ప నష్టాలు లేవు. – గుర్రం మల్లారెడ్డి, తూర్పురెడ్డి సంఘం అధ్యక్షుడు, చొప్పదండి
ధరణి తీసేస్తే లంచాల బాధ తప్పదు
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ చాలా బాగుంది. ధరణి పోర్టల్ ద్వారా అరగంటలో భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వారం రోజుల్లోనే పాస్ బుక్ ఇంటికి వస్తుంది. ఎకడా ఒక రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం వేలిముద్ర వేస్తేనే పోర్టల్ ఓపెన్ అవుతుంది. గతంలో రైతులు కార్యాలయం చుట్టూ తిరిగేటోళ్లు. కింద నుంచి పైదాకా ప్రతీ అధికారికి లంచం ఇవ్వాల్సిన పని ఉండేది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు ఇబ్బంది పడతరు. ధరణి తీసేస్తే మళ్లీ లంచాల బాధ తప్పదు.
– కానుగంటి సత్యనారాయణరెడ్డి, రైతు,ఉప సర్పంచ్,గొల్లపల్లి (తిమ్మాపూర్ రూరల్)
మళ్లీ కష్టాలే
ధరణి వచ్చినంక నిరుపేదల బాధలు తొలిగినయ్. కార్యాలయాల చుట్టూ తిరుగుడు.. అధికారులకు దండం పెట్టే పరిస్థితి పోయింది. భూమి రిజిస్ట్రేషన్ పావుగంటల పూర్తయితంది. నయా పైసా ఖర్చులేదు. పాసుబుక్ టప్పాలో ఇంటికే వస్తంది. కాంగ్రెసోళ్లు మళ్లీ పట్వార్ల పాలన రావాలని చూస్తున్నరు. ధరణిమీద వాళ్లకు అవగాహన లేదు. రాజకీయం కోసం పేదలకు ధరణి తీసేయద్దు. ఎన్నడూ చూడని విధంగా కంప్యూటర్లతో భూమి పనులు అవుతున్నయ్. యాజమానికి తెలియకుండా భూమి మార్పు జరగదు. మోసం పనులు చేస్తే సెల్‌కు మెసేజ్‌లు వస్తయ్. కాంగ్రెస్ మాటలను నమ్మితే పాత పెత్తందారుల వ్యవస్థ వస్తుంది. పిచ్చి మాటలు మాట్లాడుతున్న రేవంత్‌ను నమ్మం. ధరణి తీసేస్తే సహించం.
– యాదగిరి, ముదిరాజ్ సంఘం నాయకుడు, కట్టరాంపూర్, కరీంనగర్(తెలంగాణచౌక్)
మల్లా ఎమ్మార్వో ఆఫీసుల సుట్టూ తిరుగుడే
ధరణిని రద్దు చేసి పాత వ్యవస్థ వస్తే, మల్లా ఎమ్మార్వో ఆఫీసుల సుట్టూ తిరుగుడే. ఇక చెప్పులు అరుగుడే ఉంటది. ధరణిని తీసేస్తే పటేల్, పట్వారీ వ్యవస్థ వస్తుంది. మళ్లీ బ్రోకర్లు పుట్టుకొస్తరు. ఇప్పుడు ఉన్న ధరణితో సమస్యలు తొలిగిపోయాయి. ధరణిని తీసేసి భూమాతను తీసుకొస్తే కాంగ్రెస్ నాయకులే బ్రోకర్ల అవతారమెత్తుతరు. ధరణితో పట్టదారు పుస్తకాలు, వెంటనే మ్యూటేషన్ అయి ఇస్తున్నరు. ఆనాడు పట్వార్ల చుట్టూ తిరుగుతూ.. ఏమన్న జేబు వాటం ఇస్తేనే పని అయ్యేది. ధరణి తీసేస్తే మళ్లీ రైతులు ఆగం కావల్సిన పరిస్థితి వస్తుంది. ధరణి వచ్చినంకనే అక్రమాలు తగ్గి, రిజిస్ట్రేషన్ సులభతరమైంది. రైతు వేలి ముద్రలు లేకుండా పట్టా మారదు.
-సాదినేని ఆదిరెడ్డి, రైతు, సదాశివపల్లి (మానకొండూర్ రూరల్)