టెహ్రాన్, జూన్ 22: ఇజ్రాయెల్, అమెరికా బాంబు దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది. ఇందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే దీనిపై ఇంకా ఆ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అరేబియా సముద్రాన్ని పర్షియన్ గల్ఫ్‌తో అనుసంధానం చేసే ఈ జలసంధి అత్యంత ఇరుకుగా.. ఒకచోట 30 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ప్రపంచ ఇంధనానికి అత్యంత కీలకమైన ధమని వంటిది. ఈ సలజంధి ద్వారా అత్యధికంగా చమురు రవాణా అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ చమురు, గ్యాస్ అవసరాల్లో 20 శాతం ఈ హర్మూజ్ ద్వారానే రవాణా అవుతుంది. అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ఓ ద్వీపకల్పానికి, ఇరాన్‌కు మధ్య ఈ ఇరుకైన జలసంధి ఉంది. ఈ మార్గం నుంచి రోజూ సగటున రెండు కోట్ల బ్యారెళ్ల చమురు, 29 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎల్ఎన్జీని వివిధ దేశాలకు రవాణా చేస్తారు. సౌదీ అరేబియా, ఇరాన్, అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్‌ల నుంచి ఎగుమతి అయ్యే చమురును ఈ మార్గం నుంచే పంపుతారు.
మూడింట ఒకవంతు ఎల్ఎన్జీ (ద్రవ రూపంలో ఉండే సహజవాయువు) కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ జలసంధి నుండి రవాణా అయ్యే 84 శాతం చమురు, 83 శాతం ఎల్ఎన్జీ ఆసియా మార్కెట్లకే వెళ్తుందని అమెరికా ఇంధన సమాచార సంస్థ తెలిపింది. ఇందులో 69 శాతం చమురు భారత్, చైనా, జపాన్, దక్షిణకొరియా దేశాలకు వెళ్తుంది.
హర్మూజ్ మూసివేతతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరా తీవ్రంగా ప్రభావితం కానుంది. ముఖ్యంగా ముడి చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలపై ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. చమురు ధరలు పెరిగితే ఆ ప్రభావం భారత్‌పై కూడా ఉంటుందని విదేశీ వ్యవహారాల నిపుణుడు రాబిందర్ సచ్దేవ్ చెప్పారు. ప్రపంచ మార్కెట్లో ఇప్పటివరకు 60 నుంచి 65 డాలర్ల వరకు ఉన్న బ్యారెల్ ధర 80 డాలర్ల వరకు పెరగవచ్చని భావిస్తున్నారు.
బ్యారెల్‌పై 10 డాలర్లు పెరిగితే దేశ జీడీపీ 0.5 శాతం ప్రభావితం అవుతుందని రాబిందర్ వివరించారు. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఆయిల్ ధరలు పెరగవచ్చని అన్నారు. ఇక భారత్‌కు చమురు దిగుమతుల విషయంలో ప్రత్యామ్నాయాలు ఉన్న నేపథ్యంలో హర్మూజ్ ప్రభావం తక్కువేనని భావిస్తున్నారు.హర్మూజ్ జలసంధి మూసివేయాలన్న ఇరాన్ నిర్ణయం ప్రభావం భారత్‌పై ఉంటుందని, అయితే అది అంత ఆందోళనకరం కాదని నిపుణులు పేర్కొంటున్నారు.
భారత్ ప్రతి రోజు 55 లక్షల బ్యారెళ్ల ముడిచమురును దిగుమతి చేసుకుంటుండగా.. అందులో 20 లక్షల బ్యారెళ్లు ఈ జలసంధి గుండానే వస్తాయి. హర్మూజ్ మూసివేతతో భారత్ రష్యా, అమెరికా, బ్రెజిల్, పశ్చిమ ఆఫ్రికా దేశాలపై ఆధారపడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌కు ప్రధాన వనరుగా ఉన్న రష్యా తన చమురు రవాణాకు హర్మూజ్‌పై ఎక్కువగా ఆధారపడదు.