వాషింగ్టన్: పాలస్తీనాలోని గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. యుద్ధ క్షేత్రం గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తామని, ఆర్థికంగా అభివృద్ధి చేయడం ద్వారా అక్కడి ప్రజలకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు, ఇండ్లు కల్పించవచ్చని చెప్పారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూతో ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం నెతన్యాహూ సమక్షంలోనే ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
యుద్ధంతో దెబ్బతిన్న గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తాం. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే.. అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇండ్లు కల్పించవచ్చు. భవిష్యత్లో మధ్యప్రాచ్యం పర్యటన సందర్భంగా గాజా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాను సందర్శిస్తానని చెప్పారు.
ట్రంప్ ప్రకటనపై నెతన్యాహూ స్పందిస్తూ.. గాజాపై అమెరికా అధ్యక్షుడి ప్రకటన చరిత్రను మారుస్తుందన్నారు. అయితే హమాస్ మాత్రం దీనిని తీవ్రంగా ఖండించింది. ఆయన గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని హమాస్ నేత సమీఅబు జుహ్రీ అన్నారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టించడానికే ఈ ప్రకటన చేశారని విమర్శించారు. తమ ప్రజలు దీనిని ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించరని, వారి భూమి నుంచి వారిని తరలించడమే కాకుండా.. ఈ దురాక్రమణను అడ్డుకోవాల్సి ఉందని వెల్లడించారు.
కాగా, గాజా, వెస్ట్ బ్యాంక్లలోని పాలస్తీనీయులను తాత్కాలికంగా ఈజిప్ట్, జోర్డాన్ దేశాలకు తరలించాలని గతంలో ట్రంప్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే దీనిని అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఇటువంటి ఆలోచనలు ఈ ప్రాంతంలో సుస్థిరతకు ముప్పు తెస్తాయని, ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉందని, ప్రజలు ప్రశాంతంగా జీవించే అవకాశాలు ఉండవని ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ దేశాలు వెల్లడించారు. మధ్య ప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి పని చేస్తామని పేర్కొన్నారు.