Greenland Issue : అమెరికా ప్రభుత్వానికి లొంగిపోయేది లేదని, ఆ దేశంతో తాము కలవబోమని గ్రీన్ ల్యాండ్ పార్లమెంట్ తీర్మానం చేసింది. ఈ మేరకు పార్లమెంట్ లోని అన్ని పార్టీలు కలిసి శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. ఆర్కిటిక్ ద్వీప దేశమైన గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన కూడా చేశాడు. సైనిక చర్య లేదా ఆ దేశాన్ని కొనుగోలు చేయడం ద్వారానైనా గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రంప్ ప్రకటించాడు.
అవసరమైతే ఒక్కో పౌరుడికి రూ.1,00,000 డాలర్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమని చెప్పాడు. తమ పొరుగు దేశం చైనా లేదా రష్యా కావడం ఇష్టం లేదన్నాడు. తమ చర్య అక్కడి ప్రజలకు నచ్చినా.. నచ్చకపోయినా తాము అనుకున్నది చేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అయితే, ట్రంప్ నిర్ణయంపై నాటో దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రీన్ ల్యాండ్ సార్వభౌమత్వానికి మద్దతుగా స్పందించాయి. ఇదే సమయంలో గ్రీన్ ల్యాండ్ కూడా స్పందించింది. పార్లమెంట్లో సమావేశమైన అన్ని పార్టీలు అమెరికా నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేశాయి. తాము అమెరికన్లుగా ఉండాలనుకోవడం లేదని, గ్రీన్ ల్యాండర్లుగానే ఉండాలనుకుంటున్నామని ప్రజా ప్రతినిధులు ప్రకటించారు.
అదే సమయంలో డెన్మార్క్ కంట్రోల్ లో కూడా ఉండాలని కోరుకోవట్లేదన్నారు. ‘‘మేం అమెరికన్లుగానో, డేన్స్ గానో ఉండాలనుకోవడం లేదు. గ్రీన్ ల్యాండర్లుగానే ఉండాలనుకుంటున్నాం. గ్రీన్ ల్యాండ్ భవిష్యత్తును నిర్ణయించేది మా దేశ పౌరులే’’ అని అక్కడి పార్లమెంట్ తీర్మానం చేసింది. మరోవైపు గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకునేందుకు ఏ దారినైనా ఎంచుకునేందుకు సిద్ధమని అమెరికా ప్రకటించింది.