ఆదివారం 24 జనవరి 2021
International - Dec 12, 2020 , 14:40:54

సుప్రీంకోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ‌..

సుప్రీంకోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ‌..

హైద‌రాబాద్‌: అమెరికా సుప్రీంకోర్టులో అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను అడ్డుకోవాల‌ని చూసిన ట్రంప్‌ను సుప్రీంకోర్టు నిలువ‌రించింది.  టెక్సాస్ రాష్ట్రం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేసింది.  జార్జియా, మిచిగ‌న్‌, పెన్సిల్వేనియా, విస్కిన్‌స‌న్ రాష్ట్రాల ఫ‌లితాల‌ను ర‌ద్దు చేయాల‌ని టెక్సాస్ త‌న పిటిష‌న్‌లో కోరింది.  ఆ నాలుగు రాష్ట్రాల్లో బైడెన్ గెలుపొందారు. అయితే టెక్సాస్ వేసిన పిటిష‌న్‌కు 18 మంది అటార్నీ జ‌న‌ర‌ల్స్‌, 106 మంది రిప‌బ్లిక‌న్ స‌భ్యులు మ‌ద్దతు ఇచ్చారు. కానీ సుప్రీం త‌న ఆదేశాల్లో ఆ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించింది.  ఆ కేసును దాఖ‌లు చేసేందుకు టెక్సాస్ రాష్ట్రానికి అర్హ‌త లేద‌ని సుప్రీం పేర్కొన్న‌ది. న‌వంబ‌ర్ 3వ తేదీన జ‌రిగిన దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.  అయితే ఆ ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, ఫ‌లితాల‌పై సుప్రీంకోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు  గ‌తంలో ట్రంప్ వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో సుప్రీం తీర్పు ట్రంప్‌కు తీవ్ర నిరాశ‌ను మిగిల్చింది. 


logo