Donald Trump | భారత్-పాక్ విషయంలో (India – Pak War) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ పాత పాటే పాడారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానని, రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసినట్లు చెప్పారు. ఇంత చేసినా తనకు ప్రతిష్టాత్మక నెబెల్ శాంతి పురస్కారం (Nobel Peace Prize) రాదేమో అని నిరాశ వ్యక్తం చేశారు. ట్రంప్‌ను నోబెల్ శాంతి పురస్కారానికి పాక్ ప్రభుత్వం నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్-పాక్ మధ్య, సెర్బియా-కొసావో మధ్య యుద్ధాన్ని ఆపా. ఈజిప్ట్-ఇథియోపియా మధ్య శాంతిని నెలకొల్పా. మధ్యప్రాచ్చంలో పలు ఒప్పందాలను చేశా. ఇన్ని చేసినా నాకు నోబెల్ శాంతి లభించదు’ అని ట్రంప్ నైరాశ్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు.
నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్‌ను నామినేట్ చేసిన పాక్ ప్రభుత్వం
డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి (Nobel Peace Prize) నామినేట్ అయిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రభుత్వం ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి (Nobel Peace Prize) ప్రతిపాదించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవలే తలెత్తిన ఘర్షణల సమయంలో ట్రంప్ దౌత్యపరంగా జోక్యం చేసుకుని కీలకంగా వ్యవహరించారని, ఆయన నాయకత్వానికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్థాన్ ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ట్రంప్‌పై ప్రశంసలు కురిపించింది. ట్రంప్‌ను నిజమైన శాంతి నిర్మాతగా అభివర్ణించింది. కాగా, ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ఈ విశిష్ట పురస్కారానికి నామినేట్ అయినప్పటికీ ఒక్కసారి కూడా బహుమతిని గెలుచుకోలేకపోయారు.
Also Read..
Donald Trump | ఇరాన్‌పై దాడుల్ని ఆపమని ఇజ్రాయెల్‌ను ఒప్పించడం అసాధ్యం : డొనాల్డ్ ట్రంప్
Nuclear Talks: దాడులు ఆగేవరకు.. అణు చర్చలు ఉండవు : ఇరాన్
Ayatollah Ali Khameni | ‘మహిళలు పువ్వు లాంటివారు’.. వైరలవుతున్న ఖమేనీ పాత పోస్టులు..!