గురువారం 22 అక్టోబర్ 2020
Jayashankar - Jul 01, 2020 , 01:22:32

సరదా వద్దు.. ప్రాణాలే ముద్దు

సరదా వద్దు.. ప్రాణాలే ముద్దు

బయ్యారం: మహబూబాబాద్‌ జిల్లాలో పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్న బయ్యా రం పెద్దచెరువు నిండుకుండలా మారి అలుగుపోస్తున్నది. దీంతో పర్యాటకులు సందడి చేస్తున్నారు. అయితే, సరదా మాటున ప్రమాదం పొంచి ఉంది. పెద్ద చెరువు గరిష్ఠ నీటిమట్టం 16.5 అడుగుల కంటే నీరు ఎక్కువగా చేరుకోవడంతో వారం రోజులుగా అలుగు పోస్తూ పరిసర ప్రాంతాల్లోని గుట్టల్లో పచ్చని చెట్లు ప్రకృతి అందాలతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. కోటగడ్డ సమీపంలో ఉన్న చెరువుకట్ట, తూముల ప్రాంతంలో కాకతీయుల చరిత్ర, వంశ వృక్షాన్ని తెలిపే శిలాఫలకం వంటి ఆనవాళ్లు ఉండడంతో ఏటా మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంతోపాటు తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శనకు వస్తుంటారు.

ప్రాణం తీస్తున్న సరదా..

గతంలో చెరువు పరిసరాల్లో పలువురు యువకులు నీటి ప్రవాహంలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. దీంతో పోలీసులు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కానీ, వీటిని లెక్కచేయకుండా కొంతమంది యువకులు పెద్ద చెరువు నీటి ప్రవాహంలోకి వెళ్లి ఈత కొట్టడం, సెల్ఫీలు దిగడం వంటివి చేస్తున్నారు. అంతేకాకుండా  కొందరు పర్యాటకులు నీటి ప్రవాహం వద్ద కూర్చొని మద్యం, కూల్‌డ్రింక్స్‌ తాగుతున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. అలుగు ప్రవాహం పెరిగితే ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు గత ఘటనలను బట్టి తెలుస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పర్యాటకులు ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సరదా కోసం చెరువులోకి, అలుగు ప్రవాహంలోకి దిగొద్దని కోరుతున్నారు. కాగా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

జాగ్రత్తగా ఉండాలి

సందర్శకులు పెద్దచెరువు వద్దకు వచ్చిన సమయంలో జాగ్రత్తగా ఉండాలి. హెచ్చరిక బోర్డులు దాటి నీటి ప్రవాహం వైపు వెళ్లొద్దు. తల్లిదండ్రులు సైతం పిల్లలను చెరువు సందర్శనకు పంపేటప్పుడు తోడుండాలి. చెరువు ప్రాంతంలో మద్యం, కూల్‌డ్రింక్స్‌ తాగడం, నీటి ప్రవాహంలోకి వెళ్లి సెల్ఫీలు దిగడం, ఈతకొట్టడం నిషేధం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం.

- జగదీశ్‌, బయ్యారం ఎస్సై


logo