టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న దాడులు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా స్పందిస్తూ, హొర్ముజ్ జలసంధి గుండా ఒక్క చుక్క చమురు లేదా గ్యాస్ వెళ్లకుండా అడ్డుకుంటామని స్పష్టం చేసింది. అమెరికా సైన్యం కఠినమైన చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
కాగా ఉత్తర ఇరాక్‌లో కూలిపోయిన ఇరాన్ డ్రోన్‌కు సంబంధించి పేలకుండా ఉన్న బాంబును తొలగిస్తుండగా ఒక అమెరికన్ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ఘర్షణల్లో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 17కు చేరింది. మృతి చెందిన సైనికుల త్యాగాల గౌరవార్థమే తాము ఈ తాజా దాడులను ప్రారంభించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాగా అమెరికా దాడులకు ప్రతి గా ఇరాన్ పశ్చిమాసియాలోని పలు ప్రాంతాలపై ప్రతీకార చర్యలకు దిగింది.
కాగా ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ఈ హొర్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ప్రస్తుత ఘర్షణలకు ఇదే ప్రధాన కేంద్రంగా మారింది. అమెరికా దురాక్రమణ కొనసాగినంత కాలం ఈ జలసంధి పెట్రో కెమికల్ ఉత్పత్తుల రవాణాకు సురక్షితం కాదని ఇరాన్ కమాండర్లు తేల్చిచెప్పారు.