e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home కామారెడ్డి సప్త స్వర్ణపాలన

సప్త స్వర్ణపాలన

సప్త స్వర్ణపాలన

జూన్‌ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఎన్నో పోరాటాలు. అలుపెరుగని ఉద్యమాలు. లాఠీ దెబ్బలు. జైలు జీవితాలు. అమరుల త్యాగాలు. కేసీఆర్‌ అలుపెరుగని ఉద్యమ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం. అరవై ఏండ్ల కలకు సాక్షాత్కారమే జూన్‌ 2. సమైక్యాంధ్ర పాలనలో చిక్కిన తెలం గాణ ప్రాంతం నేడు స్వరాష్ట్రంలో స్వపరిపాలనలో కొంగొత్తగా వెలుగులీనుతోంది. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండడంతో దేశంలోనే గర్వించదగ్గ రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. హైదరాబాద్‌ రాజధానిగా 10 జిల్లాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు 33 జిల్లాలు, ఏడు జోన్‌లు, రెండు మల్టీ జోనల్‌ సిస్టమ్‌తో రూపుదిద్దుకుంది. సాగునీటి రంగంలో కొంగొత్త పాఠమై నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలోనే పూర్తి చేసి ఇంజినీర్లనే అబ్బురపరిచిన నైపుణ్యం కొత్త రాష్ట్రమైన తెలంగాణ సొంతం. స్వపరిపాలనలో సుపరిపాల న కాంతులు అందిస్తూ… ఏడేండ్ల ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం ఏడు దశాబ్దాల్లో సాధించలేని ప్రగతితో ముందుకు పోతున్నది. కేసీఆర్‌ ప్రగతి పాలనలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సైతం అభివృద్ధి వెలుగులతో సరికొత్తగా రూపాంతరం చెందుతున్నది.

ఇంటింటికీ భగీరథ..
నిజామాబాద్‌ జిల్లాలో సింగూర్‌ – జుక్కల్‌ సెగ్మెంట్‌ పరిధిలో బోధన్‌, బాన్సువాడ నియోజకవర్గాల్లో 260 ఆవాసాలకు భగీరథ నీళ్లు అందేలా రూ.116.11 కోట్లు వెచ్చించారు. ఎస్సారెస్పీ – బాల్కొండ సెగ్మెంట్‌ పరిధిలో బాల్కొండ, ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాల్లో 545 ఆవాసాలకు నీళ్లు అందించేందుకు రూ.265.56 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం నిజామాబాద్‌ జిల్లాలో 27 మండలాల్లో 805 ఆవాసాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.381.67 కోట్లు ఖర్చు చేసింది. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ 2,859 కిలోమీటర్లు, 2లక్షల 97వేల 964 నల్లాలు బిగించారు. కామారెడ్డి జిల్లాలోని 22 మండలాలకు రెండు సెగ్మెంట్ల నుంచి మిషన్‌ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయి. సింగూర్‌ – జుక్కల్‌ సెగ్మెంట్‌ పరిధిలో బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గంలోని 556 ఆవాసాలకు రూ.177.34 కోట్లు వెచ్చించారు. ఎస్సారెస్పీ – బాల్కొండ సెగ్మెంట్‌ పరిధిలో కామారెడ్డి నియోజకవర్గం తోపాటు ఎల్లారెడ్డిలోని సగం మండలాలకు శుద్ధ జలం సరఫరా అవుతోంది. 320 ఆవాసాలకు రూ.134.85 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 876 ఆవాసాలకు రూ.312.19 కోట్లు వెచ్చించింది. 2,251 కిలోమీట ర్లు మేర పైప్‌లైన్‌, 2లక్షల 54వేల 722 నల్లాలు బిగించారు.

జోనల్‌ వ్యవస్థ సాకారం..
తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత సీఎం కేసీఆర్‌ స్థానిక తకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో నూతన జోనల్‌ సిస్టమ్‌ను రూపకల్పన చేశారు. స్వరాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే జోనల్‌ వ్యవస్థకు తొలి అడుగు పడింది. ఆ సమయంలో నూతన జిల్లా లు ఏర్పడడంతో వాటి ఆధారంగా నూతన జోన్లు పునర్వ్యవ స్థీకరించారు. ఏప్రిల్‌ 20న తెలంగాణ జోనల్‌ వ్యవస్థకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేయడంతో తెలంగాణలో ఏడు జోన్‌లు, రెండు మల్టీ జోన్‌లు అమల్లోకి వచ్చినట్లు అయ్యిం ది. బాసర జోన్‌లో నిజామాబాద్‌, రాజన్న జోన్‌లో కామారెడ్డి జిల్లాలను చేర్చారు.

ఆపత్కాలంలో అండగా..
కరోనా వైరస్‌తో అన్ని దేశాలూ పోరాటం చేస్తున్నాయి. మన దేశంలోనూ వైరస్‌ విజృంభణతో అయోమయం నెలకొంది. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద దిక్కుగా మారింది. భారీ ఉపద్రవంలోనూ కేంద్రంలోని మోదీ సర్కారు కనీస సహాయ, సహకారాలు అందించకపోగా… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల ఆరోగ్యం కోసం శతవిధాలుగా సేవలు అందిస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో కరోనా చికిత్స అందించడంతోపాటుగా ఇంటింటా జ్వర సర్వే చేపట్టి మిగిలిన రాష్ర్టాలకు దిక్సూచిగా మారింది.

కామారెడ్డికి కాళేశ్వరం జలాలు..
కోటి ఎకరాల మాగాణిగా మారుస్తానని మాటిచ్చిన సీఎం కేసీఆర్‌… అన్నట్లే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీడు భూములకు సాగు నీళ్లు పారిస్తున్నారు. మేడిగడ్డ వద్ద గోదావరి నదీ నీళ్లు అడ్డం తిప్పి ఎగువకు పంపిస్తుండగా సుదూర ప్రయాణంతో దిశలు మార్చుకొని రైతులకు సంతోషాన్ని అందిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్యాకేజీ 20, 21, 22 పనులు చురుగ్గా సాగుతున్నాయి. బోసిపోతున్న నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఇప్పటికే కాళేశ్వరం జలాలు వచ్చేశాయి. కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టు నుంచి రెండు నెలల క్రితమే సీఎం కేసీఆర్‌ గోదావరి నీళ్లను నిజాంసాగర్‌కు మళ్లించారు. హల్దీవాగు మీదుగా 96 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన నీళ్లు నిజాంసాగర్‌కు రావడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇన్ని రోజులు సింగూర్‌ ప్రాజెక్టుపై ఆధారపడిన నిజాంసాగర్‌కు కొండపోచమ్మ సాగర్‌ ద్వారా కొండంత భరోసా దక్కింది.

రైతులకు పెన్నిధి కేసీఆర్‌..
ఉమ్మడి జిల్లాలో 5లక్షల 20వేల మంది రైతులకు ప్రతీ పంట సీజన్‌లో దాదాపుగా రూ.600 కోట్లు పెట్టుబడి సాయంగా అందిస్తున్నది. ఎకరాకు రూ.5వేలు చొప్పున ఏటా రెండు సీజన్‌లకు కలిపి రూ.10వేలు చొప్పున సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ప్రస్తుతం రూ.వేల కోట్లు వెచ్చించి పండించిన పంటను సేకరిస్తున్నారు. 2021 వానకాలంలో పోటెత్తిన ధాన్యాన్ని దాదాపుగా 700 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్నారు. గత వానకాలం సీజన్‌లోనే రూ.1700 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని ఉమ్మడి జిల్లాలో సేకరించడం విశేషమే. రైతులు, వ్యవసాయాధికారుల ప్రయోజనార్థం కామారెడ్డి జిల్లాలో 104, నిజామాబాద్‌లో 106 రైతు వేదికలు అందుబాటులోకి వచ్చాయి.

జీపీల్లో సుపరిపాలన..
స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత వచ్చిన సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో పంచాయతీల ఏర్పాటు అంశాన్ని చేర్చింది. ఆ హామీని నెరవేర్చి ప్రజలకిచ్చిన మాటను సీఎం కేసీఆర్‌ అమలుపర్చారు. కామారెడ్డి జిల్లాలో 22 మండలా ల్లో కేవలం 323 గ్రామ పంచాయతీలు మాత్రమే ఉండేవి. 500 జనాభా కలిగిన తండాలు, ఇతర గ్రామాలన్నింటికీ పంచాయతీ హోదా కల్పించడంతో కొత్తగా 214 గ్రామ పంచాయతీలు పురుడు పోసుకున్నాయి. పాతవి 312 జీపీలు కలిపితే మొత్తం 526 గ్రామ పంచాయతీలతో కామారెడ్డి జిల్లా ముఖచిత్రం ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 36 మండలాలుండే వి. కొత్త జిల్లాల ఏర్పాటుతో కామారెడ్డి జిల్లా 22 మండలాలతో ఆవిర్భవించింది. నిజామాబాద్‌ జిల్లాలో 29 మండలాలు ఉండగా 530 జీపీలు ఏర్పడ్డాయి. నూతనంగా జీపీలు భారీగా ఏర్పడినప్పటికీ కొత్త జిల్లాల్లో పరిపాలన వ్యవస్థతో పర్యవేక్షణ సులువు కాగా గ్రామాల్లో సుపరిపాలన వెల్లివెరిస్తోంది.

ఒకే గొడుగు కిందకు పరిపాలన వ్యవస్థ..
సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు ప్రతిరూపంగా నూతన జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్‌ భవనాలు పరిపాలనకు ఐకాన్‌గా నిలువనున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో దాదాపుగా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవన నిర్మాణాలు పూర్తవ్వగా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కామారెడ్డి కలెక్టరేట్‌ను అడ్లూర్‌ గ్రామ శివారులో సుమారు 33 ఎకరాల స్థలంలో రూ.57 కోట్లతో నిర్మించారు. నిజామాబాద్‌ జిల్లాకు జీజీ కాలేజీ సమీపంలోనే కొత్త కలెక్టరేట్‌ను నిర్మిస్తున్నారు. ఆధునిక సొబగులతో కూడిన ఈ భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు మరో రెండంతస్తులతో నిర్మించారు. రూ.15కోట్లతో కామారెడ్డి పోలీస్‌ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. డీపీవో భవనం వంద శాతం పూర్తి కాగా అంతర్గత మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఈ నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ సంస్థ ద్వారా చేపడుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సప్త స్వర్ణపాలన

ట్రెండింగ్‌

Advertisement