వాషింగ్టన్, ఆగస్టు 30 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు గల అత్యవసర అధికారాల కింద విధించిన చాలా సుంకాలు చట్టవిరుద్ధమని ఫెడరల్ అప్పీళ్ల కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. తన వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పును ట్రంప్ సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వం అమెరికా సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ అక్టోబర్ 14 వరకు సుంకాల కొనసాగింపునకు ఫెడరల్ కోర్టు అనుమతించింది. ఈ ఏడాది ఏప్రిల్లో వాణిజ్య యుద్ధంలో భాగంగా విధించిన ప్రతీకార సుంకాలు, చైనా, కెనడా, మెక్సికోపై ఫిబ్రవరిలో విధించిన సుంకాల చట్టబద్ధతను వాషింగ్టన్ డీసీలోని ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు ప్రశ్నించింది. అమెరికాకు చెందిన వ్యాపారులు దాఖలు చేసిన ఒక కేసు, డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్న 12 అమెరికన్ రాష్ర్టాలు వేసిన మరో కేసుపై అప్పీల్స్ కోర్టు తాజా తీర్పు వెలువరించింది. రాజ్యాంగం ప్రకారం పన్నులు లేదా సుంకాలను విధించే అధికారం కాంగ్రెస్కు (చట్ట సభ) మాత్రమే ఉంటుందే తప్ప అధ్యక్షుడికి కాదని కోర్టు స్పష్టం చేసింది.
సుంకాలు విధించే చట్టపరమైన అధికారం అధ్యక్షుడికి లేదని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు చెప్పినప్పటికీ వివిధ దేశాలపై తాను విధించిన సుంకాలు అమలులోనే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం స్పష్టం చేశారు. ఫెడరల్ అప్పీల్స్ కోర్టు నిర్ణయాన్ని తప్పుగా ఆయన అభివర్ణిస్తూ తాను విధించిన సుంకాలు రద్దయితే అమెరికా వినాశనానికి అది దారి తీస్తుందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ పోస్టులో ఆందోళన వ్యక్తం చేశారు.
ట్రంప్ విధించిన సుంకాలు రద్దయిన పక్షంలో ఇప్పటివరకు వసూలు చేసిన దిగుమతి సుంకాలను అమెరికా ప్రభుత్వం ఆయా దేశాలకు వాపసు చేయాల్సి వస్తుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ అవుతుందని భావిస్తున్నారు.