Donald Trump | ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో జరుగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధికారులెవరూ హాజరుకాబోరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. శ్వేత జాతి రైతులతో క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల చివర్లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి తాను హాజరు కాబోనని ట్రంప్ గతంలోనూ ప్రకటించారు. నవంబర్ 22-23 తేదీల్లో జరిగే ప్రపంచంలోని ప్రముఖ, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల దేశాధినేతల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి తాను హాజరు కాబోనని ట్రంప్ గతంలో తెలిపారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన స్థానంలో హాజరవుతారని భావించారు. వాన్స్ ఈ శిఖరాగ్ర సమావేశానికి వెళ్లరని ట్రంప్ పేర్కొన్నారు.
జీ20 మీటింగ్‌కు వెళ్లడం శిఖరాగ్ర సమావేశం దక్షిణాఫ్రికాలో జరుగడం పూర్తిగా అవమానకరమని ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆఫ్రికానెర్ కమ్యూనిటీ (దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతులు)పై హింస, హత్య, భూములు, పొలాల స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం మైనారిటీ శ్వేతజాతి ఆఫ్రికనెర్ రైతులపై హింస, దాడులను ప్రోత్సహిస్తుందంటూ ట్రంప్ పరిపాలన ఆరోపించింది. అయితే, దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. ఆఫ్రికానెర్లపై జరిగిన దారుణాలకు సంబంధించిన అన్ని నివేదికలు నిరాధారమని.. ఈ విషయాన్ని ట్రంప్‌తో చెప్పానని అధ్యక్షుడు సిరిల్ రామసోఫా తెలిపారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి పౌరుల జీవన ప్రమాణాలు ఇప్పటికీ దేశంలోని నల్లజాతి పౌరుల కంటే చాలా మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. అయినా, ట్రంప్ పరిపాలన దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంది. ఈ వారం ప్రారంభంలో మయామిలో జరిగిన ప్రసంగంలో దక్షిణాఫ్రికాను జీ20 నుంచి బహిష్కరించాలని వ్యాఖ్యానించారు.