ప్రపంచంలో తాము దేవదూతలమని అమెరికా భావిస్తుందని, ఆ స్థానాన్ని రష్యా ఆక్రమిస్తుందని భయపడుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. నూతన ప్రపంచంలో శక్తిమంతమైన, బలమైన దేశాలు నియమాలు సృష్టిస్తాయని చెప్పిన ఆయన.. అది జరుగుతుందనే అమెరికా భయపడుతోందని విమర్శించారు.
అలాగే ఉక్రెయిన్పై రష్యా సేనల ప్రత్యేక ఆపరేషన్ను సమర్థించుకున్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో మాట్లాడిన ఆయన.. పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షలను రష్యా ధైర్యంగా ఎదుర్కుంటుందని స్పష్టంచేశారు. ఉక్రెయిన్లో జరుగుతున్న స్పెషల్ మిలటరీ ఆపరేషన్ అనేది తమ ప్రజలను కాపాడుకునే చర్య అని పుతిన్ తెలిపారు.
అలాగే సామాన్యులు నివశించే ప్రాంతాలపై దాడులు చేయడం అత్యంత ఘోరమైన పని అని, అలాంటి దాడులు రష్యా చేయదని పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్లో మిలటరీతో సంబంధం లేని ప్రాంతాలపై తాము దాడులు చేయలేదని, దానిపై వస్తున్న వదంతులన్నీ ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలు కల్పిస్తున్న కట్టుకథలని తేల్చిచెప్పారు.
ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం చరమాంకానికి చేరిందన్న పుతిన్.. కొత్త ప్రపంచ ఆర్డర్లో రష్యా ముందుంటుందన్నారు. అమెరికా తమను తాము భూమిపై నడిచే దేవదూతలని అనుకుంటోందని, కానీ కొత్త ప్రపంచంలో ఆ ఆర్డర్ మారిపోతుందని చెప్పారు. రష్యా వంటి సార్వభౌమ రాజ్యాలు నిర్ణయాలు తీసుకుంటాయని అమెరికా భయపడుతోందన్నారు.
సుమారు 73 నిమిషాలపాటు ప్రసంగించిన పుతిన్.. ఆ తర్వాత రెండు గంటలపాటు క్వశ్చన్, ఆన్సర్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో జరుగుతున్న సైనిక చర్యను సమర్థించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార పదార్థాల రేట్లు పెరగడానికి రష్యానే కారణమంటున్న వాదనలను కూడా ఆయన తోసిపుచ్చారు.
కేవలం ఉక్రెయిన్ నుంచి ఆహార పదార్థాలు ఎగుమతి అవ్వకపోతే ప్రపంచం తలకిందులు అవదని స్పష్టం చేసిన ఆయన.. అప్పటికీ తాము ఆరు మార్గాలను సూచించినా కూడా ఉక్రెయిన్ ప్రభుత్వం మాత్రం ఆహార పదార్థాలను ఎగుమతి చేయలేదని వెల్లడించారు.