కోల్సిటీ, ఏప్రిల్ 4 : పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇంకా ఎక్కడా పంపిణీ చేయడం లేదు. ఈ ఉగాది నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో పండుగ రోజున గోదావరిఖనిలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తహసీల్దార్ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు.
అయితే, మరుసటి రోజు నుంచి నగరంలో ఎక్కడ చూసినా రేషన్ దుకాణాలు మూసే ఉన్నాయి. ఈ విషయమై తహసీల్దార్ కుమారస్వామిని సంప్రదించగా, తమకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4 నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. అయితే, శుక్రవారం కూడా గోదావరిఖనిలోని పలు డివిజన్లలో రేషన్ దుకాణాలు మూసే ఉన్నాయి. ఉదయం కార్డులు చేతపట్టుకొని దుకాణాలకు వచ్చిన లబ్ధిదారులు సాయంత్రం నుంచి పోస్తారని భావించి వెనుదిరిగి వెళ్లిపోయారు. తీరా సాయంత్రం కూడా రేషన్ దుకాణాలు మూసే ఉండడంతో ఈ పండుగకు సన్నబియ్యం దేవుడెరుగు? పేదవాళ్లను పస్తులు ఉంచుతారా? అని పలువురు లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.