కాలువ నిర్మాణం కోసం రైతులు ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా రణం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన తర్వాత పనులు నిలిచిపోవడంతో పోరుబాట పడుతున్నారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో 30 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు చేపట్టిన రంగనాయకసాగర్ ఆర్డీ-3 ఎల్ఎం-6 కాలువ నిర్మాణం ఆగిపోవడంతో మూడు రోజులుగా దీక్షలు చేస్తున్నారు. 3.20 కోట్ల పరిహారం చెల్లింపుపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చి ఏడాది దాటినా నెరవేర్చలేదని మండిపడుతున్నారు. రెండు వారాల్లో పనులు ప్రారంభించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరిస్తున్నారు.
ఇల్లంతకుంట రూరల్, ఫిబ్రవరి 12 : బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో రంగనాయకసాగర్ నిర్మించగా, సాగునీటి కోసం ప్రాజెక్టు దిగువన ఆర్డీ-3 ఎల్ఎం-6 కాలువ నిర్మాణం చేపట్టింది. ఇల్లంతకుంట మండలంలోని నాలుగు గ్రామాలు, తంగళ్లపల్లి మండలంలోని 15 గ్రామాల్లో 18 కిలోమీటర్ల మేరకు కాలువ నిర్మించి 30 వేల ఎకరాలకు నీరందించాలన్న ఉద్దేశంతో పనులు చేపట్టారు. ఈ కాలువ రంగనాయకసాగర్ నుంచి ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి తాడూర్ వద్ద మానేరువాగు వరకు ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాచారం శివారు వరకు కాలువ పనులు పూర్తయ్యాయి. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం రాగా, భూసేకరణ కోసం 3.20 కోట్ల పరిహారం విడుదల చేయకపోవడంతో పెద్దలింగాపూర్ శివారు వరకు కిలోమీటరున్నర మేర పనులు నిలిచిపోయాయి. రెండు మండలాల్లో మొత్తంగా 12 కిలోమీటర్ల కాలువ నిర్మాణం గతంలోనే పూర్తి కాగా, మిగతా పనులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయాయి. బీఆర్ఎస్ హయాంలో కాల్వ పనులు కాకున్నా ఒర్రెల ద్వారా సాగునీరు విడుదల చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చుక్కనీరు రావడం లేదు.
కెనాల్ నిర్మించి తమ పొలాలకు సాగునీరు ఇవ్వాలని రైతులు గతేడాది 19 రోజుల పాటు రిలేదీక్ష చేశారు. దీంతో నిధులు విడుదల చేసి, మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చి ఇల్లంతకుంట తహసీల్దార్ ద్వారా దీక్ష విరమింపజేశారు. అయితే, ఇది జరిగి ఏడాది గడుస్తున్నా ఆయన హామీ నెరవేరలేదు. గతంలో ఉన్న కలెక్టర్‌ను, విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రెండు రోజుల్లో ప్రభుత్వం రైతులకు 3.20 కోట్ల పరిహారం చెల్లించి, పనులు ప్రారంభిస్తేనే రిలేదీక్ష విరమిస్తామని,లేదంటే ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు. కాగా, ఆయా గ్రామాల రైతులు పెద్దలింగాపూర్ శివారులోని సబ్ స్టేషన్ వద్ద చేస్తున్న రిలేనిరాహార దీక్షలు మూడో రోజుకు చేరాయి. గురువారం సుమారు 50 మంది రైతులు పాల్గొన్నారు. అధికారులు స్పందించకుంటే కలెక్టరేట్ ముట్టడించడంతోపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కాలువ నిర్మాణం పూర్తయితే ఇల్లంతకుంట మండలంలోని దాచారం, పెద్దలింగాపూర్, రామోజిపేట, చిక్కుడువానిపల్లి, తంగళ్లపల్లి మండలంలోని చిన్నలింగాపూర్, నర్సింహులపల్లి, ఎడ్లోనికుంట, బాలమల్లుపల్లి, అంకుసాపూర్, లక్ష్మీపూర్, రామన్నపల్లి, తాడూర్ గ్రామాల్లోని భూములకు సాగునీరు అందుతుందని చెబుతున్నారు.
గతేడాది 19 రోజుల పాటు రిలేదీక్ష చేసినం. రైతులకు ఇవ్వాల్సిన 3.20 కోట్లకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుని వచ్చి, కాలువ పనులు వెంటనే ప్రారంభిస్తామని అధికారులు చెప్పడంతో దీక్ష విరమించినం. కానీ, ఏడాది గడుస్తున్నా పనులు మాత్రం జరగడం లేదు. రైతులకు ఇప్పటి వరకు పరిహారం అందలేదు. సాగునీరు లేక వందలాది ఎకరాల పొలాలు యాసంగి సీజన్లో ఎండిపోతున్నయి. ప్రభుత్వం మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. రెండు వారాలు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధిస్తున్నం. ప్రభుత్వం పనులు ప్రారంభించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తం.
ఎల్ఎం6 కెనాల్ పనులు పూర్తి చేస్తే మా గ్రామంతోపాటు చాలా గ్రామాల్లోని వేలాది ఎకరాల భూములకు సాగునీరు అందుతది. ఎమ్మెల్యే హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు ప్రారంభించడం లేదు. కిలోమీటరున్నర కాలువ తవ్వితే రైతుల భూములకు సాగునీరు అందుతుంది. ఈ ప్రభుత్వానికి రైతులపై కనికరం లేదు. కాలువ పనులు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు చెప్పినా ఫలితం లేదు. వారు వస్తున్నరు.. పోతున్నరు తప్ప మా సమస్యకు పరిష్కారం చూపడం లేదు.
కిలోమీటరున్నర దూరం కాలువ తవ్వకుండా.. రైతులకు పరిహారం ఇవ్వకుండా సర్కారు నిర్లక్ష్యం చేస్తంది. సాగునీరు లేక ఏటా యాసంగి సీజన్లో పొలాలు ఎండిపోతున్నయి. గతేడాది 19 రోజులు దీక్ష చేస్తే కాలువ నిర్మిస్తమని హామీ ఇచ్చారే తప్ప ఇప్పటి వరకు పని పూర్తి చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం స్పందించే వరకు పోరాడుతం.