కంఠేశ్వర్, ఫిబ్రవరి 12: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్ని క్ కళాశాలలో రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లకు గురువారం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాల్సిన విధానంపై కీలక సూచనలు చేశారు. నగరపాలక సంస్థకు సంబంధించి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, బోధన్‌లో స్థానిక విజయ మేరీ స్కూల్, ఆర్మూర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భీమ్‌గల్‌లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
శుక్రవారం ఉదయం స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు చేర్చి, 8 గంటల నుంచి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రారంభిం చేందుకు వీలుగా సిబ్బందిని అన్ని విధాలుగా సన్నద్ధం చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఇప్పటికే పలు విడుతలుగా శిక్షణ తరగతులు నిర్వహించి పూర్తి అవగాహన కల్పించినట్లు చెప్పారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద డివిజన్/వార్డు వివరాలను తెలిపేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామని, ఎలాంటి పొరపాట్లు, గందరగోళానికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు.
కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు
అత్యధికంగా 60 డివిజన్లు కలిగిన నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని ఓట్ల లెక్కింపు కోసం పాలిటెక్నిక్ కళాశాలలో నాలుగు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా తుది ఏర్పాట్లను పూర్తి చేశామని, సిబ్బందికి అల్పహారం, భోజనాలను కూడా ఓట్ల లెక్కింపు కేంద్రంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎలాంటి గందరగోళానికీ తావు లేకుండా పక్కాగా నిబంధనలను పాటిస్తూ పూర్తి పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా అవసరమైన పోలీసు బందోబస్తు ఉంటుందని తెలిపారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్‌కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డీవో రాజేంద్రకుమార్, నిజామాబాద్, బోధన్ మున్సిపల్ కమిషనర్లు దిలీప్‌కుమార్, జాదవ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.