రెండు తెలుగు రాష్ర్టాల్లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల నామినేషన్ల ఘట్టం ముగిసింది. తెలంగాణలోని 5 స్థానాలకు గాను కాంగ్రెస్ మూడింటికి, ఒక్కో స్థానానికి సీపీఐ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను నిలబెట్టాయి. 21మంది ఎమ్మెల్యేల బలముంటే ఒక స్థానం గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీల తరపున నిలబడిన అభ్యర్థులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో కనీసం సగం స్థానాలైనా అగ్ర కులాలవారికి వెళుతుంటాయి. ఈసారి మాత్రం అన్ని స్థానాలు కింది కులాల వారికి దక్కడం ఓ విశేషమే. కావాలనే పార్టీలు ఇలా ఎంపిక చేశాయా? లేక సమీకరణాలు ఇలా కుదిరాయా? అనేది పార్టీ పెద్దలకే తెలుసు.
కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపికైన అభ్యర్థుల్లో అద్దంకి దయాకర్ మినహా మిగతా ఇద్దరి పేర్లు ఎవరూ ఊహించనివే. కనీసం సీఎం రేవంత్‌రెడ్డికి కూడా చివరి నిమిషం వరకు తెలియక పోవచ్చు. శంకర్‌నాయక్, విజయశాంతి పేర్లు సీల్డ్ కవర్లో ఢిల్లీ నుంచి వచ్చినట్టు చెప్పుకుంటున్నా రు. రేవంత్ తన సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇప్పించుకోలేక పో యారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూడా సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ నాయకుడి కోసం రాష్ట్ర మంత్రులతో సిఫారసు చేసినా ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ జాతీ య కమిటీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలిగా మీనాక్షి నటరాజన్ ముద్ర ఈ ఎంపికపై కనబడిందని చెప్పవచ్చు. పైకి సోనియా, రాహుల్ పేర్లు రేవంత్‌రెడ్డి జపించినా పాలనలో తానే సర్వస్వం అని భావిస్తూ ముందుకు సాగుతున్నారు. తన తప్పిదాలు కప్పిపుచ్చుకొనే క్రమంలో ఆయన తెలంగాణ సాధించిన పార్టీని, నేతలను తక్కువ చేస్తూ మాట్లాడడం ఎక్కువైంది. మరోవైపు హామీల వైఫల్యాల వల్ల ప్రజల విశ్వాసా న్ని కాంగ్రెస్ క్రమంగా కోల్పోతున్నది. దీనిని సవరించే దిశగా, రేవంత్‌ను కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే అధిష్ఠానం ఇంచార్జిని మార్చి ఉండవచ్చు. దీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతున్న వారి జాబితా కావాలని మీనాక్షి నటరాజన్ తొలి సందర్శనలోనే కోరారు. దాని ప్రభావంగానే గ్రామస్థాయి నుంచి పార్టీకి పనిచేసిన శంకర్ నాయక్ ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు.
ఈసారి ఎమ్మెల్సీల్లో పార్టీలకు అతీతంగా అందరూ అంగీకరించే పేర్లు రెండు ఉన్నాయి. అందులో ఒకటి అద్దంకి దయాకర్ కాగా, మరోటి దాసోజు శ్రవణ్. ఒకరు దళిత బిడ్డ, మరొకరు బీసీల ప్రతినిధి. కుల వెనుకబాటు తప్ప ఇద్దరిలో సామర్థ్యపరంగా ఎలాంటి లోటు లేదు. బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన దాసోజు శ్రవణ్ విద్యార్ధి దశ నుంచి నాయకుడిగా కొనసాగుతున్నారు. 1987లో ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ప్రధాన కార్యదర్శిగా గెలిచారు. టెక్ మహీంద్రా లాంటి దిగ్గజ కంపెనీల్లో హెచ్ఆర్, జీఎం స్థాయిలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు ఉద్యోగాలను వదిలేశారు. ఉద్యమకారుడిగా తెలంగాణ సాధనలో కష్టనష్టాలను అనుభవించారు.జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన చారిత్రక నివేదికలను రాయడంలో ఆయన కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్‌ల వెంటఉన్నారు. ఉద్యమ సమయంలో కేంద్రానికి సమర్పించిన తెలంగాణ పారిశ్రామికీకరణ ముసాయిదా రూపకల్పనలో కేటీఆర్‌కు సహకరించారు.
2008లో ప్రజారాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన శ్రవణ్ 2009లో సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజారాజ్యం పార్టీ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీని వీడి తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో అనేక టీవీ చర్చల్లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు.
ఒక వెనుకబడిన తరగతికి చెందిన వ్యక్తి రాజకీయంగా ఎదగడానికి ఎన్ని అడ్డంకులు ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి దాసోజు ప్రస్థానమే ఉదాహరణ. ఎన్నికల్లో టికెట్ వచ్చినా ఖర్చుకు తట్టుకోలేక ఓటమి పాలుకాక తప్పలేదు. 2023, ఆగస్టులో బీఆర్ఎస్ ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫారసు చేసినా నాటి గవర్నర్ తమిళిసై కుదరదన్నారు. రాజ్‌భవన్, ప్రగతిభవన్ రగడలో ఇలా ఆయన బలయ్యారు. ఎస్సీ, ఎస్టీల మాదిరి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు. జనాభాలో సగమైనా అసెంబ్లీ, పార్లమెంటులో వీరి సంఖ్య తక్కువ. బీసీలందరికీ ఒకే రకమైన ఆర్థిక స్తోమత లేదు. ఈ నేపథ్యంలో విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన దాసోజు శ్రవణ్ విధాన మండలికి వెళ్లడం బీసీలందరికీ ఆనందదాయకం. పార్టీలకతీతంగా ఆయనకు, ఈ హోదా అందించిన బీఆర్ఎస్కు అభినందనలు, ధన్యవాదాలు.