రాజన్న సిరిసిల్ల, జూలై 9 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయి. సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే పది మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేసి నేతన్నల ప్రాణాలు తీస్తున్నది’ అంటూ రేవంత్‌రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అనాలోచిత నిర్ణయాలు మాని.. నేతన్నలు, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మరమగ్గాలు, చేనేత కార్మికులపై కక్షగట్టి వారి ప్రాణాలు తీస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేనేత, మరనేతన్నల ఆత్మహత్యలు నివారించి, బతుకమ్మ చీరల ఆర్డర్ల ద్వారా వారికి ఉపాధి కల్పించామని తెలిపారు. బతుకమ్మ చీరల ఆర్డర్ల కారణంగా నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయిన విషయాన్ని గుర్తుచేశారు.
ఏటా 350కోట్ల విలువైన బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లతో నేతన్నలకు చేతినిండా పని కల్పించినట్టు తెలిపారు. పేదింటి ఆడబిడ్డలకు కానుకగా కోటి బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. చీరల పంపిణీతో మరమగ్గాల పరిశ్రమతో పాటు అనుబంధ రంగాల్లో పనిచేసే వేలాది మందికి ఉపాధి లభించిందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రభుత్వంపై తమపై కక్షతో బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేసేందుకు కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. నేతన్నలు, చేనేత కార్మికుల ఉసురు తీయవద్దని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి.. నేతన్నలకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బతుకమ్మ ఆర్డర్లు రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం మేరకు కేటీఆర్ పై విధంగా స్పందిస్తూ పోస్ట్ చేశారు.