ప్రగతి ప్రదాత సీఎం కేసీఆర్ సారథ్యంలో యావత్ దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ, ఇప్పుడు సగర్వంగా దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 2న జెండా ఆవిష్కరణతో వేడుకలు మొదలై, 22న అమరుల సంస్మరణతో ముగియనుండగా.. 21 రోజులపాటు రోజుకో కార్యక్రమం పండుగలా నిర్వహించేందుకు యంత్రాంగం సమాయత్తమైంది. తెలంగాణ ఘన కీర్తిని చాటేలా.. భావితరాలు గుర్తుంచుకునేలా.. అమరుల త్యాగాలను స్మరిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఆ మేరకు మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు సన్నాహక సమావేశాలను నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మరోవైపు గడిచిన తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను ప్రతి ఒక్కరికీ తెలిసేలా శాఖల వారీగా ప్రగతి నివేదికలు, కరపత్రాలను రూపొందిస్తున్నారు.
నీళ్లు.. నాడు ఉద్యమనేతగా తెలంగాణ ప్రజల నీళ్ల గోసను కండ్లారా చూసిన కేసీఆర్, స్వరాష్ట్రంలో అపరభగీరథుడిలా మారారు. మూడేళ్ల స్వల్పకాలంలోనే కాళేశ్వరం ఎత్తిపోతలను పూర్తి చేసి, గోదారి జలాలను బీడు భూములకు మళ్లించారు. కరువు నేలను కూడా సస్యశ్యామలం చేశారు. దండుగన్న ఎవుసాన్ని పండుగలా మార్చారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 24గంటల కరెంట్, రైతుబంధు, పంటల కొనుగోళ్లు, రైతుబీమా ఇలా ఎన్నో కార్యక్రమాలతో రైతులకు అన్ని విధాలా అండగా నిలిచారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛజలం అందిస్తూ తాగునీటి గోస తీర్చారు.
నిధులు.. నాడు మన నిధులను ఆంధ్రాకు మళ్లించి తెలంగాణకు మొండిచేయి చూపితే.. రాష్ట్రం ఏర్పాటు తర్వాత మాత్రం సీఎం కేసీఆర్ నిధుల వరద పారించారు. ప్రతి పల్లెకూ కోట్లాది రూపాయలు కేటాయించి, అభివృద్ధికి కేరాఫ్‌లా తీర్చిదిద్దారు. రోడ్లు, భవనాలు, మౌళిక సదుపాయాల కల్పనతో ఇవాళ రాష్ర్టాన్ని దేశానికే దిక్సూచిలా మార్చారు. సంక్షేమానికీ ప్రాధాన్యమిచ్చి అన్ని వర్గాలకు భరోసానిచ్చారు.
నియామకాలు.. నాడు మన కొలువులను ఆంధ్రా ప్రాంతం వాళ్లు కొల్లగొడితే.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మన ఉద్యోగాలను మనకే కట్టబెడుతున్నారు. జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి 90 శాతం నౌకర్లను స్థానికులకే కేటాయించారు. పెద్ద ఎత్తున కొలువుల భర్తీకి శ్రీకారం చుట్టి, దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో దాదాపు 80 వేల పైచిలుకు పోస్టులను విడుతల వారీగా భర్తీ చేస్తున్నారు. మరోవైపు విద్యారంగాన్ని బలోపేతం చేసి, అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నారు.
స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన నాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆనాడు ఉద్యమ సమయంలో ప్రజల కష్టాలను కండ్లారా చూసి చలించిపోయిన ఆయన, రాష్ట్రం ఏర్పాటు తర్వాత అధికార పగ్గాలు చేపట్టి ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చారు. అన్ని వర్గాలకూ భరోసాగా నిలిచారు. అన్నింటా ప్రగతిని పరుగులు పెట్టించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మాడల్‌గా నిలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను భావి తరాలు గుర్తుంచుకునేలా నిర్వహించుకునేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.
జూన్ 2 నుంచి 22 వతేదీ వరకు తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా పండుగ వాతావరణంలో జరుపాలని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన లోగోను సైతం ఆవిష్కరించడంతోపాటు 21 రోజులపాటు ఏ రోజు ఏ కార్యక్రమం చేయాలి? ఎలాచేయాలన్న దానిపై స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రకటించగా, ఆ మేరకు జిల్లాల వారీగా మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈ నెల 2న జెండా ఆవిష్కరణతో ప్రారంభమయ్యే వేడుకలు 22న జరిగే అమరవీరుల సంస్మరణతో ముగియనుండగా, నిర్ణీత తేదీల్లో ఆయా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే సభలు, సమావేశాలకు ట్రాన్స్పోర్ట్తోపాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు.
Ts10th
ప్రతి శాఖా ప్రగతి నివేదన
గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. విద్య, వైద్యం, తాగు, సాగునీరు, కరెంట్, మౌళిక సదుపాయాలు ఇలా అన్నింటా దూసుకెళ్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో నంబర్‌వన్‌గా నిలుస్తున్నది. ఇంటింటికీ సర్కారు ఫలాలు అందుతున్నాయి. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా వంటి పథకాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయి. అయినా సదరు పథకాలపై ఏనాడు ప్రచారం చేయలేదు. కానీ ప్రతిపక్షాలు చేస్తున్న అర్థరహిత విమర్శల నేపథ్యంలో.. ప్రతి శాఖకు సంబంధించి సాధించిన ప్రగతి వివరాలను దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజల ముందు పెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. ఆ మేరకు సభలు, సమావేశాల్లోనే కాకుండా.. తెలంగాణ ప్రభుత్వం సాధించిన అద్భుత విజయాలను అధికారులు గడపగడపకూ వివరించనున్నారు.
ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు శాఖల వారీగా సమీక్షలు నిర్వహించడంతోపాటు అభివృద్ధికి సంబంధించిన వివరాలతో కరపత్రాలను ముద్రించాలని ఆదేశించారు. చేసింది చెప్పడమే లక్ష్యంగా ఈ ప్రగతి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ రాక ముందు కరెంటు పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, డిమాండ్ పెరిగినా నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్న తీరు, దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా సాగుకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్.. వంటి వాటి గురించి వివరించనున్నారు. ఇంకా సాగునీటి గోసను తీర్చిన తీరును వివరిస్తారు. గతంలో ఒక్క ప్రాజెక్టు కట్టాలంటే దశాబ్దాలు పట్టేది కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్ల కాలంలోనే గోదావరిపై కొత్తగా మూడు బరాజ్‌లు నిర్మించడం, మధ్యమానేరు పూర్తి చేయడం, అలాగే వరదకాలువను నాలుగు రిజర్వాయర్లుగా మార్చడం, ప్రపంచం అబ్బుర పడేలా కాళేశ్వర ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తెచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేయడం లాంటివే కాదు, ప్రతి పల్లెపల్లెకూ కాళేశ్వరం జలాలు పరుగులు తీయడం వంటి వాటి గురించి విడమరిచి చెప్పనున్నారు.
ప్రతిపక్షాల వణుకు
నిత్యం అబద్ధాల ప్రాపగండ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీకి దశాబ్ది ఉత్సవాలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. జరిగిన అభివృద్ధిని, అందుతున్న సంక్షేమ ఫలాల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్ష పార్టీలు గ్లోబెల్స్ ప్రచారానికి దిగుతున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని ఇప్పటి నుంచే ఆచరణ సాధ్యంకాని హామీలను గుప్పిస్తున్నాయి. కండ్ల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశానికి రోల్‌మాడల్‌గా మారితే.. వాటిని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వార్డు నుంచి గ్రా మం వరకు.. గ్రామం నుంచి నియోజకవర్గం వరకు.. అక్కడి నుంచి జిల్లా కేంద్రం వరకు.. ప్రతి విభాగంలో జరిగిన అభివృద్ధిని అంకె లు, ఆధారాలతో సహా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అధికారులు వివరించనున్నారు. అందుకు సంబంధించిన వివరాలను సేకరించి, వాటిని ప్రజల ముందు పెట్టేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గడిచిన తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు కండ్లకు కట్టినట్లుగా చూపడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. తద్వారా నిజానిజాలు ప్రజలకు పూర్తిస్థాయిలో తెలిసే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిస్తే ఇన్నాళ్లూ చేసిన గ్లోబెల్స్ ప్రచారమంతా అబద్ధమేనని తెలుస్తుందని, తద్వారా తమ పార్టీల ఉనికికే ప్రమాదముటుందని బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నాయని ఆ పార్టీలోనే కొంత మంది నేతలు చెబుతున్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్
జూన్ 2: ఉత్సవాల ప్రారంభోత్సవం
జూన్ 3: తెలంగాణ రైతు దినోత్సవం
జూన్ 4: సురక్షా దినోత్సవం
జూన్ 5: విద్యుత్ విజయోత్సవం
జూన్ 6: పారిశ్రామిక ప్రగతి ఉత్సవం
జూన్ 7: సాగునీటి దినోత్సవం
జూన్ 8: ఊరూరా చెరువుల పండుగ
జూన్ 9: తెలంగాణ సంక్షేమ సంబురాలు
జూన్ 10: సుపరిపాలన దినోత్సవం
జూన్ 11: సాహిత్య దినోత్సవం
జూన్ 12: తెలంగాణ రన్
జూన్ 13: మహిళా సంక్షేమ దినోత్సవం
జూన్ 14: వైద్యారోగ్య దినోత్సవం
జూన్15: పల్లె ప్రగతి దినోత్సవం
జూన్ 16: పట్టణ ప్రగతి దినోత్సవం
జూన్ 17: తెలంగాణ గిరిజనోత్సవం
జూన్ 18: మంచి నీళ్ల పండుగ
జూన్ 19: తెలంగాణ హరితోత్సవం
జూన్ 20: విద్యా దినోత్సవం
జూన్ 21: తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం
జూన్ 22: అమరుల సంస్మరణ