గోదావరిఖని, మార్చి 22 : సింగరేణి ఆర్జీ-1 పరిధిలోని మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ అయిన, మృతిచెందిన ఎన్సీడబ్ల్యూ ఉద్యోగుల డిపెండెంట్లు 23 మందికి జీఎం నారాయణ మంగళవారం కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. సీఎండీ శ్రీధర్ ఆదేశాలతో త్వరితగతిన కారుణ్య నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వెంటనే అన్ఫిట్ అయిన వారి కుటుంబ సభ్యులకు పోస్టింగ్ అందుతున్నదన్నారు. నియామకపత్రాలు అందుకున్న వారిలో ముగ్గురు మహిళలు, 20 మంది పురుషులు ఉన్నట్లు జీఎం తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ పర్సనల్ మేనేజర్ సీహెచ్ లక్ష్మీనారాయణ, సీఎంవోఏఐ అధ్యక్షుడు పోనోగోటి శ్రీనివాస్, జీఎం కార్యాలయ ఇన్చార్జి ప్రవీణ్, సీనియర్ పర్సనల్ అధికారి శ్రావణ్, డిప్యూటీ సూపరింటెండెంట్ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి, మార్చి 22 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి ఏరియా పరిధిలో 29 మంది కార్మికుల వారసులకు స్థానిక జీఎం కార్యాలయంలో జీఎం టీ శ్రీనివాస రావు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణిలో ఉద్యోగం దొరకడం ఎంతో అదృష్టమని, అంకితభావంతో పనిచేసి ఉద్యోగోన్నతులు పొంది, సంస్థ ఉన్నతికి పాటుపడాలని సూచించారు. కారుణ్య నియామకాలు, నోటిఫికేషన్ల ద్వారా యువత ఉద్యోగాలు పొందుతుండడంతో సంస్థలో యువశక్తి పెరుగుతున్నదన్నారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ, కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. సింగరేణి ఆయా విభాగాల అధికారులు శివకేశవరావు, సీనియర్ పీవోలు పీ రాజేశం, కే క్రాంతికుమార్ ఆయా యూనియన్ల నాయకులు తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు.