US Shutdown | అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ (US Shutdown) ప్రకటించిన సరిగ్గా 40 రోజులైంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్డౌన్గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ షట్‌డౌన్‌తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ షట్‌డౌన్ దేశంలోని పలు విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం పడిన (Flights) విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ షట్డౌన్కు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది. అనంతరం పరిశీలన కోసం ప్రతినిధుల సభకు పంపింది.
డెమోక్రటిక్ సెనేటర్లు జీన్ షాహీన్, మ్యాగీ హసన్.. రిపబ్లికన్ లీడర్ జాన్ థూన్, వైట్‌హౌస్ ప్రతినిధులతో కలిసి వారాంతంలో జరిపిన చర్చలు ఫలించాయి. ఈ బిల్లు ప్రకారం చాలా ఫెడరల్ ఏజెన్సీలకు జనవరి వరకు నిధులు అందుతాయి. షట్‌డౌన్ కారణంగా ప్రభావితమైన ఫెడరల్ ఉద్యోగులందరికీ బకాయిపడ్డ జీతాలను చెల్లించేందుకు హామీ ఇచ్చారు. డెమోక్రటిక్ కీలక నేత చక్ షుమర్ ఈ బిల్లును వ్యతిరేకించారు.
ఆరోగ్య సంరక్షణ చట్టం కింద సబ్సిడీల సహా పలు సమస్యలను పరిష్కరించలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఓటింగ్ సందర్భంగా కొద్ది మంది డెమోక్రాట్ల నుంచి రిపబ్లికన్లకు మద్దతు లభించింది. ఎనిమిది మంది డెమోక్రటిక్ సెనేటర్లు తమ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా బిల్లుకు మద్దతు పలికారు. దీంతో 60 ఓట్ల మెజారిటీతో ఈ కీలక బిల్లుకు ఆమోదం లభించినట్లైంది.
Also Read..
“US Shutdown | షట్‌డౌన్ ఎఫెక్ట్‌తో అమెరికా కీలక నిర్ణయం.. విమాన సేవల్లో 10 శాతం కోత”