బీజింగ్, అక్టోబర్ 20: ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ప్రపంచం వణికిపోతుంటే, కొత్తగా చైనా కూడా యుద్ధ భేరీ మోగించేందుకు సిద్ధమవుతున్నది. తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపడుతూ, ఆ దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పతాక స్థాయికి చేరుకుంది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ తమ దేశ సైనికులకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తాజాగా పిలుపునిచ్చారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు చెందిన బ్రిగేడ్‌ను జీ జిన్‌పింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సమగ్రమైన శిక్షణ, సన్నద్ధతతో సైనిక బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. తమ పోరాట సామర్థ్యాల్ని పెంచుకోవాలి’ అని అన్నారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీటీవీ తాజాగా పేర్కొన్నది. తైవాన్ స్వతంత్ర, సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తున్న చైనా, ఆ దేశం చుట్టూ పెద్ద ఎత్తున మిలటరీ డ్రిల్స్‌ను నిర్వహించటం సంచలనంగా మారింది. తైవాన్‌కు అత్యంత సమీపంలో యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, కోస్ట్‌గార్డ్ నౌకలతో చైనా సైనిక విన్యాసాలు మరింత ఉధృతమయ్యాయి. తైవాన్ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యుద్ధం చేయడానికి వెనుకాడబోమని బీజింగ్ నాయకత్వం ఇప్పటికే ప్రకటించింది.