e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home జనగాం అమ్మో పులి!

అమ్మో పులి!

మానుకోట ఏజెన్సీ ప్రాంతంలో సంచారం
భయం గుప్పిట్లో అటవీ గ్రామాల ప్రజలు
అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ అడవుల నుంచి వచ్చినట్లు అంచనా

పెద్దపులి సంచారం ఏజెన్సీ గ్రామాల ప్రజలను కలవర పెడుతున్నది. ఆయా ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఈ నెల 23న భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతమైన బయ్యారం మండలం ఇసుకమేది, లక్ష్మీపురం గ్రామాల మధ్య అడ్డబోడుగుట్ట అటవీప్రాంతంలో తొలుత పెద్దపులి సంచరించినట్లు స్థానికులు గుర్తించి భయంతో గ్రామంలోకి పరుగులు పెట్టారు. మరుసటిరోజు అల్లిగూడెం గ్రామానికి చెందిన అవిరె నారాయణ అనే వ్యక్తి భీమ్లాతండా అటవీప్రాంతంలో మేకలను మేపుతుండగా ఒక్కసారిగా పెద్దపులి అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అతడు గొడ్డలితో మూడుసార్లు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా పులికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. పులి సంచరించిన చోట వెంట్రుకలు మాత్రం దొరికాయి. ఈ క్రమంలో గురువారం(ఈ నెల 25న) గూడూరు అభయారణ్యంలోని నేలవంచ, కాకర్ల మధ్య ఉన్న అటవీప్రాంతంలోకి మేత కోసం వెళ్లిన ముక్తి సత్యం అనే రైతుకు చెందిన రెండు ఆవులపై దాడి చేసి చంపింది. దీంతో పులి సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన అటవీశాఖ అధికారులు బయ్యారం, గూడూరులో కనిపించిన పులి ఒక్కటేనా.. లేక వేర్వేరా అని ఆరా తీస్తున్నారు. పులి సంచరిస్తున్నదన్న వార్తల నేపథ్యంలో బయ్యారం, గంగారం, కొత్తగూడ, గూడూరు, గార్ల మండలాల్లోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో ఇళ్ల నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పంట పొలాల వద్దకు వెళ్తున్నారు. అధికారులు సీసీ కెమెరాల ద్వారా పులి కదలికలను గమనిస్తూ సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ఎక్కడి నుంచి వచ్చిందంటే..
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ అడవుల నుంచి పులి రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు అంచనాకు వచ్చారు. తడోబా, తిప్పేశ్వర్‌ టైగర్‌ రిజర్వ్‌ఫారెస్ట్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అక్కడి పులులు కొత్తస్థావరాలను వెతుక్కుంటూ రాష్ట్రంలోని అడవుల్లో వస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. తొలుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని ఓ గ్రామంలో పశువుల మందపై దాడి చేసింది. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలం తోకబందాలలో లేగ దూడను చంపింది. గత శనివారం తెల్లవారు జామున టేకులపల్లి మండలం జంగాలపల్లి అటవీ ప్రాంతంలో రహదారి దాటుతున్న పులిని రేగళ్ల రేంజర్‌ జశ్వంత్‌, బీట్‌ ఆఫీసర్‌ శోభన్‌ కారులో వెళ్తూ వీడియో, ఫొటోలు తీశారు. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో జిల్లాలో అడవులు వృద్ధి చెంది దట్టంగా మారడంతో పులుల సంచారం పెరిగిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది నవంబర్‌ నెలలో కూడా కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలంలోని గురిమళ్ల, మోట్లతిమ్మాపురం, చెన్నంగలగడ్డ మీదుగా గార్ల మండలం ముల్కనూరు, కురవి మండలం బలపాల అడవుల్లో పులి సంచరించినట్లు పాదముద్రలు గుర్తించామన్నారు.

- Advertisement -

అప్రమత్తంగా ఉండాలి…
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లొద్దు. పులి కంటపడినప్పటికీ ఎలాంటి హాని చేయొద్దు. పులి సంచరించినా, పశువులపై దాడి చేసినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. పులి దాడిలో మృతి చెందిన పశువులకు అటవీశాఖ నుంచి పరిహారం అందిస్తాం.

  • కృష్ణమాచారి, ఎఫ్‌డీవో, మహబూబాబాద్‌
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement