యూట్యూబ్ స్టార్ మన ఉమ్మడి జిల్లా బిడ్డ కిరణ్మయి
రెండేళ్ల వయసు నుంచే నటన
ఎల్లలు దాటినప్రతిభ
దేశ విదేశాల్లో అభిమానులు
ఇప్పటిదాకా వందకుపైనే వీడియోలు
చిల్డ్రన్స్ ఫేంగా గుర్తింపు
వెల్గటూర్, మే 2:కొండాపూర్‌కు చెందిన ఇప్పల జితేందర్, పూజిత దంపతులకు మేఘన, జున్ను అలియాస్ కిరణ్మయి ఇద్దరు కూతుళ్లు. జితేందర్ వ్యవసాయంతోపాటు చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. కూతుళ్లు తమ పసిప్రాయంలోనే ముద్దుముద్దు మాటలతో అలరించేవారు. ఈ క్రమంలో జున్ను బాబాయి సురేశ్ అప్పటికే క్రియేటివ్ థింకింగ్ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఓ రోజు జున్ను మాటలతో ఒక వీడియో తీసి అప్లోడ్ చేశాడు. మంచి ఆదరణ రావడంతో జున్ను ప్రధాన పాత్రగా మరిన్ని షార్ట్ ఫిలింలు తీశాడు. ఇలా తన రెండో ఏటనే జున్ను లఘుచిత్రాల్లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు ఏడేళ్లు. గత ఐదేళ్లుగా తన నటనతో మెప్పిస్తున్నది. ఇవ్వాళ మెజార్టీ ఇండ్లలో మారాం చేసే పిల్లలకు జున్ను వీడియోలు ఒక బూస్ట్ అని చెప్పాలి.
ఆ చిన్నారి బుజ్జిబుజ్జి మాటలు వింటే అప్పటిదాకా ఏడ్చే పిల్లలూ సైలెంట్ అయిపోతారు. ఎంత బతిమిలాడినా అన్నం తినని వారు సైతం, ఆమె కామెడీ చూస్తే మెతుకు మిగల్చకుండా లాగించేస్తారు. ఆమె డ్యాన్స్, జోక్స్ చూసి తెగనవ్వేస్తుంటారు. పిల్లలే కాదు.. పడుచుపోరగాండ్ల నుంచి పండు ముసలిదాక ఆమె నటనకు ఫిదా అయిపోతుంటారు. ఆమెనే లిటిల్ స్టార్ జున్ను అలియాస్ కిరణ్మయి. వెల్గటూర్ మండలం కొండాపూర్‌కు చెందిన ఈ చిచ్చర పిడుగు షార్ట్ ఫిలింలలో దుమ్ములేపుతున్నది. తన చిట్టిచిట్టి మాటలతో అలరిస్తూ ప్రేక్షకుల మదిని దోచేయడమేకాదు యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్‌ను కొల్లగొడుతున్నది. అచ్చమైన గ్రామీణ నేపథ్యం.. తెలంగాణ యాస, అమాయకత్వపు మాటలు, పాత్రకు తగ్గట్టు అభినయంతో అందరినీ మెప్పిస్తూ ఈతరం చిల్డ్రన్స్ ఫేంగా గుర్తింపు పొందింది. ఇప్పటిదాకా వందకు పైనే షార్ట్‌ఫిలింలు చేసిన చిన్నారి, ఇటీవలే తన బృంద సభ్యుల భాగస్వామ్యంతో ‘ఫైవ్‌స్టార్’ చానల్‌ను ఆవిష్కరించి జనానికి మరింత చేరువైంది.
నాకోసం చాలా మంది వస్తున్నరు
నేను సెకండ్ క్లాస్ చదువుతున్న. నేను మాట్లాడితే మా బాబాయి వీడియో తీసిండు. ఇప్పుడీ కోతి (వెంకటేశ్) తీస్తుండు. అందరు వీడియోలు చూసి ఫోన్లు చేస్తున్రు. మా ఇంటికి రోజూ చానా మంది వచ్చి నాతో సెల్ఫీలు దిగుతున్నరు. చాక్లెట్స్, బిస్కట్స్ ఇస్తున్నరు.
షార్ట్ ఫిలిం ఏదైనా.. ఏ నేపథ్యంతో సాగినా జున్నుదే కీలక పాత్ర. అంత పిన్న వయసులోనే అంతలా పేరు తెచ్చుకుంది. సింగిల్ టేక్‌లోనే డైలాగ్‌లు, పంచులు విసురుతూ తెలుగు ప్రజల మన్ననలు పొందింది. ఓ వైపు చదువుకుంటూనే, మరోవైపు సెలవురోజుల్లో నటిస్తున్నది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూతపడడంతో మరిన్ని ఎక్కువ వీడియోలు చేస్తున్నది. కాగా, ప్రధానంగా ‘సుందిపిల్ల, బర్రెపోతే, వినాయక చవితి చిత్రాలు, చదువుల తల్లి, సర్కారు బడి, అత్తాకోడలు, వంటలక్క’లో నటన, చక్కని అభినయంతో అదరగొట్టి, చిల్డ్రన్ ఫేంగా మారిపోయింది. వీడియో అప్ చేసిన కొద్దిరోజులకే మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. ఇలా తన తల్లిదండ్రులకు తన నటన ద్వారా ఆదాయాన్ని అందిస్తున్న చిన్నారి, గడిచిన ఐదేండ్లలో 100కుపైనే షార్ట్ ఫిలింలు చేసింది. ఇటీవలే తన బృంద సభ్యులతో ప్రారంభమైన సొంతచానల్లో నటిస్తూ దుమ్ములేపున్నది.