మూడు దశాబ్దాలపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందించి అలసిపోయిన విశ్రాంత ఉద్యోగులను కాంగ్రెస్ సర్కారు సతాయిస్తున్నది. ఉద్యోగ విరమణ తర్వాత ప్రయోజనాలను అందించకుండా వేధిస్తున్నది. ప్రశాంతంగా.. సంతోషంగా గడపాల్సిన శేష జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నది. ఏడాదిన్నర గడిచినా జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ, జీఐఎస్, గ్రాట్యూటీ డబ్బులు అందక విశ్రాంత ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఇప్పటికే జిల్లాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేసినా ఫలితం లేక నేడు హైదరాబాద్‌లో మహాధర్నాకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని, తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కరీంనగర్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. 30 నుంచి 40 ఏళ్లపాటు వివిధ శాఖల్లో సేవలందించి రిటైర్ అయిన తర్వాత.. కాంగ్రెస్ చేసిన మోసానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక మానసికంగా కుంగిపోతున్నారు. 20 నెలలుగా ఎవరిని కదిలించినా కన్నీటి కష్టాలే చెప్పుకొంటున్నారు. న్యాయబద్ధంగా, హక్కుగా చెందాల్సిన జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ, జీఐఎస్తోపాటు గ్రాట్యూటీ కూడా అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమకు ఇచ్చిన మాట తప్పిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందిస్తామని, బకాయిలను తక్షణమే చెల్లిస్తామని, ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని, పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను మంజూరు చేస్తామని, ఉద్యోగుల పాక్షిక కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని దవాఖానల్లో వైద్యం అందించేందుకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని, ఉద్యోగ, ఉపాధ్యాయుల అన్ని సమస్యలు సంపూర్ణంగా పరిషరిస్తామని, సీపీఎస్‌ను రద్దు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులను, ప్రత్యేకించి రిటైర్ కాబోయే ఉద్యోగులను నమ్మించి..
ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని మండిపడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, ప్రత్యేకించి రిటైర్ కాబోయే వారికి, పెన్షనర్లకు ఎన్నో రకాల ఆశలు చూపించి మోసం చేసిందని ఆగ్రహిస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు ఎలాంటి బకాయిలు చెల్లించకపోవడం, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకపోవడంతో ముసలి వయసులోనూ విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వంపై పోరుబాట పడుతున్నారు.
రెండేళ్లుగా అన్నీ పెండింగే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా బేసిక్ పే లో 6.25 జీపీఎఫ్‌లో చేసుకున్న పొదుపు డబ్బులు కూడా ఇవ్వ లేదు. లక్ష బేసిక్ పే ఉన్న ఉద్యోగి నెలకు 6,250 జీపీఎఫ్ ఖాతాలో జమ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం దగ్గర దాచుకుంటే నమ్మకంగా ఉంటుందని భావించి, చాలా మంది ఉద్యోగులు తమ వేతనం నుంచి 10 నుంచి 15 శాతం తమ ఇష్ట ప్రకారంగా జీపీఎఫ్‌లో జమ చేసుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత ఈ మొత్తానికి వడ్డీతోసహా ఒకే సారి తీసుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతున్నది. నెలనెలా జమ చేసుకున్న జీపీఎఫ్ డబ్బు కూడా ఇంత వరకు ఇవ్వలేదు. జీపీఎఫ్ కిందనే ఒక్కో ఉద్యోగికి వారి హోదాలను బట్టి 10 లక్షల నుంచి 20 లక్షలు రావాల్సి ఉన్నది.
తెలంగాణ స్టేట్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్.. ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రతి ఉద్యోగి తెలంగాణ స్టేట్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో చేరుతారు. ఉద్యోగంలో ఉండగా ఏమైనా జరిగితే వారి కుటుంబం బజారున పడుతుందని భావించి.. ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి 58 ఏళ్లు వచ్చేవరకు బేసిక్ పే ప్రకారం వేతనం నుంచి ప్రతినెలా 500 నుంచి 2 వేల వరకు డిడక్షన్ చేసి, తమ అకౌంట్లో జమ చేస్తారు. 58 ఏళ్ల పీరియడ్ ముగిసిన తర్వాత అకౌంట్‌ను క్లోజ్ చేసి, మొత్తం డబ్బును చెకు రూపేనా అందించాల్సి ఉంటుంది. ఉద్యోగి స్థాయిని బట్టి 3లక్షల నుంచి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ డబ్బులు రావాల్సి ఉన్నది. ఇవి ఇవ్వకుండా ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నది.
గ్రూప్ ఇన్సూరెన్స్ సీమ్.. ప్రతి ఉద్యోగి నుంచి ప్రభుత్వం ప్రతి నెలా నిబంధనల మేరకు 30-60-120 చొప్పున డిడక్షన్ చేస్తుంది. ఉద్యోగి సర్వీస్‌లో ఉన్న కాలంలో ఇన్సూరెన్స్ కోసం ఉద్యోగుల జీతం నుంచి మినహాయింపు చేసుకున్న ఈ డబ్బు వడ్డీతోసహా ఉద్యోగ విరమణ రోజే చెల్లించాలి. ఉద్యోగి స్థాయిని బట్టి లక్ష నుంచి 2 లక్షల వరకు ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ రావాల్సి ఉన్నది. అంతేకాకుండా ప్రభుత్వోద్యోగి తనకున్న కొన్ని ప్రత్యేక సెలవులను ఎంత అవసరమున్న వాడుకోకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ అయిన తర్వాత 300 సెలవులను ప్రభుత్వానికి తిరిగి అమ్ముకోవచ్చనే ఉద్దేశంతో పొదుపు చేసుకుంటాడు. రిటైర్మెంట్ రోజే రావాల్సిన లీవ్ ఎనాష్మెంట్ కింద ఒక్కో ఉద్యోగికి 8లక్షల నుంచి 10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది.
కమ్యూటేషన్.. నిబంధనల ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రిటర్మెంట్ అయిన తర్వాత తన పెన్షన్ బేసిక్ పే నుంచి 40 శాతం ప్రభుత్వానికి అమ్ముకునే సదుపాయం ఉంది. ప్రభుత్వం కమీషన్ పేరిట ఇచ్చే ఈ డబ్బును 15 ఏళ్లు లేదా 180 నెలలు ప్రభుత్వం పెన్షన్‌దారుల నుంచి తిరిగి తీసుకుంటుంది. ఒక రకంగా ఇది రిటైర్మెంట్ అయిన వారికి, వారు తమకు చేసిన సేవకు గుర్తింపుగా ఇచ్చే అప్పుగా భావించాల్సి ఉంటుంది. 20లక్షల నుంచి 25 లక్షల వరకు పెన్షన్‌దారుల పెన్షన్ నుంచి ప్రతి నెలా వడ్డీతో సహా మినహాయింపు చేసుకొనేందుకు ఇచ్చే డబ్బులు కూడా సెటిల్మెంట్ చేయ లేదు. అయితే ఒక్క గ్రాట్యూటీ కింద వచ్చే మొత్తాన్ని మాత్రం ప్రభుత్వం చెల్లించింది. ఒక్కో ఉద్యోగికి వారి హోదాలను బట్టి 50లక్షల నుంచి 75 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సి ఉన్నది. ఈ బెనిఫిట్స్ రాకముందే కొందరు విశ్రాంత ఉద్యోగులు గుండె పోటుతో మరణిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు 26 మంది మరణించినట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కోహెడ్ చంద్రమౌళి ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు హైదరాబాద్‌లో ధర్నా
తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి దిగారు. రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ పేరిట ఇప్పటికే సంఘటితమయ్యారు. ఇప్పటి వరకు ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల ఎదుట నిరసన దీక్షలు, ధర్నాలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు చేయబోతున్నారు. అందుకోసం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు.
అనేక బాధలు పడుతున్నాం
ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంతో సంతోషంగా శేష జీవితాన్ని గడపాలని ఆశిస్తే ప్రభుత్వం మాకు పెద్ద షాక్ ఇచ్చింది. ఒక్క గ్రాట్యుటీ మినహా ఒక్క బెన్ఫిట్ కూడా అందలేదు. 2024 మార్చి నుంచి డిసెంబర్ వరకు దాదాపు రాష్ట్రంలో 8,972 మంది, 2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు సుమారు 7 వేల మంది చొప్పున ఇప్పటి వరకు సుమారు 16వేల మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు రిటైర్మెంట్ తీసుకున్నారు. వీరిలో కేవలం 10 శాతం మందికి కూడా పూర్తి స్థాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు నెలకు కొంత మొత్తాన్ని విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఒకట్రెండు సార్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.
ఒక్కో ఉద్యోగికి సగటున 60 లక్షల చొప్పున 16 వేల మందికి 9వేల కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు ఉన్నాయి. కానీ, 18 వేల కోట్లు అవసరం ఉంటాయని కొందరు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి బెనిఫిట్స్ అందకుండానే రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది విశ్రాంత ఉద్యోగులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలోనే ఒక విశ్రాంత ఉద్యోగి గుండె పోటుతో మరణించినా ఆయనలో చలనం కలగడం లేదు. అందుకే పోరాటం ఒక్కటే శరణ్యమని శాంతియుత నిరసనలు తెలుపుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు రావాల్సిన బెనిఫిట్స్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– కోహెడ చంద్రమౌళి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్