మా ఇంటి పంట

మిద్దెతోటలపై పట్టణవాసుల ఆసక్తి
లాక్డౌన్ సమయం సద్వినియోగం
సేంద్రియ పద్ధతిలో సాగు
అందుబాటులో తాజా కూరగాయలు
చెంతనే ఆహ్లాదం.. చేతిలోనే ఆరోగ్యం..
లాక్డౌన్ సమయం ప్రజల్లో కొత్త ఆలోచనలకు పునాది వేసేలా చేసింది.. అందులో మిద్దె సాగు ఒకటని చెప్పాలి. కరోనా కారణంగా ఇండ్ల నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో పట్టణ ప్రాంతాల్లో చాలా మంది డాబాలపై కూరగాయల సాగుపై దృష్టి సారించారు. ఇదివరకే పలువురు ఈ విధానంలో కూరగాయలు సాగు చేస్తుండగా ఈ జాబితాలో తాజాగా మరికొందరు చేరిపోయారు. ఇంట్లోంచి కాలు బయటపెట్టలేక.. సమయం గడువక ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో పలువురు మిద్దె సాగుకు శ్రీకారం చుట్టారు. టెర్రస్ గార్డెనింగ్‌తో కాలక్షేపం కావడంతోపాటు తాజా కూరగాయలు అందుబాటులో ఉంటుండడంతో దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళ మిద్దెతోటలో గడుపుతున్నారు. నీరు పట్టడం, చెత్తను తొలగించడం చేస్తున్నారు. సేంద్రియ పద్ధతిలోనే వీటిని సాగు చేస్తుండడం మరో విశేషం. కూరగాయలతోపాటు పండ్లు, పూల మొక్కలను సైతం పెంచుతున్నారు.
సరదాగా సాగు..
కామారెడ్డి, జనవరి 2 : మిద్దె సాగుపై పట్టణ ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోంది. తమ ఇంటి అవసరాలకు అనుగుణంగా ఇంటి కప్పుపై కూ రగాయలు, పండ్లు, పూల మొక్కలు పెంచుతున్నారు. మట్టి కుండలు, ప్లాస్టిక్ డబ్బాల్లో మట్టి నింపి వాటిలో కూరగాయల విత్తనాలు నాటి, ఎరువులను సమపాళ్లలో వేయడంతో మొక్కలు ఏపుగా పెరిగి కాతకు వస్తున్నాయి. ఈ సాగు విధానంలో తక్కువ నీటితో పంటలు పండిస్తున్నారు. సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో ఇంట్లోని వారికి శారీరక శ్రమ లభించినట్లు అవుతోంది. ఇంటిపైనే అన్ని రకాల కూరగాయలతోపాటు ఆకుకూరలను తాజాగా పండించుకునేందుకు పట్టణ ప్రాంత ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో మిద్దె సాగు అవసరం తక్కువగా ఉంటుంది. పరిమితంగా స్థలం ఉండే పట్టణాల్లో మిద్దె సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మిద్దె సాగుపై ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో దీనిపై మరింత ప్రచారం నిర్వహించడం, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పురుగు మందులు వినియోగించకుండా తాజా కూరగాయలను పండించే వీలు మిద్దె సాగుతో కలుగుతోంది. ఉద్యోగాలు, విధి నిర్వహణ ముగించుకున్న తర్వాత మిద్దెపై కూరగాయల మొక్కల సంరక్షణ చూసుకుంటూ తమ ఇంటి అవసరాలు తీర్చుకునే వీలు కలుగుతోంది. మిద్దె సాగుతో ఇంటిపై పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటోంది. దీంతో పలువురు మిద్దె సాగుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొద్ది మంది మాత్రమే తమ ఇంటి మిద్దెలపైన కూరగాయలను సాగు చేస్తున్నారు. దీన్ని మరింత విస్తరించే విధంగా ఉద్యాన శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
రెండేండ్లుగా సాగు
ఖలీల్‌వాడి, జనవరి 2 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పద్మలత రెండు సంవత్సరాలుగా ఇంటి డాబాపై కూరగాయలు సాగు చేస్తున్నారు. కూరగాయలతోపాటు పలు రకాల పూల మొక్కలను సైతం పెంచుతున్నారు. విద్యార్థులకు డ్యాన్స్, కల్చరల్ యాక్టివిటీస్ నేర్పిస్తూనే కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో 2018లో వంద గజాల స్థలంలో ఇంటి డాబాపై కూరగాయల సాగును మొదలు పెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే కూరగాయలు రసాయనాల మయం కావడం, ఆరోగ్యానికి హానికరంగా మారుతుండడంతో తాజా కూరగాయల కోసం పద్మలత మిద్దె సాగుకు ఆలోచన చేశారు. కొత్తిమీర, కరివేపాకు, పుదీన, టమాటా, వంకాయ, బిర్యానీ ఆకు, బుల్లెట్ మిర్చి, ఆలుగడ్డలు, చామగడ్డ, మునగతోపాటు పలు రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. సపోటా, దానిమ్మ, రత్నపురిగడ్డలు, యాపిల్‌బేర్, అరటి, డ్రాగన్‌ఫ్రూట్, వాటర్ యాపిల్, తైవాన్ జామ్, సీతాఫలం, బొప్పాయి, గ్రేప్స్, పైనాపిల్ తదితర పండ్ల రకాలను పండిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇంటిపై సాగు చేసిన కూరగాయలు, పండ్లు వీరికి ఎంతో ఉపయోగపడ్డాయి. పండ్లు, కూరగాయల సాగు ప్రారంభానికి రూ.10 వేలు మాత్రమే ఖర్చు చేశారు. కోతుల నుంచి రక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. కూరగాయలు, పండ్ల కోసం ప్రతి నెలా రూ.1500 పైగా ఖర్చు చేసేవారు. ఇప్పుడు డబ్బులు ఆదా అవుతున్నాయి.
చెంతనే తాజా కూరగాయలు
డిచ్పల్లి, జనవరి 2 : మండలంలోని ఘన్‌పూర్‌కు చెంది న రాంబత్రి రేవతి -ప్రసాద్ దంపతులు ఇం టి డాబాపై కూరగాయలను సాగు చేస్తున్నా రు. కోతుల బెడద నుంచి మొ క్కలను రక్షించుకునేందుకు రూ. 30 వేలు ఖర్చు చేసి జాలీని ఏర్పాటు చేశారు. వంకాయ, టమాటా, పాలకూర, చిక్కుడు, చుక్కకూర, మిరపకాయ, సొరకాయ, దొండకాయ, మెంతికూర, క్యాబేజీ తదితర కూరగాయలను సాగు చేస్తున్నారు. చామంతి, గులాబీ, మందారం, చక్రంపూలు, కనకాంబరం, కాగడ మల్లెపూల మొక్కలను సైతం పెంచుతున్నారు. మార్కెట్లో లభించే కూరగాయలు రసాయనాల మయం కావడంతో రేవతి కూరగాయల సాగుకు పూనుకున్నారు. కరోనా కారణంగా మార్కెట్‌కు వెళ్లి నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోయింది. ఎంతో కాలంగా కూరగాయలు సాగు చేయాలని అనుకుంటున్నా సమయం దొరకక వాయిదా వేస్తూ వచ్చారు. లాక్డౌన్ సమయంలో గత వానకాలంలో ఇంటి డాబాపై కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టారు. పెద్దగా శ్రమపడకుండా ఇంట్లోని పనికిరాని డబ్బాలు, కర్రలను సమకూర్చుకొని తీగజాతి మొక్కల కోసం పందిరి వేశారు. కూరగాయలతోపాటు పూలమొక్కలను పెంచుతున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ విధానంలో సాగు చేస్తుండడం మరో విశేషం. తక్కువ స్థలంలోనే 16 రకాల కూరగాయలు, 10 రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. మార్కెట్‌కు వెళ్లకుండానే డాబాపై నుంచి తాజా కూరగాయలను కోసుకొచ్చి వండుతున్నారు. మరికొన్ని రకాల కూరగాయలను సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆహ్లాదం.. ఆరోగ్యం
ఇందూరు,జనవరి 2 : నగరంలోని వినాయక్‌నగర్‌లోని బొందుగుల పూర్ణచందర్ తన ఇంటి డాబాపై కూరగాయలు, పూలమొక్కలు సాగు చేస్తూ ఔరా..! అనిపిస్తున్నారు. ఇంటికి అవసరమయ్యే అన్ని రకాల కూరగాయలు, టమాటా, బెండ, కొత్తిమీర, కరివేపాకుతోపాటు పలు రకాల కూరగాయలను ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నారు. చిన్న గ్లాసులు, డబ్బాల్లో విత్తనాలు వేసి అవి మొలకెత్తిన తర్వాత పనికిరాని బకెట్లు, ఆయిల్ డబ్బాలు, పెయింట్ డబ్బాల్లో మట్టి వేసి వాటిని పెంచుతున్నారు. డాబాపై సిమెంట్ కుండీలు కట్టి, వాటిలో పైపులైన్ ద్వారా నీటిని నింపి, తద్వారా అవసరమైన మొక్కలకు నీటిని అందిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితం కావడంతో ఏం చేయాలో తోచక, ఇంటి వద్దనే ఉండడంతో పూలు, కూరగాయల సాగు ప్రారంభించారు.
మిద్దెసాగుపై విద్యార్థులకు అవగాహన
కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీలో నివాసముంటున్న కెన్నడీ స్కూల్ ప్రిన్సిపాల్ సురేశ్ తన ఇంటి మిద్దెపై కూరగాయలు సాగు చేస్తున్నారు. మార్కెట్లో లభించే కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉంటుండడంతో తన ఇంటిపైన పంట తీయొచ్చన్న ఆలోచనతో కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టారు. సాగుకు అవసరమైన సామగ్రిని తెప్పించి మిద్దెతోటను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తన ఇంటికి అవసరమైన కూరగాయలను సాగు చేసుకుంటూనే ఇతరులకు సైతం అందిస్తున్నారు. మిద్దెపై పాలకూర, బచ్కలికూర, తోటకూర, మెంతితోపాటు టమాటా, వంకాయ, బెండకాయ, పచ్చిమిరప, కొత్తిమీర, పూదీన, బీరకాయ తదితర కూరగాయలను సాగు చేస్తున్నారు. మస్కిటో రిపెల్లెంట్ మొక్క, లెమన్‌గ్రాస్ వంటి ఔషధ మొక్కలను పెంచుతున్నారు. తాజా కూరగాయలతో ఆరోగ్యం లభిస్తోంది. ఇదే విషయాన్ని భావితరాలకు తెలియజేసేలా తమ పాఠశాల విద్యార్థులకు ప్రాక్టికల్‌గా తన ఇంటికి తీసుకొచ్చి వివరిస్తున్నారు.
మొదట్లో నన్ను చూసి నవ్వుకున్నారు
మొదట్లో నా పిల్లలు నన్ను చూసి నవ్వుకున్నారు. ఆ తరువాత నాకు సాయం చేయడం ప్రారంభించారు. పనికిరాని డబ్బాలను తీసుకొచ్చి వాటిలో మట్టిని నింపా. సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నా. కొన్ని రోజులకే పండ్లు, కూరగాయలు కాతకు రావడంతో నా ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు నా పిల్లలే మిద్దె పెరడు బాధ్యతను చూస్తున్నారు. నాకు గర్వంగా ఉంది.
ఎప్పటి నుంచో అనుకుంటున్న..
కూరగాయలు సాగు చేసేందుకు ఖాళీ స్థలం లేదు. దీంతో డాబాపై ఉన్న కొద్దిపాటి స్థలంలోనే పలు రకాల కూరగాయలను పండిస్తున్నా. ప్లాస్టిక్ డబ్బాల్లో మట్టిని నింపి విత్తనాలు వేసి, క్రమం తప్పకుండా నీళ్లు పోస్తున్నాం. రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాం. మార్కెట్‌కు వెళ్లే సమయం, డబ్బులు ఆదా కావడంతోపాటు తాజా కూరగాయలు తినగలుగుతున్నాం.
-రేవతి, ఘన్పూర్, డిచ్పల్లి రూ.1.5 లక్షలతో షెడ్డు ఏర్పాటు
మా ఇంటికి అవసరమైన కూరగాయలు ఇంటి డాబాపైనే పెంచుతున్నాం. బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం మానేశాం. తాజా కూరగాయలతో ఆరోగ్యంగా ఉంటున్నాం. సాయంత్రం వేళలో డాబాపై కూర్చుంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. నా భార్య నేను కలిసి ఉదయం, సాయంత్రం గంట చొప్పున సమయం కేటాయిస్తున్నాం. రూ.1.5 లక్షల ఖర్చుతో షెడ్డు నిర్మించాం. యూట్యూబ్‌లో మిద్దె తోట పెంపకాన్ని చూసి అవసరమైన మట్టిని నర్సరీల నుంచి తీసుకొచ్చాం. విత్తనాలు చిన్న గ్లాసుల్లో పెంచి అవి మొలకెత్తాక పెద్ద డబ్బాల్లోకి మారుస్తాం. నాలుగు నెలల క్రితం ప్రారంభిస్తే రెండు నెలల నుంచి కాత వస్తున్నది. ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలుగా వీటినే వాడుతున్నాం. తాజా కూరగాయలతో భోజనం చేయడం ఎంతో తృప్తి నిస్తున్నది. ఇంట్లోని వ్యర్థాలతోనే కంపోస్ట్ తయారుచేసి చేసి కుంకుడుకాయ రసం, పల్లి పిండి, ఆవ పిండి ఎరువుగా వేస్తున్నాను.
-బొందుగుల పూర్ణచందర్
తాజావార్తలు
- షీ టీమ్స్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిరుద్యోగులకు.. కొలువులు
- అతివేగం.. ప్రాణం తీసింది
- మెరుగైన సేవలకు.. చేతులు కలపండి
- పారిశ్రామిక పురోభివృద్ధిలో మేడ్చల్
- సఫారీ టూర్.. మరింత కొత్తగా
- హైదరాబాద్ స్టార్టప్‌కు ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
- రూ.60 లకు తిన్నంత బిర్యానీ
- మనకు కావాల్సింది నిమిషాల్లో తెచ్చిస్తారు
- మరణించీ.. మరొకరికి బతుకునిద్దాం
- అందుబాటులోకి కొవిన్ యాప్ కొత్త వర్షన్